Sun 12 Sep 05:08:57.244662 2021
Authorization
ఉత్సవాలు, జాతరలు అంటే ఎవరికైనా ఉత్సాహంగానే వుంటుంది. ఎందుకంటే రెండింటిలోనూ సమూహపు చలనం వుంటుంది. జాతరలు గ్రామీణ వాతావరణానికి సంబంధించినవి. ఉత్సవాలు పట్టణ, నగర జనుల సంప్రదాయాలు. దేవుడు, దేవతల పేరుతో కొనసాగేవే ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇంకొన్ని వారోత్సవాలు, మాసోత్సవాలు అని ప్రకటించి సంస్థల, స్మరణ, విజయాల మొదలైన వారి జ్ఞాపకాలతో స్ఫూర్తిని పొందటానికి, అభివృద్ధి పరచటానికి చేసే ఉత్సవాలు కూడా వుంటాయి. ఏదయినా ఉత్సవమంటేనే పదుగురి కలయికతో కూడుకుని జరుగుతాయి. ప్రజలకు ఎరుక పరచాలనే లక్ష్యంతోనూ జరుగుతాయి. ఉత్సవమంటే పండుగ, సంబురం, వేడుక, ఉరేగింపు, జాతర, సందడి అని అనేకార్థాలను కలిగి వున్నది. అన్నింటిలోనూ సామూహికత కనపడుతుంది.
ఇప్పుడు మనకు మొదలైన ఉత్సవ పండుగ వినాయక చవితి గణపతి ఉత్సవాలు. గణపతి అంటే గణానికి అధిపతి నాయకుడు. బహుశా గణ వ్యవస్త కాలపు ఆరాధన కావచ్చు, గణపతి దేవునిగా తలచి పూజించడం నాయకులను, రాజులను దైవాంశ సంభూతులుగా కొలవటం మన దేశంలో అలవాటుగానే వున్న విషయం తెలుసు. ఆ పూర్వాపరాలు అటుంచితే, మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బాలగంగాధర తిలక్ ఈ ఉత్సవాలను జాతీయోద్యమ స్ఫూర్తి కోసం వాడుకునేందుకు ప్రారంభించారు. మతపరమైనది ఐనప్పటికీ అధిక సంఖ్యాకులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వాతంత్య్ర కాంక్షలకు వేదికలుగా మార్చుకున్నారు. అంతేకాని హిందువుల సమీకరణ కాదు.
అయితే క్రమక్రమంగా ఈ ఉత్సవాల రూపురేఖలు మారిపోతూ వస్తున్నాయి. ఒక మతపరమైన అంశంగా గణపతి ఆరాధన మారిపోతున్నది. భక్తి కలిగి వుండటం, దేవుడిని పూజించడం పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఎవరూ అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు. కానీ దాన్ని ఒక పోటీగా మార్చడం, మరో మతానికో, దేవుడికో ప్రతిగా మార్చి ఉద్వేగాలను, విద్వేషాలను రెచ్చగొట్టటం అవాంఛనీయమైనది. ఎన్నో తరాలుగా కోట్లాది మంది భక్తులు, ఆరాధకులు తాము నమ్మిన దైవాన్ని స్వేచ్ఛగా ఆరాధిస్తూనే వున్నారు. ఇప్పుడు ఎందుకు ఒక పోటీతత్వం వచ్చింది! దీని వల్ల సాధించే ఫలితాలు ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తాయి? వీటిని గురించి చర్చించాల్సి వుంది. గణపతి ఉత్సవాలు వాడవాడకూ వీధి వీధికీ విస్తరించాయి. అవి నిర్వహించేందుకు ధన సమీకరణ చేయడం, ఇష్టమున్నా లేకున్నా చందాలు వసూళ్లు, ఇవ్వని వారిపై కక్షలు పెంచుకోవడం, దేవుడికీ మతానికీ వ్యతిరేకంగా ముద్ర వేయడం పెరిగిపోయింది. అంతేకాదు బలవంతపు వసూళ్లు కూడా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణలో భక్తిపాలు అడుగంటిపోయి యితరేతరమైనవి ప్రధానమైపోయింది. ఇక వాటిల్లోనూ ఆ తొమ్మిది రోజులు సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సినిమా పాటల డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు, మద్యపాన సేవనంతో నిమజ్జన యాత్రలో వెర్రెత్తి పోవడం కళ్ళారా చూస్తూనే వున్నాము. అంటే సాంస్కృతిక పరమైన దిగజారుడు కూడా మొదలవ్వటం బాధపడాల్సిన అంశం. గతంలో హరికథలు, బుర్రకథలు, ప్రవచనాలు మొదలైనవి నిర్వహించేవారు.
ఇక ఈ కరోనా కాలంలో ఇలాంటి సామూహిక ఉత్సవాల వల్ల వైరస్ విస్తరించే ప్రమాదముంది కాబట్టి నియంత్రణ కూడుకుని, పరిమితంగానే నిర్వహించాలని కోరుకోవడం తప్పులేదు. కానీ నియంత్రణను కూడా మతపరమైన అంశంగా భావించి చర్చ చేయటం తగనిపని. అదీ రాజకీయంగా మలచుకోవడం మరింత అభ్యంతరకరం. కర్ణాటక మొదలైన ప్రాంతాలలో కూడా ఈ రకమైన నియమ నిబంధనలు విధించారు కూడా. ఒక ప్రాణాంతర వ్యాధి సోకే ప్రమాదమున్న తరుణంలో పోటీకీ పోయి రాజకీయం చేయడం అనర్థదాయకమైనది.
అంతేకాకుండా విగ్రహాల ఏర్పాట్లు విపరీతంగా పెరిగితే, వాటి తయారీలో ఉపయోగించే రంగులు, పదార్థాలు కాలుష్య కారకాలుగా మారి పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదాన్ని గురించి శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తూనే వున్నారు. అందుకే మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడమనీ ప్రచారం చేస్తున్నారు. వీలైనంత చిన్న విగ్రహాలను వుపయోగించడం శ్రేయష్కరం. కాబట్టి భక్తిని రాజకీయానికి ముడిపెట్టి సొమ్ము చేసుకో పూనటం మాని, సౌహార్థాతకు, సోదరభావాన్ని సామరస్యతను కాపాడే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలి. అది ఏ మతం ఆవలంభికులయినా సరే.