వాడు బరువును మోస్తున్నాడా బరువే వాడి భుజాన్ని మోస్తుందా చిత్తు కాగితాల చెత్తకుప్పల మధ్య ముక్కుపచ్చలారని బాల్యం బిక్కుబిక్కుమంటూ బరువైన జీవితాన్ని మోస్తోంది అరటితొక్కల మధ్య అసహ్యకరమైన పెంటకుప్పల మీద బాల్యం వాంతి చేసుకుంటోంది పందుల మధ్య పోటీపడుతూ కుక్కలు చింపిన విస్తరికై ఆశపడుతూ మత్తు దిగిన బీరుసీసాల కోసం బాల్యం బీరిపోయి చూస్తోంది ఆశల పొరల గాజుపెంకులు గుచ్చుకుని పాదాల రక్తం కళ్ళజూస్తూ రొచ్చు చేతులు వెతుకుతూనే వున్నాయి ముఖం లేని ఉదయం జాలిగా జ్వాలగా వెలుగుతున్న మధ్యాహ్నం కోపంగా నక్షత్రాలు లేని ఆకాశం విషాదంగా చూస్తున్నా... నిండీ నిండని చీకటి గోనెసంచిని దిండుగా పెట్టుకుని పదేళ్ళ కుర్రాడు నిద్రపోతున్నాడు రేపటి ఉదయం కోసం కలగంటూ