Sun 18 Jul 05:34:42.436112 2021
Authorization
''ఆకాశంబున నుంచి శంభుని శిరం, బందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి యస్‌తో కాంబోధి, పయోధి నుండి పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష! పెక్కుభంగులు వివేక భ్రష్టసంపాతముల్'' అన్నాడు శతక కర్త. ఒక్కసారి దిగజారటం మొదలయితే ఇక ఆగదు. పాతాళంలోకి పోవడమే. కనీస తెలివిని విచక్షణను కోల్పోయే వారి మాటలు గానీ, ప్రవర్తనలుగానీ పతనమౌతూ దిగజారిపోతాయి. ఆ దిగజారుడు మరీ నీచంగా మారిపోతుంది.
అలాంటి నీచమైన దిగజారుడు తనానికి ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యాఖ్యానాలు, విమర్శలు అద్దం పడుతున్నాయి. ఎదురెదురుగా మనుషులు ఎన్నయినా మాట్లాడుకోవచ్చు. విమర్శలు సంధించుకోవచ్చు. నిందించుకోవచ్చు. వాదనలకూ దిగవచ్చు. కానీ మనిషిపోయిన తర్వాత, అతనిపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం, ఇలా మాట్లాడటం వల్లనే పోయాడని, మంచి శిక్ష పడిందని, ఒక మరణాన్ని ఆనందిస్తూ మాట్లాడటం చూస్తుంటే ఇంత నీచమైన సంస్కృతిలోకి మనం దిగజారుతున్నామా! అనిపిస్తుంది.
ఇటీవల సినిమా విమర్శకులు, నటులు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వారం రోజులుగా చికిత్స పొందుతూ కోలుకుంటాడని అనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా చనిపోవటం జరిగింది. ఇది కూడా అనుమానాస్పదంగా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక దళిత మేధావి, సామాజిక కార్యకర్త మన సమాజంలో వున్న ఛాందస భావాలకు, మనువాదానికి వ్యతిరేకంగా మాధ్యమాలలో తీవ్రమైన చర్చలలో పాల్గొన్నారు. తనవాదాన్ని బలపరిచే విధంగా అనేక విషయాలను వెల్లడించేవారు. కొన్ని వివాదమై పెద్ద దుమారాన్ని లేపాయి. అన్నింటిలోనూ ప్రజాస్వామ్య బద్ధంగానే అతను వ్యవహరించాడు. నిష్కర్షగా విమర్శలు సంధించేవారు. సినిమా విశ్లేషణలూ అంతే స్పష్టంగా చేశారు. అది నచ్చని వారు అతన్ని నిందించటం బతికున్నప్పుడే జరిగింది. ప్రశ్నించటం, ధిక్కరించడం సహించలేని వారు సమాధానాలు చెప్పలేక అప్పుడే బెదిరింపులకు దిగారు. అయినా దేనికీ తలొగ్గకుండా తన వాదనతోనే కొనసాగాడు మహేష్.
అతనిప్పుడు లేడు. మరణించాడు. అట్లాంటి వ్యక్తిపై మనసులో ఎంత ద్వేషమున్నప్పటికీ బహిరంగంగా చావును ఆనందించే పనికి పూనుకోవటం చూస్తుంటే మనుషులు ఎంత హీనంగా మారారో అనిపిస్తుంది. దేశంలో, ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు దేవుణ్ణి నమ్మని వాళ్ళున్నారు. చాలా మంది పూజించే దేవుళ్ళకు వాళ్ళ మహత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారూ వున్నారు. ఎవరి అభిప్రాయం వారిది. నాస్తిక, హేతువాద ఉద్యమకారులు, పూర్వం చార్వాకులు, లోకాయుతులు, పెరియార్ రామస్వామి మొదలైన వారెందరో తమ తమ వాదనలతోనే ముందుకు పోయారు. మానవుడు, మానవత ప్రధానమని ప్రచారం చేశారు. దేవుణ్ణి చూపించి మూఢ విశ్వాసాలను అవలంభించడాన్ని ఖండించారు.
వాదమేదైనా మనిషి బతికుండాలి. మనుషుల కోసమే ఏ వాదమైనా. ప్రశ్నించడమూ, వాదించడమూ విజ్ఞాన సముపార్జనకు మూలమయినది. అలా ప్రశ్నించి, తనవాదాన్ని వినిపించిన కత్తి మహేష్‌పై ఆ రకమైన చౌకబారు, హీన, నీచ నికృష్ణ రీతిలో వ్యాఖ్యానాలు రావటం మన కుసంస్కృతిని, దానిని పెంచి పోషిస్తున్న ఒక అరాచక మతోన్మాదాన్ని బయట పెడుతుందే తప్ప మానవీయతను కాదు.