Sat 13 Nov 22:37:03.920635 2021
Authorization
పిల్లల్లాంటి హృదయం వుంటే ఎంత బావుండు కదా! అని అనిపిస్తూ వుంటుంది. ఆ దశను దాటి వచ్చాక కూడా అదే గొప్ప హృదయమని అనుకుంటున్నామంటే ఇప్పుడు కలుషితమయిందనే అర్థం. కలుషితం కావటం అంటే అనేకానేక అవసరాలు, స్వార్థాలు, ఆలోచనలు, ఆవేశాలు, కోరికలు, ఈర్ష్యలు అసూయలు ఇంకా ఎన్నెన్నో చుట్టు ముట్టిన హృదయం పెద్దలది. స్వచ్చమైన లేలేత మృదు హృదయం పిల్లలది. పిల్లల నవ్వుల్లో, మాటల్లో, ఏడుపుల్లో, కన్నీళ్ళలో, సంతోషాలలో స్వచ్ఛత వుంటుంది. భౌతికత కూడా ముద్దు లొలుకుతుంది. పిల్లలతో గడుపుతున్నపుడు, మాట్లాడు తున్నపుడు మన వయసునూ, మనసును మరచిపోతుంటాం. అందుకే ''పిల్లలూ దేవుడు చల్లని వారే, కల్లకపటమెరుగనీ కరుణామయులే'' అని పాడుకున్నాడో కవి.
నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారం. ఆరోజు చాచా నెహ్రూ పుట్టిన రోజు ఆయనకు పిల్లల మీదున్న ప్రేమకు గుర్తుగా ఇలా జరుపుతున్నారు. పిల్లలంటే భవిష్యత్తు దేశ సంపద. వాళ్ళిపుడు ఎలా పెరుగుతారో ఏ ఆలోచనలతో ఎదుగుతారో రేపటి దేశం అలాగే మారుతుంది. పిల్లలను తేలికగా చూడకూడదు. అత్యంత విలువైన మన వారసత్వ నిధులు వాళ్ళు. పిల్లలను ఎలా చూడాలో చెబుతూ లెబనాన్‌కు చెందిన ఖలీల్ జిబ్రాన్ ఇలా అంటాడు. ''మీ పిల్లలు - మీ పిల్లలు కారు, వారు తన కోసం తపించే జీవితం యొక్క కొడుకులూ కూతుళ్ళూ వాళ్ళు. మీ ద్వారా పుడతారు కానీ మీ నుండి కాదు. / వాళ్ళు మీతో వున్నప్పటికీ, మీకు చెందరు. వాళ్ళకి మీప్రేమను పంచండి, మీ ఆలోచనల కాదు. ఎందుకంటే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. వాళ్ళ దేహాలను సాకండి, మనసులను కాదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలు రేపటి గృహంలో నివసిస్తాయి. వాళ్ళలా మారడానికి ప్రయత్నించండి, కానీ మీలా వాళ్ళని తయారు చెయ్యకండి, ఎందుకంటే, జీవితం వెనక్కి మళ్ళదు. నిన్నటితో ఆగిపోదు.'' అని స్పష్టంగానే చెప్పాడు. ఇది కవిత్వం లాగే వున్నా సత్యం.
అవును పిల్లలకూ ఆలోచనలుంటాయి. ఈ ప్రపంచాన్ని పరిసరాలను, చూసినప్పటి నుండీ వారికీ ప్రాపంచిక దృక్పథమూ వుంటుంది. వాళ్ళు ఓ మట్టి ముద్దలు, బండరాళ్ళూ కాదు. మన ఉపాధ్యాయులు చాలా మంది అలానే అనుకుంటారు. అది సరయినదికాదు. వాళ్ళ వాళ్ళ అనుభూతులు, అవగాహనలను తెలుసుకోవాలి. వారి వ్యక్తిత్వాలకు గౌరవమివ్వాలి. అదేమీ లేకుండా నిర్భంధానికి, హింసకు వారిని గురిచేస్తే పిల్లల మనసుల్లో వ్యతిరేక బీజాలు నాటిన వాళ్ళుమవుతాము. అది గురువులైనా వాళ్ళ తల్లి దండ్రులైనా ఒక చర్చా ప్రజాస్వామిక పద్దతిలో వారికి జ్ఞానాన్ని అందిచవచ్చు. ఉత్తమ తరం రూపొందడంలో ఇది కూడా ముఖ్యాంశంగానే ఉంటుంది.
ఇక దేశంలో లక్షలాది మంది బాలలు వారి బాల్యాన్ని కోల్పోతున్న అంత్యత విచారకర సన్నివేశమూ వుంది. తిండి సరిగా లేక, కట్టుకునేందుకు బట్టాలేక, గూడూలేక ఫ్లాట్‌ఫారాల్లో, రోడ్ల ప్రక్కన జీవితాలను వెళ్ళదీస్తున్న భవిత నిత్యం గాయాలపాలవుతూనే వుంది. చెత్తనేరుకుంటూ, హోటళ్లలో మెకానిక్ షెడ్లలో పనిచేస్తూ అనేక మంది పిల్లలు కనీస పౌష్టికాహారము లేక బాధల చిక్కుముడులలో చిక్కి బతుకీడుస్తున్నారు. వారిని గురించి ఈ దినోత్సవాన చర్చించు కోవాలి. కళకళలాడాల్సిన వదనాలు మసక బారి పోవటం ఎందుకు. జరుగుతోందో ఆలోచించాలి. ప్రభుత్వాలు ఈ సందర్భంగానైనా వారిని పట్టించుకోవాలి.
ఇక మధ్య తరగతి ప్రజలు వాళ్ళు సాధించాల్సిన అభివృద్ధి, అంతస్తుల కోసం పిల్లలపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నారు. బంగారపుపంజరంలో చిలకలను బంధించినట్టు, వారి స్వేచ్ఛను, స్వతంత్రతను హరిస్తున్నారు. ఇది తగదు. పిల్లల ఉన్నత ఎదుగుదలకు వారి అభిరుచులను గ్రహించి ప్రోత్సహించాలి. సూచనలు చేయాలి. తప్పులుంటే సరిదిద్దాలి తప్ప నిర్భధించవద్దు. అందుకే పిల్లల్లాంటి హృదయాన్ని మనయూ పొందే ప్రయత్నం చేయాలి.