Sat 09 Oct 23:01:50.540461 2021
Authorization
'హైజాక్ అనే మాటకు అర్థం మనకు తెలుసు. ఒకప్పుడు విమానాలను ఉగ్రవాదులు దారి మళ్ళించి తమ ఆదీనంలోకి తీసుకుని, తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాలను కోరేవారు. హైజాక్ అనగానే గుర్తుకొచ్చేది అదే. అంటే ఎత్తుకెళ్ళి తమ ఆదీనంలో, చెప్పు చేతుల్లో వుంచుకోవటం, వాడుకోవటం. ఉగ్రవాదులు కాబట్టి వాళ్ళ కోర్కెలు నెరవేరకపోతే విమానాన్ని మనుషులను చంపేసేవారు కూడా. ఉగ్రవాదులను పక్కన పెడితే ఇప్పుడు హైజాక్ అనే మాట సర్వసాధారణంగా వాడబడుతోంది. పాటలు, సాహిత్యం, ట్యూన్లు, కథలు మొదలైనవి కూడా తమవిగానే తమ ఆదీనంలోకి తెచ్చుకోవటం చూస్తున్నాం. కాపీ చేశారని, దొంగిలించారని వాడుతున్నా, తమదిగా మార్చుకోవటం, తమ ప్రయోజనాలకు వాడుకోవటం హైజాక్ కిందికే వస్తుంది. ఒక్కోసారి సందర్భాన్ని కూడా తమకనుకూలంగా, తమది కాకపోయినా మార్చుకుంటారు. అలాంటిదే సంస్కృతిలోని ప్రతీకలు, ప్రతిమలు నమూనాలనూ వాడుతుంటారు. ఇదీ హైజాకే.
ఆ మధ్య 'సారంగ దరియా', ఈ మధ్య 'బుల్లెట్టు బండి' పాటలు కూడా సినిమాలు హైజాక్ చేసి వాడుకున్నాయి. అసలు రాసిన వాళ్ళకు, పాడిన వాళ్ళకు ఏ సంబంధమూ లేకుండా ఆ ఉర్రూతలూగించే శైలిని, బాణిని ఉపయోగించి, తమకు అనుగుణంగా మార్చుకుని హైజాక్‌కు పాల్పడ్డారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న కథే. అయితే ఇప్పుడు సాంస్కృతిక అంశాలలో భాగమైన పండుగలను కూడా అందులోని ఆట పాటలను కూడా తమకు అంటే తమ రాజకీయ ప్రయోజనాలకు, ప్రచారానికి వాడుకునేందుకు ఎవ్వరూ వెనకాడటం లేదు. భిన్నమైన అభిప్రాయాలు, ఆశయాలు కలిగి వున్న రాజకీయాలు మొత్తం ప్రజానీకానికి చెందిన వారసత్వ సంస్కృతిలో భాగమై వున్న పండుగలను కూడా వారి ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. మొన్న గణపతి ఉత్సవాల సందర్భంగా వీధి వీధికీ ఉత్సవాల పేరుతో మత ప్రాతిపదికన ప్రచారానికి పూనుకున్నారు. వాటి ద్వారా రాజకీయాలబ్ధిని పొందేందుకు వ్యూహాన్ని పన్నారు. ఇప్పుడు బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. అసలు పండుగలనేవి తరతరాలుగా ప్రజలు తమ బాధలు, కష్టాలు పోవాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకునే సందర్భంగానే వుంటాయి. వాటిల్లోనూ తరతమ భేదాలు వుంటాయి. కుల, మత, ప్రాంత భేదాలన్నీ మర్చిపోయి అందరూ అలారు బలారు చెప్పుకుంటూ సంతోషాన్ని సామరస్యాన్ని పంచుతుంటారు.
ఇప్పుడు వీటిల్లో కూడా రాజకీయ నాయకుల ప్రయోజనాలు వచ్చి చేరాయి. ఈ రెండు రోజులుగా సోషల్ మీడియాలో బతుకమ్మ ఉత్సవంలో మహిళలు పాడుకునే పాటలు తీసుకుని అదే లయలో బాణిలో ఒకరినొకరు విమర్శించుకుంటూ పాటలు అళ్ళారు. అంటే పాట అసలు లక్ష్యాన్ని దారిమళ్ళించి తమ తమ ప్రయోజనాలకు ఉపయోగంచుకోవటాన్ని గమనించవచ్చు. ''నోటిఫికేషన్లు ఉయ్యాలో... నోటి మాటలాయె ఉయ్యాలో నిరుద్యోగ భృతి ఉయ్యాలో, నీటి మూటలాయె ఉయ్యాలో... గిట్టుబాటు ధర ఉయ్యాలో.. గెట్టు పంచాయితిలేపె ఉయ్యాలో....'' అని ఒకరు పాడి విమర్శిస్తే, 'సిలిండరు ధరను వెయ్యికి పెంచిన బీజేపీ వలలో... పెట్రోలు, డీజిలూ ధరలు పెంచిన బీజేపీ వలలో... నల్ల చట్టాలతో రైతుల ఉసురే తీస్తున్న వలలో... రాకాసీ బీజేపీ వలలో పడొద్దు మన మన కొద్దే వలలో...'' అంటూ ప్రతిగా పాటలు ఎత్తుకున్నారు. ఈ ఇద్దరి పాటల వల్లా తెలిసొచ్చింది. ఏమిటంటే వీళ్ళు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారో కళ్ళకు కట్టించారు.
పాటలను సందర్భాన్ని హైజాక్ చేసుకుని లాభం పొందాలనుకున్న వాళ్ళకు ఈ విధానం బెడిసి కొట్టింది. వారి నిజస్వరూపాలను బయట పెడుతున్నది. ఇది కూడా సామాన్యజనానికి ఒక రకమైన మేలు కొలుపే అనుకోవచ్చు. అసలు ప్రజల బాధల కష్టాలను తొలగించాల్సిన పాలకులు ఒకరిని మించి ఒకరు భారాలన మోపుతూ వాగ్ధానాలను వమ్ముచేస్తున్నారన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రజా సాంస్కృతిక ప్రతిమలను , ప్రతీకలను దారి మళ్ళించి అందులో ఏమి నింపుతారన్నదే అసలు విషయం ప్రజలు తెలుసుకోక మానరు. హైజాక్ చేసి నిజాలను దాచలేరు.