Sat 06 Nov 22:46:10.554305 2021
Authorization
సినిమాల్లో హీరోలు ఎన్ని మంచిపనులు చేస్తారో లెక్కేవుండదు. నలభై యేండ్ల నుంచి సినిమాలు చూస్తున్న అన్ని సినిమాల్లోనూ హీరోలు బలవంతులు, బుద్ధిమంతులు, విశాల హదయులే వుంటారు. ఈ మధ్య ప్రపంచీకరణ మొదలయ్యాక 'ఇడియట్స్', 'రాస్కెల్స్', 'దొంగ'లు వుంటున్నారు. వాళ్ళు కూడా మంచి ఇడియట్స్గానే కనపడతారు. సినిమా చూస్తున్నప్పుడు హీరోల్లో, హీరోయిన్లలో మనల్ని ఊహించుకుని చూస్తూ వుంటం సాధారణంగా, అలా వుండాలనే వుంటుంది. మనకు కూడా బలవంతుడిగా, ధైర్యవంతుడిగా , దానగుణం, క్షమాగుణం, దయాగుణం, ప్రేమ, ఆప్యాయత, పదిమంది శత్రువులకు అవలీలగా తన్ని తరిమేయగల శక్తీ ఇవన్నీ మనకూ వుండాలని కోరుకుంటాం. కానీ నిజ జీవితంలో అలా వుండలేక పోతుంటాం. అది వేరే విషయం.
సినిమాల్లో నటిస్తున్న హీరో పాత్రధారులు, బయట కూడా హీరోలుగా వుంటారా? ఇది అవసరం లేని ప్రశ్ననే కానీ పూర్వం కొంత మంది సినిమా హీరోలు నిజజీవితంలో కూడా మంచి వ్యక్తులుగా, నాయకులుగా వ్యవహరించేవారు. రాజకీయాలలోకి వచ్చి కూడా నాయకత్వం వహించి పరిపాలించారు కూడా. దివిసీమలో ఉప్పెన వచ్చి ప్రజలు బాధలు పడుతున్నపుడు, మన తెలుగు హీరోలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు జోలెపట్టి ఊరూరా తిరిగి చందాలు వసూలు చేసి వారిని ఆదుకున్న గుర్తు నాకున్నది సావిత్రి లాంటి హీరోయిన్లు పాఠశాలలు కట్టించడం, ఎంతో మందికి సహాయం చేయడం మనం చూశాం. ఆ తరం తర్వాత ఇప్పుడు ఎక్కువగా నాయకులను చూడలేకపోతున్నాం. ఎవరేమయినా మాకెందుకులే అనుకునే ధోరణి ఎక్కువగా నేడు కనపడుతున్నది. సినిమాళ్ళ నటించడం వరకే నాయకులుగానీ బయట కాదనే విషయం మనకు అనేక సందర్భాల్లో తెలిసివచ్చినదే. అయితే ఈ కాలంలోనూ అక్కడక్కడ తమ హీరోయిజాన్ని సమాజంలో కూడా ప్రదర్శిస్తున్న వాళ్ళు కొందరున్నారు. అట్లాంటి వాళ్ళకు జనాదరణా ఎక్కువగానే వుంటుంది. లాక్డౌన్ కాలంలో ఎంతో మందిని ఆదుకొని, సేవా కార్యక్రమాలు చేసిన సోనూసూద్ ఈ తరం హీరోలకు ఆదర్శం.
అలాంటి కోవలో ప్రజల హదయాలలో నిలిచిన హీరో మన పునీత్ రాజ్‌కుమార్. కన్నడ సినిమారంగంలో గొప్ప కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ తనయుడు పునీత్. నలభై ఆరు సంవత్సరాలకే అకస్మాత్తుగా మొన్న మరణించారు. మరణం తర్వాత ప్రజలందరికీ తెలిసివచ్చింది అతను చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి పద్దెనిమిది వందల మందికి విద్యను అందిస్తూ అనేక వద్ధాశ్రమాల నూనడుపుతున్నాడనీ, ఎన్నో సేవాకార్యకమాలను నిర్వహిస్తున్నాడని, విద్యను పేదలకు అందించేందుకు కషి చేస్తున్నాడని తెలిసింది. కన్నడలో పవర్‌స్టార్‌గా వెలుగుతూనే సేవాకార్యక్రమాలనూ కొనసాగిస్తూ ప్రజల ప్రేమకు చూరగొన్నాడు. అందుకే అతని మరణానికి అశేష ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఈ పరిస్థితుల్లో తమిళ హీరో విశాల్ ఒక ప్రకటన చేస్తూ పునీత్ చదివిస్తున్న ఆ పద్దెనిమిది వందల మందిని ఇక నుంచి నేను చదివిస్తానని, నా ఇంటి నిర్మాణానికి దాచుకున్న డబ్బును దానికి వెచ్చిస్తానని తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
వీటన్నింటిలో మనం అర్ధం చేసుకోవాల్సిన అంశమేమిటంటే, సహాయము, సేవ చేయగలిగిన స్థితిలో వున్నవారు, ముఖ్యంగా కథానాయుకులుగా నటిస్తున్నవారు ప్రజల పట్ల, సమాజం పట్ల ఎలా స్పందిస్తూన్నారు. ఎవరు స్పందిస్తున్నారు అనేవి అవగతమవుతాయి. కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా మన తెలంగాణలో ఓ పల్లెను దత్తత తీసుకుని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మన తెలుగులో అగ్రహీరోలుగా వున్న వాళ్ళెవరూ విపత్తులకు, ఆపదసమయాలకు స్పందిస్తున్న దాఖలాలు లేవు. దేశంలో ప్రజాస్వామిక హక్కులకు, స్వేచ్ఛకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా మన తెలుగు కథానాయకుల ప్రతిస్పందనలు శూన్యం. అందుకే 'హీరోలందు అసలు హీరోలు వేరయా' అని అనుకోక తప్పదు.