Sun 08 Aug 00:17:55.72323 2021
Authorization
'యువతరం శిరమెత్తితే... నవతరం గళమెత్తితే... లోకమే మారిపోదా! చీకటే పారిపోదా!' అంటూ మా యువ వయస్సులో పాడుకున్నాము. ఆగస్టు 12 యువకుల దినోత్సవమని తెలియగానే నలభై యేండ్ల క్రితపు వయసులోకీ ఒక మారు తొంగి చూసుకుంటున్నాను. అవును! యువకులు ఏదైనా చేయాలనుకుంటే అడ్డేమీ వుండదు. ఏదైనా సాధించవచ్చనే శక్తితో కూడిన ఆలోచనలు జనించే వయసది. అందుకే స్వామి వివేకానందుడు 'నాకు ఉక్కు గుండెలు, కండరాలూ కల పది మంది యువకులను నాకివ్వండి. నేను ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను' అన్నాడట. గుండెల నిండా విశ్వాసము, నవనవలాడే శక్తి కలిగి వుండే యవ్వనం అద్భుతాలు సృష్టించగలదు. యువతలో వేడి రక్తం అలా ఉప్పొంగుతూ వుంటుంది.
ఎక్కడయినా, ఎప్పుడయినా యువకులుగా వున్నపుడు జ్ఞానాన్ని అతి వేగంగా గ్రహించగలుగుతాము. పనులు, ఘనకార్యాలు, పరిశోధనలు చేయడానికి అనువైన కాలమది. మనదేశంంలో భగత్సింగు, రాజ గురువు, సుఖ్‌దేవ్ మొదలైన వీర కిశోరాలు దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ప్రేరణాభరితం చేయగలిగింది యువకులుగా వున్నపుడే. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు కూడా యువకులుగా వున్నపుడే మహౌద్యమాలను నిర్మించారు. సుందరయ్య, నంబూద్రిపాద్ లాంటి కమ్యూనిస్టు నేతలు యువ వయస్సులోనే సమసమాజ లక్ష్యాల కోసం జీవితాలను వెచ్చించడం ఆరంభించారు. ఇక్కడేకాదు ప్రపంచంలోనూ కార్ల్‌మార్క్స్ యువకుడిగానే సమస్త ప్రపంచాన్ని గూర్చి ఆలోచించి నూతనావిష్కరణలు చేశాడు. ఫిడెల్ కాస్ట్రో, చేగువేరా విప్లవ బాటల్లో పురోగమించారు. ప్రపంచ ప్రసిద్ధ సాహితీ విమర్శకుడు క్రిష్టఫర్ కాడ్వెల్ భౌతిక శాస్త్ర అధ్యయనాలనూ యుక్త వయసులోనే చేసి ప్రపంచానికి అందించాడు. మన శ్రీనివాస రామానుజన్, సి.వి.రామన్లూ యువ శాస్త్ర పరిశోధకులు. మన తాత్వికులు శంకరాచార్యులు, స్వామి వివేకానందుడు, బుద్ధుడు యువకులుగా వున్నపుడే తాత్విక సిద్ధాంతాను ప్రపంచానికి బోధించారు. క్రీడాకారులు, కళాకారులు అందరూ యవ్వన ప్రాయంలోనే గొప్ప నైపుణ్యాలను, ఘనతలను సాధించారు. వయసు పెరుగుతున్న కొలది నైపుణ్యానుభవం పెరుగుతుంది గానీ నైపుణ్య గ్రహణ శక్తి యువతకే అధికంగా వుంటుంది.
ఇంతటి శక్తియుక్తులు విరాజిల్లే యుక్త వయసులో ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి పెడితే, ఆచరణలో కదిలితే యువత సాధించలేనిది ఏదీ వుండదు. అలాంటి యువత నేడు శక్తిహీనంగా, ఉత్సాహ రహితంగా, నిర్లిప్తంగా నిరాసక్తంగా వుంటోంది. స్పందన రాహిత్యం ఎక్కువగా కనపడుతోంది. మనకెందుకులే, నాకేంటి? అనే ఆలోచనలతో వారి శక్తిని వైయక్తికానికే పరిమితం చేస్తున్నారు. ఇంకోవైపు జీవితాన్ని అనుభవైక వేద్యంగా మలుచుకోవటమే లక్ష్యంగా మారింది. ఎంజారు చేయాలి, సెలబ్రేట్ చేయాలి, ఇంతకు మించి ఏమీ లేదనే మార్కెట్ వినియోగదారి తత్వాన్ని వొంటబట్టించుకుంటున్నారు. ఎంజారుమెంట్, సెలబ్రేషన్ అనేవి జీవితంలో ఒక భాగమే కాని, అదే జీవితం కాదు. సరుకు వ్యామోహాల మోజులో పడి జీవితాన్ని తాకట్టు పెట్టడమే నేటి యువత చేస్తున్నది. ఇక రెండో వైపు సరైన ఉపాధి లేక, చదువుకూ పనికీ పొంతనలేక, నిరుద్యోగంతో ఎలా బతకాలో తెలియక అభద్ర జీవితాలను ఈడుస్తున్న యువత అనేక మూఢ విశ్వాసాలకు, మత్తు అలవాట్లకు బానిసలై పక్కదారులు పడుతున్నారు. ఇదంతా నేటి వ్యవస్త ప్రభావ ఫలితం.
అందుకే శ్రీశ్రీ 'కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దురాచిప్పలు, నూతిలోని కప్పలు!' అంటూ పాడిన కవే 'కొంత మంది యువకులు ముందుతరం దూతలు, భావన నవ జీవన బృందావన నిర్మాతలు' అని చైతన్యవంతులైన యువతను ఆహ్వానించారు. కాబట్టి నేటి యువత చైతన్యయుతంగా ఆలోచించాలి. మన భవిష్యత్తుకు మనమే కర్తలము. ఈ ఆటంకా, అనర్ధాల, అపసవ్య పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడి బాగు చేసుకోవాల్సిన అవసరం వుంది. ఇప్పుడు మీ శక్తిని ఉపయోగించి ఉన్నత లక్ష్యాలను సాధించగలిగితే రేపటి తరాలు కూడా మీ బాటలో పయనిస్తూ మిమ్ములను గౌరవిస్తారు. యువ శక్తితో పాటు యువకులంతా సంఘటిత శక్తిగా మారితే మారనిదేమీ లేదు ఈ లోకంలో.