Sun 11 Jul 05:55:16.12637 2021
Authorization
బోనాల పండుగొచ్చిందంటే ఊరంతా సందడి సందడిగా మారిపోతుంది. సందడి అంటే మనుషులు కూడటం, దేవతకు నైవేద్యం పెట్టడం, డప్పు కొట్టడం, పసుపూ కుంకుమలు పూదిచ్చి, వేప మండలు కట్టి కడవలను తలపై పెట్టుకుని గుంపులు గుంపులుగా స్త్రీలు పురుషులు అమ్మోరు ఆలయాలకు వెళ్ళడం, కోడినో, మేకపోతునో ఇచ్చి ప్రాణాలకు రక్షణ కల్పించమని మొక్కడం, వేడుకోవడం, నా చిన్నతనంలో రంగులద్దిన రథాలు కదిలిపోతున్న దృశ్యంలా కనపడేది. పిల్లలుగా మా కన్నులు పండుగ చేసుకునేవి.
బోనాలంటే భోజనం. దేవతకు అన్నం వొండి ఊరేగింపుగా తీసుకెళ్ళి అర్పించడం చేస్తారు. అమ్మ చెప్పేది, 'ఆషాడంలో వచ్చే ఈ పండుగలప్పుడు ఓ కోడిని అమ్మోరుకు అర్పిస్తే మన ఆరోగ్యాలు పాడవకుండా కాపాడుతది బిడ్డా' అని. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారమిది. ఈ బోనాల పండుగను ఎక్కవగా పేదలు, మధ్య తరగతి ప్రజలు జరుపుకుంటారు. అగ్రవర్ణాలు, ధనిక వర్గాలు జరుపుకోగా నేనయితే చూడలేదు. దేవత అవసరం పేదలకే ఎక్కువ. ఎందుకంటే, కష్టాలు చుట్టుముట్టేది ఎక్కువగా వాళ్ళనే కదా! అనారోగ్యాలు వాళ్ళనే వెంటాడుతాయి. మృత్యువు కబళించేదీ వారినే.
కష్టాలు, కడగండ్లు, భయాలు మొదలైనప్పటి నుండే దేవతల అవసరం ఆరంభమయిందనేది మనం ఎప్పుడూ చెప్పుకుంటున్న విషయమే. 'నేనున్నాను, అన్నీ చూసుకుంటాను' అనే ఒక భరోసా మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత శక్తిని నింపుతుందో! అట్లా మనల్ని కాచేవాడు ఒకడున్నాడు. మనం వేడుకోవడమే చేయాల్సింది అన్న తలంపు అనాదిగా ప్రజల జీవనంలో కొనసాగుతున్నది. ఆ సందర్భానికి కొన్ని పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లలోనూ ఉన్నత వర్గాల వారు పెట్టుకునేవి, నిమ్న వర్గాలు ఏర్పాటు చేసుకున్నవి వేరువేరుగా వుంటాయి. ఉన్నత వర్గాల్లో వ్రతాలుంటాయి. పేదవాళ్ళ ఇళ్ళల్లో నోములంటారు. అభిషేకాలు, అర్చనలు ఒక వైపు మొక్కులు ముడుపులు మరో వైపు. 'బోనాలు' అనే మాట సాధారణ శ్రామిక జనంలోంచి వచ్చిన పదం. సామాన్యులకు బువ్వ చాలా ముఖ్యమైనది. అందుకనే అదే పదాన్ని దేవతను కొలిచేందుకూ పెట్టుకున్నారు. జనులు ఏవైతే ఆహారంగా వినియోగిస్తారో దేవతకు కూడా అవే పెడతారు.
వర్షాకాలంలో వచ్చే ఈ బోనాల పండుగ సందర్భంగా, ఈ కాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులు, ముఖ్యంగా వెనకట కలరా చలిజ్వరాలు విస్తరించేవి. అలాగే వర్షాలు పడి నీరు కలుషితమవటంతో వచ్చే రోగాలు రాకుండా చూడమని వేడుకోవడం చూస్తాము. హైద్రాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో బోనాలు పెద్ద యెత్తున జరుపుతారు. ఆ సమయంలో అమ్మోరు 'రంగం' నిర్వహిస్తారు. పరిపాలనా ఫలాల గురించీ భవిష్యవాణి పలుకుతుంది. ఎలా వుంది. ఎలా వుండబోతోంది కూడా. ప్రజలు ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా హెచ్చరిస్తుంది. నాయకులు ఏం చేయాలో వివరిస్తుంది. ఇదంతా ఒక రకమైన సమీక్షలాంటిది. దేవత పేరుతో జరిగే ఓ వ్యాఖ్యానం.
ఏదిఏమైనా బోనాల పండుగ తెలంగాణలో ప్రజలు సమూహంగా జరుపుకునేది. వారి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకోవాలి. పరిపాలకులు సామాన్యుల ఆరోగ్యానికి భరోసానివ్వాలి. వైద్య రంగాన్ని పటిష్ట పరచాలి. కలుషితం కాని మంచినీటిని అందరికీ అందించాలి. ఈ కరోనా కాలాన అందరికీ కడుపు నిండా భోజనం అందాలి.