Sat 20 Nov 22:18:00.769388 2021
Authorization
మూర్ఖులు తమ అజ్ఞానంతో, సంకుచిత అభిప్రాయాలతో కచ్చితంగానే ఉంటారు. వివేకులకే అనేక సందేహాలుంటాయని ప్రముఖ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ అంటారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు తీర్పులు చెబుతున్న వైనం చూస్తే ఆ మాట ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. సమాజంలోని సకల అంశాల మీద తమ అభిప్రాయాలనే నిర్ధారణలుగా ప్రకటిస్తుంటారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకున్నా వ్యాఖ్యానిస్తుంటారు. సత్యమేదో తెలిసినా, దాన్ని త్రోసిరాజని తమ వితండవాదనలు ముందుకు తీసుకువస్తున్నారు. విధాన నిర్ణేతలయినవారు సైతం ఇలాగే వ్యవహరిస్తున్నారు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారం వంటి అంశాల మీద రకరకాల వాదనలు వింటున్నాం. అలాంటి నేతలకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండానే మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది.
నిన్నటికి నిన్న 'కమల' శ్రీ కంగనా రనౌత్ దేశానికి స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947 బ్రిటీష్ వారి బిక్ష వేశారని భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, ఆ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన మహానీయులను అవమానించారు. అంతకంటే ఒక ఆకు ఎక్కువే చదివిన ఉత్తారాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ భారతదేశాన్ని 200 ఏండ్లు అమెరికా పాలించిందని అన్నారు. అంతటితో ఆగకుండా ప్రపంచాన్నే అమెరికా పాలించిందని తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఆ 'మహానేత' తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే 'రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కిందే అమెరికా సైతం బానిసత్వాన్ని అనుభవించిందని. అజ్ఞానానికి కూడా హద్దులుంటాయి. కానీ, సదరు నేతల అజ్ఞానానికి ఏలాంటి హద్దులు, సరిహద్దులు లేవు. చరిత్రను వక్రీకరించడానికి వారు పరిశోధన చేస్తున్నారు.
'ఏ దేశ సంస్కతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు' అంటాడు తిలక్. మనసు మనుషుల ఆలోచనలను వికసింపజేయాలంటే... స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి. తప్పు ఒప్పులను వివరించి చెప్పాలి. ఈ పద్ధతి ద్వారానే పిల్లలకైనా, పెద్దలకైనా నేర్పగలుగుతాం. నేర్చుకోవడమనేది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. నిరంతర సాధన. విజ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య జరిగే ఘర్షణ లోంచి నేర్చుకోవడమనే ఒక ఫలితం వస్తుంది. విద్యార్థుల జ్ఞానం, ఉపాధ్యాయుల విజ్ఞానం మధ్య ఘర్షణ జరిగితేనే.. ఆ ఫలితం విద్యార్థి బురల్రోకి ఎక్కుతుంది. అంతేగాని, బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చినట్టు జ్ఞానం ఎక్కదు. ఈ సంఘర్షణ జరగాలంటే, తనకు తెలియనిది అడిగి తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అంతే కాని తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. వాస్తవమేదో, అవాస్తవమేదో తెలియనీకుండా మీడియాలో గందరగోళ పరచడమనేది ఇప్పుడొక ఆధిపత్యదర్పం. మనసుల్ని, ఆలోచనల్ని అదిమిపట్టి... కోరికల్ని దిగమింగుకొని, ఎవరికోసమో మన అభిప్రాయాలను మార్చుకోవడం, చివరకు ఎందుకోసం మార్చుకున్నామో కూడా తెలియకపోవడం... సగం చచ్చిబతకడమే కదా!
'ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో.. తలపులో, పనిలో, నిత్య విశాల పథాల వైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో.. ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రీ! నా దేశాన్ని మేల్కొల్పు' అని విశ్వకవి ఆకాంక్షించారు. అందుకు విరుద్ధంగా జ్ఞానాన్ని మతపరమైన రంగులు పులిమి, కొందరు నేతలు తమ అజ్ఞానంతో చరిత్రను వక్రీకరిస్తున్నారు. తమ అజ్ఞానాన్ని జనం బుర్రలోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు నిత్యం చేస్తూనే ఉన్నారు.
ఒకవైపున ప్రకతి రహస్యాల్ని కనుగొంటూ, సరికొత్త శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలతో మానవ జీవితాన్ని మెరుగు పరిచేవారు ఉన్నారు.. మరోవైపున శతాబ్దాల మూఢత్వాన్ని భారంగా మోస్తూ బతుకులీడ్చే వారూ ఉన్నారు. జనబాహుళ్యంలోని మూఢత్వాన్ని ఆసరాగా చేసుకొని మనుగడ సాగించే పాలనా వ్యవస్థలూ ఉన్నాయి. మూఢత్వం నుంచి విముక్తం చేయడం కన్నా, దానిలో జనాలు మగ్గిపోవడమే పెత్తందారులకు అవసరం. అందుకే మన దేశంలో మార్కెట్, మతం కలసి రాజ్యం చేస్తున్నాయి.
జనాల్ని మాయ చేసి, మభ్యపెట్టే కుతంత్రం కొనసాగుతున్నందునే మన ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. వివేచన గలవారు ప్రశ్నిస్తారు. జనం ముందుకొచ్చి వాగ్దానాలు చేసేవారి మాటల్ని సందేహిస్తారు. మాటలకీ, చేతలకీ పొంతనలేని వ్యవహారాన్ని పసిగడతారు. మన నమ్మకాలకీ, వాస్తవాలకి నడుమ అంతరం ఎంతో గ్రహించాలి. సత్యాసత్యాల వివేచన గురించి యోచించాలి. ఆ చైతన్యం విస్తరించకపోతే మానవ జీవితం మరింత సంక్షుభితమవుతుంది. వివేచన ఒక్కటే మనిషిని కాపాడుతుంది. సరైన దిశలో నడిపిస్తుంది. శాస్త్రీయ ఆలోచనాధారని వ్యాప్తి చేయడంలో కవులు, కళాకారులు, ఆలోచనాపరులయిన వారు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయమిది.