Sat 23 Oct 22:40:15.074742 2021
Authorization
భార్య.. భర్త
తల్లితండ్రులు.. పిల్లలు
అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్లు
కొడుకులు.. కోడళ్లు
కూతుళ్లు.. అల్లుళ్లూ
అత్తలు.. మామలు
పిన్ని.. బాబారు
ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు. అందరి మధ్య రక్తసంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం కనిపిస్తుంది. నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంది. కాని ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ అనుబంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్ధాలు, మోసాలు చోటు చేసుకున్నాయి.
ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కుటుంబ శ్రేయస్సు కోసమే కలిసి కష్టపడేవారు. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమైనా అందరినీ ప్రేమగా చూసుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని కుటుంబాన్ని ఒక్క తాటిపై నడిపించేవారు. కాని నేటి ఆధునిక యుగంలో ఈ బంధాలు అనుబంధాల అర్ధాలు మారిపోతున్నాయి. బిజీ లైఫ్ మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పును తీసుకువచ్చింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవిస్తున్నారు. డబ్బు సంపాదనపైనే అందరి దష్టి. ఎవరికి వారు తమకంటూ విడిగా బ్యాంక్ అకౌంట్లు, ఇండ్లు, వాహనాలు, వస్తువులు కొనుక్కుంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటూనే నీది నాది అనే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి బిజీ లైఫ్లో పూర్తిగా మునిగిపోయిన తమ పిల్లలను తల్లితండ్రుల దగ్గరో, అత్తామామల దగ్గరో ఉంచి వారి ఆలనాపాలనా చూసేవారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్లైన తల్లితండ్రులను వద్ధాశ్రామాలకు పంపేస్తున్నారు. తమ పిల్లలను పనిమనుషులు వద్దనో, క్రెష్లలోనో ఉంచుతున్నారు. దీంతో తల్లితండ్రులకు పిల్లలకు మధ్య సహజంగా ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయతలు కొరవడుతున్నాయి. అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పే కథలు విని, తాతలతో ఆటలు ఆడుతూ పెరిగిన పిల్లల్లో, క్రెష్లలో పెరిగిన పిల్లల మధ్య తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మీయులు అంటే ఎవరు..? ఆత్మీయులు అనేవారు ఎక్కడో మనం వెదుక్కుంటే దొరకరు.. కష్టాల్లో నష్టాల్లో 'నేనున్నానని...' ఆదుకునేవారే ఆత్మీయులు. వాళ్లంతా ప్రేమమయ మనుషులే.. కుటుంబాలకు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా తరతరాలుగా కలిసే జీవించేవారు. అటువంటి ఆత్మబంధువులు అందరికీ ఉంటారు.. అందరికీ ఉండరు కూడా.. ఈ రెండూ వాస్తవమే.. ఎందుకంటే ఇప్పుడా పరిస్థితుల్లేవ్. మనుషుల్లో ఆత్మీయత లేక కాదు.. కానీ, అంతటి ఆత్మీయతా అనుబంధాలతో కలిసిమెలిసి వుండే అవకాశాలు లేవు. నేటి ఒరవడిలో అవి బాగా సన్నగిల్లుతున్నాయి. బయట చాలా పెద్ద ప్రపంచమే ఉంది. అయితే ఈ సమాజం అభివద్ధి క్రమంలో కుటుంబమంతా ఒకేదగ్గర కలిసి ఉండటం ఆచరణ సాధ్యం కాదు. తల్లిదండ్రులు ఒకచోటా...వారి బిడ్డలు మరోచోటా.. వత్తిధర్మంలో ఒక్కొక్కరు ఒక్కోదగ్గర స్థిరపడి రావొచ్చు. అనివార్యం కూడా.
