Sat 13 Nov 22:38:18.341777 2021
Authorization
తనువును ధనస్సులా మార్చి
గమ్యాన్ని విల్లులా చేసుకొని..
బతుకు వేటకై బయలుదేరుతాడు.
వాడి ఆరాటం నిఖార్సైన పోరాటం
నాలుగు మెతుకులకై సాగే బతుకు ప్రయాణం.
అలుపెరుగని కాలువలా సాగే కార్మికుడు వాడు.
వానకట్టలెన్ని అడ్డువచ్చినా...అలలై దునికేస్తాడు.
వడగాలులు ఎంత బలంగా వీచిన
ప్రమిధల కాంతులను ఆరిపోనీయడు.
నిశీధి మేఘాలేన్ని కమ్ముకున్న...
ఉదయించే రవి కిరణాలై దూసుకుపోతాడు.
అమావాస్యలా చీకట్లు అలుముకున్నా..
పున్నమిఓలే చంద్రుడై ప్రకాశిస్తాడు.
ఖద్దరు బట్టల మనుషులు.. వాడి శ్రమదోపిడిని..
నిట్టనిలువునా దోచుకున్నా..ఏనాడు
కలత చెందడు.. కలవరపడడు.
వాడి కష్టాన్ని చూసి దూకుతున్న జలపాతాలు
ఒక్క క్షణం అలా ఆగిపోయి చూస్తాయి.
విరబూసిన పూలన్నీ వాడి పాదాలకింద
పరుపులైపోవాలని పరితపిస్తాయి.
గడ్డిపోచలపై మెరుస్తున్న మంచు బిందువులు
తమ ఎదనిండా ఆ కష్టజీవినే దాచుకొని..
వాడి సుఖాన్నే కోరుకుంటాయి.
ఆకురాలిపోయిన వక్షాలన్ని మళ్ళీ చిగురిస్తున్నాయి..
బహుశా...కష్టజీవిని ఆదర్శంగా తీసుకొని కావచ్చు..!
తెగిపడిపోయిన బతుకుఆశల్ని మళ్ళీ అతికిస్తాడు.
కలచెదిరిపోనియకుండా కాలం వెంట
శూలమై పరుగులుతీస్తాడు.
వాడి పోరాటం ఎప్పుడు న్యాయమైనది.
తానుకరుగుతూ సమాజానికి వెలుగులు
పంచుతాడు.
తడబడని అడుగులై...దుఃఖాన్ని చీల్చుకుంటూ..
కన్నీటిని రాల్చుకుంటూ...
బతుకువేటను సాగిస్తాడు.
వాడి అడుగులో అడుగై నడుద్దాం.
కంట కన్నీరును తుడుద్దాం.
శ్రమజీవి శ్రమకు తగిన ప్రతిఫలం అందిద్దాం.
- అశోక్ గోనె, నిర్మల్
9441317361