Sat 28 Aug 23:27:49.417462 2021
Authorization
చాలా రోజుల తర్వాత సెప్టెంబరు మాసారంభాన బడిగంటలు మోగుతున్నాయి. ఇది ఒకింత పిల్లలకు సంతోషం కలిగించే అంశమే. తల్లి దండ్రులూ అందుకు సుముఖంగానే వున్నారు. బడికి పోవాలంటే ఇబ్బంది పడుతూ ఏడ్పులందుకునే పిల్లలు, బడి ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడటం ఒక విచిత్రమైన స్థితి. కరోనా కల్లోలం విద్యార్థులను బడి మొఖం చూడకుండా, ఆటలు పాటలు, పాఠాల స్నేహాలు ఏవీ లేకుండా చేసింది. ఇంట్లోనే వుండీ వుండీ, ఆన్లైన్ పాఠాలు వినలేక, ఆసక్తి గొలుపకా అనేక ఇబ్బందులు పడ్డారు. జూలై మాసం నుండి తగ్గుముఖం పట్టిన కరోన, ఆగస్టులోనూ అదే సరళిని కలిగి వుండటంతో ప్రభుత్వం బడులను ప్రారంభించాలని పెద్ద నిర్ణయమే చేసింది.
ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆహ్వానిస్తున్నారు. అయితే కరోనా పరిస్థితులు అంతాపోయి పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయా అంటే, అదింకా జరగలేదు. ఇప్పటికీ కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇలాంటి స్థితిలో పాఠశాలల్లో సరైన జాగ్రత్తలతో, పరిశుభ్రతలతో తరగతులు ఆరంభించడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టవలసి వున్నది. మన పక్కనే వున్న ఆంధ్రప్రదేశ్లో బడులలో పిల్లలకు కరోనా వ్యాప్తి పెరుగుతున్నదని వార్తలు వస్తున్నాయి. ఉపాధ్యాయులకూ ఈ ప్రమాదం పొంచి వుంది. బడులలో అవసరమైన సిబ్బందిని, ప్రాథమికమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవలసి వుంటుంది. ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలి. కరోనాతో పాటు వర్షాకాలంలో వచ్చే వ్యాధులూ ఒక వైపు పెరుగుతున్నవి. వీటి పట్ల కూడా అప్రమత్తంగా వుండాలి.
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే కాదు దేశంలోని విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పదవ తరగతి పిల్లల్ని ఇంటర్ విద్యార్థుల్ని వారి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగానే ఉత్తీర్ణులుగా ప్రకటించింది. మిగతా విద్యార్థులందరినీ పై తరగతులకు పంపించింది. దేశంలో నూతన విద్యావిధాన ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలు చేసేందుకు పూనుకుని సిలబస్, తరగతుల పద్ధతి, వృత్తి విద్య మొదలైన మార్పులను తీసుకువచ్చింది. రాష్ట్రాల అభిప్రాయాలను, వారి వాదనలను ఏమీ పట్టించుకోకుండా అనేక మౌళిక మార్పులకు పూనుకున్నది. ప్రణాళికను అమలు చేయలేమనీ ప్రకటించాయి. ఇదొక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది.
ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో వారి సంఖ్యను తగ్గించే పనికి పూనుకుంటున్నది. పాఠశాలలను బలోపేతం చేయడానికి బదులు వాటిని కుదించడానికి ప్రయత్నాలు చేయటం విచారించాల్సిన విషయం. వాస్తవంగా నేటి కరోనా పరిస్థితుల్లో తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య దూరాన్ని పాటిస్తూ సెక్షన్లను పెంచుకోవాల్సిన సమయం ఇది. అందుకవసరమైన ఉపాధ్యాయులను కేటాయించటం అటుంచి కుదించడం సరైన పని కాదు. విద్యార్థులు విద్యాభ్యాసాన్ని నష్టపోకుండా, అదే సందర్భంలో వారి ఆరోగ్యాలు కాపాడటం ప్రభుత్వాల బాధ్యత.
వాస్తవంగా విద్యార్థులు బడులు లేక మానసికమైన ఇబ్బందులకు గురవుతున్నారు. తల్లిదండ్రులపై ఆధారపడిన పిల్లలైతే మరింత బాధాకరంగా వుంది. తల్లిదండ్రులకు పిల్లల గురించిన మనో వ్యధ పెరుగుతున్నది. ఇంకో వైపు ఆరోగ్య భయాలు, మరో వైపు ఒత్తిడి, విద్యా వ్యవస్తకు ఎదురౌతున్న సవాళ్ళు. వీటి నుండి బయట పడటానికి కావాల్సిన ప్రణాళికను తయారు చేయాలి. ప్రవేటు బడులు, కాన్వెంటు స్కూళ్ళలోని విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థుల కంటే తీవ్రమైన వొత్తిడికి గురవుతున్నారు. ప్రవేటు ఉపాధ్యాయులు కూడా నానా ఆగచాట్లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సెప్టెంబరు ఒకటి నుండి ప్రారంభమయ్యే పాఠశాలలు విజయవంతంగా నడవాలని, తగిన విధమైన జాగ్రత్తలతో విద్యాభ్యసనాన్ని కొనసాగించాలని మనసారా మనమందరం కోరుకోవాలి.