అందరూ జీవితంలో అన్నీ సవ్యంగా సాగాలనే ఆశిస్తారు. వైఫల్యాలు ఎదురైనపుడు తనకు దగ్గరివాళ్లు అండగా నిలబడితే బావుండునని ఆశిస్తారు. తప్పులేదు. కానీ, అయినవాళ్లూ, ఆత్మీయులే ఆ మనిషి పరిస్థితుల్ని వేయిరకాలుగా ఎద్దేవా చేయడం సరైన పద్ధతి కాదు. కష్టాల్లో వెన్నుదన్నుగా నిలిచేదీ, తిరిగి ధైర్యాన్ని నింపేదీ ఎప్పటికయినా ఆత్మబంధువులే అవుతారు. కావాలి కూడా.. వీలైతే వారి మనుగడకు తమ శక్తిమేర తోడ్పడాలి. అంతే గానీ, సూటిపోటి మాటలతో, చూపులతో వారి వ్యక్తిత్వాన్ని కుంగదీయడం వల్ల వారి అనుబంధానికి నష్టం జరుగుతుంది. ఒకే కుటుంబంలోని సభ్యులు ఒక్కో వ్యక్తి పట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తుంటారు. అంతా కలిసి పనిచేసే చోట కూడా యివే ధోరణులుండటం కద్దు. కానీ, విజయం అంటే ఏదో అందుకోవటం పరాజయం అంటే ఏదో పోగొట్టుకోవడం యింతేనా...? ఇంతకన్నా అతీతమైన అర్ధాలేమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి.
సమాచార, సాంకేతిక విప్లవం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గ్రామంలా మార్చేసింది. దేశవిదేశాల మధ్య సరిహద్దులను చెరిపేసి వారిని నిమిషాల్లో కలుపేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ సంబంధాలు మెరుగైనట్టు కనిపించినా కుటుంబ సంబంధాలు మాత్రం దెబ్బతింటున్నాయి అని కొందరంటున్నారు. ఇదే వాస్తవం. నిజజీవితంలో మనుష్యుల మధ్య దూరం పెరిగిపోతోంది. చాలామంది కొత్త వారితో స్నేహం పెంచుకోవడానికి చూపే ఆసక్తి, ఉత్సాహం, ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించడం లేదు. నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్తసంబంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ ఇంటర్నెట్లో కలిసిన వ్యక్తుల మధ్య ఉండడం లేదు. ఆ వ్యక్తులు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచయం. వాళ్లు ప్రత్యక్షంగా కూడా కలిసి ఉండరు. అయినా వారి మధ్య ఎంతో నమ్మకం, ఆత్మీయత. ప్రతీ బంధం ఇలాగే ఉండాలని లేదు. ప్రేమ నమ్మకం, ద్వేషం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిధ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి.
అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. నిజజీవితంలో ఈ పరస్పర విభేదంతో కలతలు, కలహాలు మొదలవుతాయి. కాని నెట్ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఒకే విధమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నవారు దగ్గరవుతారు. అందుకే వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయం, గొడవలు ఉండవేమో. ప్రత్యేక్షంగా కలుసుకుంటేనే అసలు మనిషితనపు ఆలోచనలు బయటపడేది. ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరి అవసరం ఎప్పుడో ఒకప్పుడు మనకు కలుగుతుంది. అందుకే సమాజంలో అందరినీ కలుపుకుని ఎటువంటి భేషజాలు, మోసలు, ద్వేషాలు లేకుండా మానవ సంబంధాలను కాపాడుకోవాలి. భిన్నమైన వైరుధ్యాలు, దక్పధాలు గల మనుష్యుల మధ్య కలిసి బ్రతకడానికి స్నేహంగా ఉంటూ అందరినీ గౌరవించడం అలవర్చుకోవాలి. ఈ మానవ సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ముందు కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. తాత్కాలిక భోగాలైన ఆధిపత్యం, అధికారం, డబ్బు, హౌదా, పలుకుబడి మొదలైనవాటిని గుర్తించి వాటిని పక్కనపెట్టి బందుత్వాలు, బాంధవ్యాలు గుర్తించాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు.