Sat 25 Sep 23:49:41.782747 2021
Authorization
'అలవాటైపోతుంది ప్రతిదీ. రోజూ చేస్తూ వున్నా, రోజూ చూస్తూవున్నా, సామాన్యమై పోతుంది. నేరమైనా ఘోరమైనా మానవత్వం రోజుకింత కరిగిపోతూనే ఉంది.మనిషి కొద్ది క్కొద్దిగా తరిగిపోతూనే వున్నాడు' అన్నట్టుగానే దిగజారి పోతున్నాడు. అంతేకాదు దుర్మార్గమై పోతున్నాడు అని అనుకోవచ్చు. ఒక్కోసారి మనం మనుషులుగానే వున్నామా! అనే అనుమానమూ వస్తుంది.
ఇటీవలి కాలంలో ఆడపిల్లలపైన జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే ఏరకమైన చట్టాలూ హింసా పరంపరను ఆపలేవని అర్థమవుతూవున్నది. నిర్భయ, దిశ, చైత్ర, మహారాష్ట్ర, ఢిల్లీ సంఘటనలు తర్వాత కూడా కొనసాగుతూనే వున్నాయి. అత్యంత దుర్మార్గంగా ఆడపిల్లలపై అఘాయిత్యాలు నిరంతరంగా వినిపిస్తూనే వున్నాయి. అసలు అంత చిన్న పిల్లల మీద, పసికూనలపైన వికృతంగా విరుచుకుపడే మనస్తత్వాలు ఎందుకు పెగురుగుతన్నాయో! వీటి గురించిన అధ్యయనం చేయాల్సి వుంది. అప్పుడే అరికట్టడం సాధ్యమవుతుంది.
మొన్న సోషల్మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అదేమంటే భార్యా భర్తల మధ్య తగాదాకారణంగా భార్య నేను చనిపోతానని ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుంటే , భర్త చాలా క్రౌర్యంగా వేసుకో వేసుకో అంటూ ఆ దృశ్యాన్ని సెల్లో వీడియో తీస్తున్నాడు. మొదట ఏదో కోపంతో బెదిరించడం కోసం ఉరి వేసుకుంటానని ప్యానుకు చీరను చుట్టింది. కానీ భర్త నివారించకపోగా ఇంకొంత ఉరికి ప్రోత్సాహిస్తూ కండ్ల ముందే జరుగుతున్న ఘోరాన్ని వీడియో తీయటం ఎంత అమానవీయం! ఊపిరివొదుతున్నా దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న తీరు చూపరుల గుండెలవిసేలా చేశాయి. ఏమిటీ వైపరిత్యం. ఇంత దారుణ సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తలుగా వున్న వాళ్ళమధ్యనే ఇంతటి రాక్షసత్వం చోటు చేసుకుంటున్నది.
సమాజం కూడా ఈ దుర్మార్గాలకు అలవాటు పడిపోతోందా! ఒక దాని తర్వాత మరో దారుణం జరుగుతూనే వుంది. ఆఖరికి హత్యలను ఆత్మహత్యలను చూస్తూ ఊరకనే ఉండటానికి అలవాటు పడిపోతున్నామా! జరిగిన దారుణాల కన్నా ఇది మరింత విషాదమైన విషయం. అంటే దీనర్థం అందరూ అలానే వుంటున్నారని కాదు. స్పందించే వాళ్ళు, దారుణాలను అరికట్టాలని వీధుల్లోకి వచ్చే వారు వున్నారు. వాళ్ళుకేవలం ఉద్యమకారులు మాత్రమే. ప్రజా సమూహాలు ప్రతిస్పందించినాడు పరిస్థితులు వేరుగా వుంటాయి.
మనుషుల్లో వ్యాపారాత్మకత పెరిగిపోవడే కాక హీన సంస్కృతి తాండవిస్తోంది. సమాజాన్ని యువతను మత్తులో నింపేస్తున్న వర్తమానాన్ని మనం చూస్తున్నాము. దేశ జనాభాకు అంతటికీ మించిపోయే మత్తు పదార్థాల వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. మద్యం, గంజాయి హెరాయిన్ మొదలైన వాటి దిగుమతులు విస్తృతంగా పెరిగాయి. ప్రజల్లో దారిద్య్రం ఒకవైపు ఆర్థిక సమస్యల వొత్తిడిని తట్టుకోలేని స్థితిలోంచి మత్తులో తూగటం అలవాటవుతోంది. మత్తెక్కిన మనిషి ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతాడు. ఎదుటి వాళ్ళ జీవితలే కాదు, తమ జీవితాన్ని, తమపై ఆధారపడ్డ జీవితాలను ఛిద్రం చేస్తారు.
ఈ రకమైన సంస్కృతిని పెంచి పోషిస్తున్నది. పాలకవర్గాలే వారి విధానాలను, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించకుండా జనులను పక్కదారి పట్టించానికి వ్యాపార, పాలక వర్గాలు చేస్తున్న దుష్టత్వంలో భాగమే ఈ హీన సంస్కృతీ విన్యాసం. దీని ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోంది. దాని పర్యవసానమే దుష్కృత్యాలు.