Sat 16 Oct 22:37:43.002197 2021
Authorization
సినిమా రంగంలో పని చేస్తున్న నటులు, సహాయ నటులు, సంక్షేమం కోసం ఏర్పడిన 'మా' సంఘానికి జరిగిన ఎన్నికలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆరోపణలు, వివాదాలు, విద్వేషాలు, ఆఖరికి కుల, మత, ప్రాంత భేదాలు కూడా చోటు చేసుకోవడం అత్యంత విచారకరమయిన అంశం. సమాజంలో వున్న అన్ని అవలక్షణాలూ సినిమా రంగంలోనూ ప్రతిబింబించాయి. సినిమాలలో నాయకులుగా, మంచి ఉన్నత ఆదర్శ పాత్రలలో నటించే నటులలో ఒఠ్ఠి నటన మాత్రమేనని నిరూపించిన సంఘటన ఇది. సమస్త కుళ్ళూ 'సినిమా'లోనూ ప్రదర్శితమయింది.
విలక్షణనటుడు మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు 'మా' అధ్యక్షుడుగా గెలిచాడు. అతని ప్యానల్ కూడా గెలిచింది. పోటీగా నిలబడిన గొప్ప నటుడు ప్రకాశ్ రాజ్ ఓడిపోయినా అతని ప్యానల్లో పదకొండు మంది సభ్యులు గెలిచారు. ఎన్నికలయిపోయాక ప్రకాశ్‌రాజ్‌తో సహా వారి సభ్యులు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే మొదటి నుంచీ ఓ వివాదం కొనసాగింది. అది ప్రకాశ్‌రాజ్ తెలుగువాడుకాదని, ప్రాంతేతరున్ని ఓడించాలని ప్రచారం చేశారు. అతడు ఐదు బాషల్లోనూ గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. కర్ణాటక వాడైనప్పటికీ తెలుగు చిత్రాలే ఎక్కువగా చేశాడు. తెలంగాణ ప్రాంతంలో అనేక సేవాకార్యక్రమాలలోనూ పాల్గొంటున్నాడు. అంతేకాక దేశంలో కవులు, రచయితలపై జరుగుతున్న దాడులను, హత్యలను తీవ్రంగా ఖండిస్తూ మోడీ అప్రజాస్వామిక విధానాలపై పోరాటమూ చేస్తున్నాడు. అట్లాంటి ప్రకాశ్‌రాజ్ ఈ ఎన్నికల్లో పాల్గొనటం కొంత ఆశ్చర్యమే కలిగించింది. అయినా ప్రాంతీయ భేదాన్ని రెచ్చగొట్టి ఓడించేందుకు పూనుకున్నారు. అంతేకాక కుల,మత విద్వేషాలూ పొడచూపాయి. ప్రకాశ్‌రాజ్ దేవుడ్ని నమ్మడని, మోడీ ద్వేషి అని, అందువల్ల అతను దేశభక్తుడు కాదని, ఒక నటుడు పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శించాడు.
కానీ సినీ పరిశ్రమలో వందలాది మంది నటులుగా అవకాశాల కోసం తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నవాళ్ళున్నారు. ఈ రంగంలోనే వుంటూ ఆర్థిక ఇబ్బందులకు గురయి ఆదుకునే వాళ్ళు లేక, బయటకి చెప్పుకోలేక నలిగిపోయే వాళ్ళూ వున్నారు. గుర్తింపు, ఆదాయము, ఆదరణ మొదలైన విషయాలను, వారి సంక్షేమాన్ని గురించిన సమస్యలను ఏవీ కూడా ఎలా పరిష్కరించుకోవాలో అనేది ఎన్నికల చర్చలోకి రాలేదు. వాస్తవంగా కోవిడ్ వల్ల తీవ్రమైన సంక్షోభాన్ని సినిమారంగం ఎదుర్కొంటున్నది. దీని గురించిన చర్చకూడాలేదు. కానీ ప్రాంతము, కులము, చర్చలోకి తెచ్చారు. అంతే కాదు. డబ్బు ఖర్చు కూడా జరిగిందంటున్నారు.
ఏది ఏమైనా మన దేశ రాజకీయ రంగంలో తలెత్తుతున్న మతతత్వ భావనలు, సమాజంలో కూరుకుపోయివున్న కుల వివక్షలు సినిమా రంగాన్నీ వదలలేదు. తెరపైన మెరుపులన్నీ తెర అవతల లేవనే వాస్తవాన్ని గ్రహించాలి. మీడియా మాత్రం సినిమా నటుల చుట్టూ తిరిగే ఈ తతంగాన్నీ గంటలు గంటలూ చూపించి వీక్షకుల సమయాన్ని వాడుకుందనీ చెప్పవచ్చు. ఈ చర్చల్లో వార్తల్లో పడి రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిలు గురించి ప్రస్తావనే లేకుండా పోయింది. గ్యాసు బండకూడా పెరిగి సామాన్యులకు కష్టాలు తెచ్చింది. అత్యంత ఘోరమైన దుర్ఘటన లఖింపూర్ ఖేరిలో రైతులపైకి కారు నడిపించిన దౌష్ట్యాన్ని మీడియా పెద్దగా పట్టించుకోలేదు. అయినా మీడియా ప్రాధాన్యాలు రంగుల చుట్టూనే తిరుగుతాయి.
డ్రగ్స్ మాఫియాలతో సంబంధాలు, డ్రగ్స్ వాడకాలు, క్యాస్టింగ్కౌచ్లు మొదలైన ఆరోపణలకు కేంద్రంగా వున్న సినిమాయా ప్రపంచాన ఒక లౌకిక ప్రజాస్వామిక, ఉన్నతాశయంతో, అవినీతి రహితంగా చర్చా, ఎన్నిక జరుగుతుందనుకోవడమే అత్యాశ అవుతుంది. వీటిని రూపు మాపాలనే వారికి అవమానాలు తప్పవు. అయినా ప్రశ్నలు లేస్తూనే వుంటాయి. దిగజారిపోయే విలువలు ఏవో, నిలబెట్టుకోవాల్సిన విలువలేవో విశదపడుతూనే ఉంటాయి. మనం భ్రమల్లో పడకుండా జాగ్రత్త వహించాలి.