Sun 22 Aug 05:00:43.602422 2021
Authorization
మనతోపాటుగా పుట్టిన ఆడకూతురిని తోబుట్టువు అంటారు. తోడ పుట్టిన వారి మధ్య వుండే సంబంధాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యం గలవిగానే కొనసాగుతున్నాయి. అయితే మానవ సంబంధాలలో వచ్చిన మార్పుల ప్రభావాలు వీటిపై కూడా పడకుండా ఎలా వుంటాయి. వెనకట ఆడపిల్లను ఇంట్లో అందరూ అపురూపంగా చూసుకునే వారు. ఎందుకంటే యుక్త వయసు వరకే ఇంట్లో వుంటుంది. ఆ తర్వాత పెళ్ళి చేసి పంపిస్తారు కదా! అంతేకాకుండా ఇంట్లో ఆడకూతురు ఉండటం వల్ల సంప్రదాయకంగా కొన్ని సందర్భాలు, ఉత్సవాలు కళాత్మకంగా కన్నుల పండుగగా వుంటాయి. వీటితోపాటే వివక్షతలూ వుంటాయి. అది వేరే చర్చ. కానీ అన్నాచెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య చిన్న చిన్న కీచులాటలు, తగాదాలు, అలకలు, కొట్టుకోవడాలు మరిచిపోలేని జ్ఞాపకాలు. పేదల ఇండ్లళ్ళలోనైతే అక్క, సగం తల్లి పాత్రను నిర్వహించి తమ్ముళ్ళను సాకుతుంది. తల్లులు అకాలంగా మరణిస్తే, పిల్లల్ని అక్కలు పెంచి పెద్ద చేసిన సంఘటనలు కోకొల్లులు.
కుటుంబం సమాజంలో ఒక యూనిట్‌గా వున్న తరుణంలో చిన్నపిల్లలు అందరూ ఎంతో ప్రేమతో, ఆప్యాయతలతో పెరుగుతారు. ఒకరి క్షేమాలొకరు జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. పెరిగి, మళ్ళీ ఎవరి కుటుంబాలు వారివి ఏర్పడగానే ప్రాధాన్యాలు మారిపోతాయి. మేం యువకులుగా వున్నపుడు 'అంతులేని కథ' సినిమాలో జయప్రద అక్క పాత్రలో తమ్ముళ్ళనూ, అన్నను, చెల్లెళ్లను తను కష్టపడి పోషిస్తుంది. తన జీవితాన్ని వాళ్ళ కోసమే ధారపోస్తుంది. నిజ జీవితాల్లో అలాంటివీ వుంటాయి. ఆడపిల్లలకు పెళ్ళి అనేది ఒక 'వలస' సందర్భం. సగం జీవితం అమ్మనాన్న, అన్నతమ్ముళ్ళతోనైతే మిగతాది భర్త, పిల్లలతో. పాతికేళ్ళ అనుబంధాలను వొదిలేసి మరో ప్రదేశంలో కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంది. అందుకే ఆ జ్ఞాపకాలను, అనుబంధాలను వొదులుకోలేక అప్పుడప్పుడూ అమ్మగారింటికి వస్తుంది. అమ్మనాన్నలు లేకుండా అన్నావదినలో, తమ్ముడూ మరదలు ఇల్లో. అదే వారికి అమ్మగారిల్లవుతుంది. అమ్మానాన్నలు పోయింతర్వాత ఇప్పుడంతగా తోబుట్టువులు వచ్చిపోవటం పెద్దగా జరగటం లేదు. అంత ఆదరణా వుండటం లేదు.
'చెల్లిలి కాపురం' అనే సినిమాలో చెల్లి సంసారం బాగుండాలని తన పేరును జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తాడు అన్నయ్య. అక్కల త్యాగాలు వున్నట్టుగానే అన్నల త్యాగాలనూ చూస్తాము. ఇప్పుడు ఆ సెంటిమెంటు పండే పరిస్థితులు నిజ జీవితంలో లేవు కాబట్టి సినిమాలు అలాంటివి రావటం లేదు. అత్తవారిళ్ళల్లో తోబుట్టువు కష్టాలు పడుతుందని తెలిస్తే, చెల్లి కష్టాలను తీర్చటం కోసం ఏ పనికైనా ఎంతటి త్యాగానికైనా పూనుకునేవారు. ఇప్పుడు చాలా వరకు ఎవరి జీవితాలను వాళ్ళు చూసుకోవటమే కష్టంగా మారిపోయింది.
అయినా తోబుట్టువులతో వున్న ప్రేమైక సంబంధాన్ని అప్పుడప్పుడయినా గుర్తు చేసుకోవటానికి కొన్ని పండుగలూ మనకున్నాయి. అందులో అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచేవి 'రాఖీ పౌర్ణమి' శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగ రోజున అక్కయినా చెల్లెయినా అన్నాతమ్ముళ్ళు దగ్గరకి వచ్చి రక్షాబంధాన్ని కట్టి, క్షేమంగా వుండాలని కోరుకునే వుత్సవ సందర్భమే రాఖీ పౌర్ణమి. రక్షా బంధనం అంటే ఆడపిల్లలకు ఎదురయ్యే కష్టాల నుండి రక్షించాలని గుర్తు చేసే పండుగ దినం. దీన్ని ఉత్తర భారత ప్రజలు పెద్ద యెత్తున జరుపుకుంటారు. దక్షిణ భారతీయులూ ఈ సంప్రదాయానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు భారతదేశమంతా జరుపుకుంటున్నారు. దీనిపై అనేక కథలూ ప్రచారంలో వున్నాయి. రాజుల మధ్య యుద్ధాలపుడు, శత్రురాజులకు ఇవతలి రాజు భార్య వెళ్ళి రక్షాబంధనం కట్టి తన మాంగళ్యాన్ని రక్షించమంటూ సోదరున్ని వేడుకున్నట్లు వేడుకునేవాళ్ళు అని అంటుంటారు.
ఏదిఏమైనా తోబుట్టువుతో అన్నలకు, తమ్ముళ్ళకు మధ్య ఒక కలుసుకుని ఆప్యాయతలు పంచుకునే సందర్భం ఈ పేరున వుండటం, అనుబంధాలు అడుగంటి పోతున్న సమయంలో మంచిదిగానే భావించాలి. అయితే ఇలాంటి సంప్రదాయాల సందర్భాలను కూడా మార్కెట్ వ్యాపార లాభాల కోసం ఉపయోగించుకోవటం నేడు మనం చూస్తున్నాం. కోట్ల రూపాయల 'రాఖీ' వ్యాపారం ప్రతియేడూ జరుగుతోంది. చాలా ఖరీదైన, ధగధగ మెరిసే రాఖీ కట్టలేకపోతే సోదరులపై పెద్ద ప్రేమ లేనట్టు అనుబంధం అంత గట్టిది కానట్టూ, విలువ లేనట్టూ వ్యాపార వర్గాలు తెలుపకుండానే ఆ భావాన్ని కలుగజేసి సొమ్ము చేసుకుంటారు. కరోనా కరువు కాలాల్లో ఆర్భాటాలకు పోకుండా ప్రేమను, అనుబంధాన్ని పంచుకునే పండుగలా తోబుట్టువుతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకునే సందర్భంగా ప్రజలు జరుపుకోవాలని కోరుకోవాలి మనం.