Sat 31 Jul 21:13:00.349301 2021
Authorization
'స్నేహమేరా జీవితానికి, వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటల నీడనిచ్చే మల్లెరా!' అని కవి హాయిగా స్నేహాన్ని గూర్చి పాడతాడు. నిజంగానే స్నేహం అంత గొప్పది చల్లనిదీ. స్నేహాన్ని చవిచూడని వారు వుండరన్నది నిజం. స్నేహానికి పునాది ఇరువురి అభిప్రాయాలు, అభిరుచులు, ఒకటి కావడమూ సహచరులై ఉండటమూ కారణం. వయసూ, ప్రాంతాలు వేరైనప్పటికీ, మనలాంటి దేశంలోనయితే కులమూ మతమూ వేరైనప్పటికీ స్నేహం చేయటానికి, అవి అడ్డంకిగా ఏమీ నిలువవు. వాటి ఆధారంగా ఏర్పడ్డ వాటిని అసలు స్నేహమనే అనము.
స్నేహం అనేది మానవ జాతి ఒనగూర్చుకున్న ఓ మానవీయ సంబంధం. ఒక కుటుంబంలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉన్న అనుబంధాలకంటే స్నేహితులతో ఉండే బంధం చాలా ఉదాత్తమైనది. ఎదుటివాని హితాన్ని కోరుకుంటూ కలిసి ప్రయాణించడాన్ని స్నేహం అంటాము. స్నేహం కోసం ప్రాణాలను ఇచ్చిన సంఘటనలు మనం చరిత్రలో చూస్తాము. సాధారణంగా సమ వయస్కుల మధ్య ఈ స్నేహం ఏర్పడుతుంది. చాలా అరుదుగా వయో భేదాలతో స్నేహితులవడం చూస్తాము.
బడి యీడులో స్నేహితులు లేకుండా ఎవరూ వుండరు. అది పీర్ గ్రూప్ సంబంధంగా ఆరంభమయినప్పటికీ, ఆ తరువాత్తరువాత ఏర్పడి కొనసాగేవి, ఆలోచనలు, అభిప్రాయాలు, వేదనలు, సవాళ్ళు, దు:ఖాలు, సంతోషాలు అన్నీ పంచుకుంటూ ఒక అవగాహనతో ఏర్పడేవే స్నేహాలు. అసలు స్నేహితులు, స్నేహాలు అనే భావనకు అంకురార్పణ జరగటానికి, కుటుంబాలలోని సభ్యుల మధ్య సమాజంలోని సమూహాల మధ్య వున్న ఆధిపత్యపు విభజనలు, అధికార కేంద్రీకరణలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రకమైన హైరార్కీ వుంటుంది వీటిల్లో.
స్నేహమనేది స్వేచ్ఛకూ ప్రజాస్వామిక దృక్పథానికి కావలసిన స్పేస్‌ను ఇవ్వగలుగుతుంది. మానవ సమూహాలు నిర్మించుకున్న సంస్కృతిలోని ముఖ్యాంశమేమంటే, బాధను, ఆలోచనను, ఆవేదనను పంచుకోవటానికి చెప్పటానికి ఒక తోడును, సమూహాన్ని కలిగి వుండటం. అంటే వినే వాళ్లు వుండటం. విని ఓదార్పునో సాంత్వననో ఇవ్వగలిగే సహచరులను కలిగి వుండటమే ఇది పెద్ద సాంస్కృతిక విజయం. ఇది స్నేహంలోనే సాగుతుంది. భయాలు, దాపరికాలు, మొహమాటాలు, చిన్నా పెద్దా వ్యత్యాసాలు, అహాలు ఏమీలేని చోటు స్నేహం. అందుకే స్నేహం మధురమైనది. మరుపురానిది. నిజమైన స్నేహితుడు మనం చేసే తప్పులను, పొరపాట్లను సరి చేస్తాడు. మనం ఏమి చేస్తే ఎదగుతామో సూచిస్తాడు. జీవితంలో ఏ సవాలు ఎదురైనా నాకు స్నేహితుడున్నాడనే ధైర్యం ఎంతో విలువైనది.
స్నేహాల్లో మంచి స్నేహాలు చెడు స్నేహౄలూ వుంటాయి. చెడు వ్యక్తులతో కలిగే స్నేహం మనల్ని కూడా అటువైపే వెళ్ళేందుకు దోహదం చేస్తుంది. మన విచక్షణతో తెలుసుకోవాల్సిన అంశాలివి. ప్రపంచంలో గొప్ప స్నేహితులు చాలా మందే వున్నారు. కానీ ప్రపంచం గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ జీవితాలను అందుకే అంకితం చేసిన మార్క్స్ ఎంగెల్సులు ఎంతో ఆదర్శంగా నిలుస్తారు. అలాగే ఫిడేల్ కాస్ట్రో, చెగువేరా కూడా సమాజ మార్పు కోసం అంకితమయిన స్నేహితులు. వాస్తవంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కూడా స్నేహ సంబంధమే అని ఆధునిక వైతాళిక కవి గురజాడ చెప్తారు. స్నేహంలో విమర్శ వుంటుంది. ఆత్మ విమర్శా వుంటుంది. మనస్సును పంచుకోవటానికి మహా వేదికలా నిలడబడేదే స్నేహం. అందుకే అప్పుడెప్పుడో ''అల్లాయే దిగివచ్చి, ఏమి కావాలంటే... మీద్దెలొద్దు, మేడలొద్దు, పెద్ద లెక్కే గద్దెలొద్దంటాను, ఉన్ననాడు, లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే, ఒక్క దోస్తే చాలంటాను'' అని పాడగలిగాడు. అందుకే స్నేహం వర్ధిల్లాల్లి!