Sat 18 Sep 22:24:48.555303 2021
Authorization
నేరములు అనే మాట ఇప్పుడందరికీ తెలిసిన మాటే. ఇంగ్లీష్‌లో దీన్నే 'క్రైమ్' అంటాము. తప్పు, అపరాధము, అన్యాయం, దోషం, అపచారం, దుష్టత్వం, దుర్మార్గం... ఇంకా ఎన్నో మాటలున్నాయి. ఏవైతే చేయగూడని పనులు, ఇతరులకు హాని కలిగించేవి, నష్టపరిచేవి, హతమార్చేవి అన్నింటినీ నేరాలంటారు. దొంగతనాలు, దొమ్మీలు, దోపిడీలు కూడా నేరాలే. 'నేరము - శిక్ష' అనేది ఒక పద బంధము. నేరమున్న చోట శిక్ష కూడా వుంటుంది. ఈ రెండు కూడా ఆదిమ సమాజంలో లేవు. సమాజ పరిణామ క్రమంలో వచ్చి చేరాయి. ఆస్తి ఏర్పడ్డ తర్వాత, రాజ్యం మొదలయ్యాక, నేరమూ శిక్షలు కూడా కొనసాగుతున్నాయి.
నేరాలు వ్యక్తులు చేస్తారు. శిక్షలూ వ్యక్తులకే వేస్తారు. కానీ నేర ప్రవృత్తి మాత్రం సమాజంలోంచే ఏర్పడుతుంది. మనుషులు తీర్చిదిద్దబడేది సమాజ గమనంలోంచే. సమాజం ఎలాంటిదైతే అలాంటి మనిషే వుంటాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తారు. మనుషులు ఎలా వుంటారో సంఘమూ అలా వుంటుందని, మనుషుల్ని బట్టే సమాజమనీ అంటుంటారు. కానీ మనిషి రూపుదిద్దుకునేది సంఘ పరివర్తనావరణంలో నుండి మాత్రమే మరి సంఘము ఎలా తన నడకను కొనసాగిస్తుంది అనేది జాగ్రత్తగా గమనిస్తే అవగాహన అవుతుంది. మనుషులు ఏం చేస్తారు? అనే ప్రశ్న వేసుకుంటే, రెండు పనులు చేస్తారు. ఒక వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొంటారు. రెండవది పునరుత్పత్తిలో చేస్తారు. ప్రధానమైనవి ఇవి మాత్రమే. అయితే ఉత్పత్తి విధానము, పునరుత్పత్తి సంబంధాల ఫలితంగా ఏర్పడిన గమనమే సమాజ గమనం. ఉత్పత్తి క్రమంలో ఏర్పడిన ఆలోచనలు, సవాళ్ళు, సంఘర్షణలు, సంవిధానమే మన మనస్తత్వాలను తీర్చిదిద్దుతుంది. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, మానవ సంబంధాలు మొదలైనవన్నీ కూడా దాన్నుండే ఉత్పన్నమవుతాయి. పరిసరాల నుంచే ఆలోచన మొలకెత్తుతుంది. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి మానసిక పరిశోధనా శాస్త్రవేత్తలు మనుషుల ప్రవర్తనలు, ఆలోచనల నుండి సమాజంలో అనేక విపరీత సంఘటనలు జరుగుతున్నాయని విశ్లేషించారు. ఈ విశ్లేషణలు ఒక పార్శ్యంలో నిజమయినప్పటికీ, మనుషుల ప్రవర్తనలు, ఆలోచనలు సమాజం నుండే ఏర్పడతాయనే మౌలిక సూత్రాన్ని నిర్లక్ష్యంగా చూశారు.
ఉదాహరణకు మొన్న అత్యాచారం, హత్యగావించబడిన 'చైత్ర' ఉదంతంలో రాజు నేరస్తుడు. అతను ఆ విధమైన దుర్మార్గానికి పాల్పడటానికి, అతని చుట్టూ వున్న ఆవరణం కారణమనే విషయాన్ని చాలా మంది విస్మరిస్తారు. గంజాయి సేవనం, మద్యం అలవాటు, దుష్టుల సాంగత్యం, అవిద్య, బతుకుపై ఒత్తిడి, ఉపాధి లేనితనం, సినిమాలు, బూతు వెబ్సైట్లూ, అరాచక జీవన ఫలితంగా వికృతమయిన మనస్తత్వాన్ని కలిగి వుండటమనేది పరిసరాల ప్రేరేపణగానే భావించాలి. ఇన్ని రకాలైన రుగ్మతలు ఈ సమాజానే వున్నాయి. అని నేరాలను ప్రేరేపిస్తూ వుంటాయి. బలహీనులపై మరింత ప్రభావాన్ని కలిగిస్తాయి. దాని ఫలితమే నేరం.
కానీ మనం నేరస్తున్ని నిర్మూలిస్తాం. శిక్ష వేస్తాం. నేరం మాత్రం కొనసాగుతూనే వుంటుంది. నేరానికీ బలి అయిన చైత్రకు న్యాయం జరుగదిగాక జరుగదు. ఉదాహరణకు ఒక మురుగు గుంట ఉందనుకోండి. అందులోంచి పురుగులు పుట్టుకొస్తాయి. పురుగుల్ని చంపేస్తే, తిరిగి పుడుతూనే వుంటాయి. మురుగును తీసేయకుండా పురుగును ఆపలేనట్టే నేరాలు కూడా. నేరప్రేరేపిత సమాజాన్ని మార్చకుండా నేరాలు అంతం కావు. కనీసం ఆ ప్రయత్నంలో ముందుకుపోవాల్సి వుంటుంది. గతంలో వరంగల్ నేరస్తులను ఎన్కౌంటర్ పేర హతమార్చినా, తర్వాత హైద్రాబాద్ దిశ నేరస్తులను కాల్చి చంపినా చైత్రపై అఘాయిత్యం ఆగలేదు. శిక్షలు ఉరిశిక్షలు కూడా నేరాలను అదుపు చేయకపోగా రోజురోజుకు పెరుగుతూనే వున్నాయి. అందుకనే రాజ్యం కానీ సామాజికులు కానీ నేరమయ సమాజాన్ని మార్చుకోగలిగితేనే ఫలితం వుంటుంది. ఆ దిశలో మనం పయనించాలి.