Sun 25 Jul 04:36:23.557005 2021
Authorization
బంధువులంటే మన కుటుంబంతో సంబంధమున్న వ్యక్తులు, అత్త, మామ, పిన్ని, బాబాయి, పెదనాన్న, పెద్దమ్మ ఇలా ఎవరైనా కావొచ్చు. వీళ్ళు కూడా ఇంతక్రితం కుటుంబ సభ్యులుగానే వున్నారు. కానీ ఒప్పుడు బంధువులనే అంటన్నాము. ఇది వేరే విషయం. మన రక్తంతో సంబంధమున్న వ్యక్తుల పరంపరను బంధువులుగా పిలుస్తాము. బంధువుల్లో కూడా దూరపు బంధువులుంటారు. అంటే పెదన్నాన్న అత్తగారి చిన్నమ్మ కొడుకని, అమ్మగారి వేలు విడిచిన మేనమామ చిన్న కొడుకని, ఇలా చెప్పుకుంటుంటారు. ఇలా అధిక బంధు వర్గం వుండటం కూడా గర్వకారణంగానే వుండేది ఒకప్పుడు. పెద్ద బలగం కలిగిన కుటుంబమనీ అంటారు.
మనమేలును, బాగును, అభివృద్ధిని కోరుకునే వారే బంధువులు. ప్రేమను పంచే అనుబంధం కలిగి వున్న వారిని, ప్రేమను పంచే వారిని బంధువుగా భావిస్తాము. ఇంకా చుట్టము, సంబంధీకుడు, స్వజనుడు, స్వపక్షము, బాంధవుడు, స్వగోత్రికుడు, మిత్రుడు అనే పర్యాయపదాలు అనేకమున్నాయి. ఏదేమయినా బంధము కలవాడు బంధువు. మన మంచిని కోరేవాడే బంధువు. దూర బంధువులున్నట్లుగానే ఆత్మబంధువులూ వుంటారు. ఆత్మబంధువు అంటే మనసెరిగిన వాడని అర్థం. మన మనసుకు అనుకూలంగా మసలేవారని, అంతకంటే దగ్గరి వారెవరూ వుండరని చెప్పవచ్చు.
ఇక దీనులను కాచేవాణ్ణి దీన బాంధవుడు అంటారు. దీన బాంధవుడు శివుడు. భక్తులందరూ పరమశివుణ్ణి బంధువుగానే భావిస్తారు. అంటే బంధువు అనే శబ్దానికి రక్షించే లక్షణమూ వుంటుందని తెలుస్తుంది. కాబట్టి కేవలం కుటుంబం, వంశంతో సంబంధం మాత్రమే కాక ఆపదలో వున్నపుడు ఆదుకొనే వారు, రక్షణగా నిలిచేవారు, అనుకూలంగా వ్యవహరించేవారు ఎవరైనా బంధువు కిందనే లెక్క. మన బాగు కోసం ఆలోచించే వారందరూ బంధువులే. బంధువు అనే మాటకున్న విస్తృత భావనను ఇప్పటివరకు చర్చించాము.
అయితే పదాలు, మాటలు కొనసాగుతున్నాయి కానీ అనుబంధాలు, ఆప్యాయతలు, తమ వారి మేలు, క్షేమం కోరుకుని పనిచేయటం, ఆదుకోవటం మాత్రం ఈనాడు అడుగంటిపోతున్నది. ఇంత క్రితం బంధుజనమంతా ఉన్నతంగా అభివృద్ధి చెంది వుంటే మనకూ బలమని భావించే వాళ్ళము. కానీ ఇప్పుడు అందరికంటే నేనే అధికుడుగా వుండాలని కోరుకుంటున్నాము. ఇది కుటుంబ సంబంధాలలో వచ్చిన మార్పుతో వచ్చిన మనస్తత్వం. సమాజంలో భూమితో వున్న సంబంధాలు ఎప్పుడైతే తెగిపోయాయో, భూమి ఆధారిత వృత్తులు, గ్రామీణ జీవనం మారిపోయిందో అప్పటి నుండి ఆలోచనల్లో మార్పు వచ్చింది. కుటుంబమంటే ఇప్పుడు తల్లిదండ్రి, ఇద్దరు పిల్లలు మాత్రమే. డబ్బుతో కూడుకున్న ఆదాయాలు, అనుబంధాలు. అమ్ముకోవడం, కొనుక్కోవడం జీవితంలో ఎప్పుడు ఎక్కువయిందో బాంధవ్యాలూ ఆ వైపుగానే మారిపోయాయి. బంధువంటే ఇప్పుడు ఏదో ఒకరోజు కలుసుకునే వారుగానే మిగిలిపోయింది. ఎవరి గురించీ ఎవరూ ఆలోచించే పరిస్థితులు లేకుండా పోయాయి.
ప్రభుత్వాలు తమ పథకాలకు 'రైతు బంధు' 'దళిత బంధు' అని నామకరణం చేసి ఆయా సమూహాలను ఆదుకుంటామని చెబుతున్నది. మరి ఈ బంధువులు ఎంత మేర ఆదుకుంటాయో! ఏ కొనుగోళ్ళు, అమ్మకాల దగ్గర ఆగిపోతాయో వేచి చూడవలసిందే. బంధువు అనే మాటకే ఆచరణలో అర్థాలు మారిపోయిన తరుణంలో పథకాలు బంధువులా కొనసాగడం కష్టతరమైన విషయమే. ఏదైనా మొత్తం అభివృద్ధికి దోహదపడే పనులే నిజమైన బంధు వార్థాన్ని నిరూపిస్తాయి. కానీ ఏదో ఒక సందర్భంకోసమో, తక్షణ అవసరం కోసమో, మనకు పనికి వస్తాడనే ప్రయోజనాన్ని ఆశించో చేసే సహాయం జీవితాలను ఉన్నతంగా తీర్చలేదు. అందుకనే బంధుత్వపు మాటలో దాగి వున్న నిజమైన బాంధవ్యాల్ని మానవ సంబంధాన్ని పొందాల్సిన అవసరం వుంది. ఆ పేర పెట్టిన పథకాలూ నిజ బంధువుగా కొనసాగాల్సి వుంది.