Sat 20 Nov 22:57:41.776709 2021
Authorization
ప్రియా...
అపురూపమైన నీ ప్రేమ
నా సొంతమవుతుందని
మనసారా ఆశపడ్డాను .....
మనసు నిండుగా ఆశించాను....
నా గుండె నిండిన ప్రేమతో
నీ సుకుమార చేయిని
నమ్మకం పంచి ఇస్తూ నా చేతుల్లోకి తీసుకున్నాను....
కానీ,
ఆశలను ఆవిరి చేస్తూ
కలల రేకులను తుంచేస్తూ
స్వప్నాలను రాల్పేస్తూ
ఊహా సౌధాలను కూల్చేస్తూ
ఒక విషాదంతంగా నా జీవితపుస్తకాన్ని
లిఖించావు....
విపరీతం సహించలేక
విరుద్ధం భరించలేక
హదయం గాయాల జల్లెడయింది
మనసు కకావికలమయింది.
మది కల్లోల సాగరమయింది.
నాదనే మనో శిల్పం ముక్కలయ్యింది
గమనం దిక్కులేనిది అయ్యింది
నీ ఒక వేటుకు నా హదయం గాయమై.. కన్నీరొలికింది..
ఆనందాల అంబరంలో
ఏ నిరాశ మబ్బులో కమ్ముకున్నాక
నువ్వు అల్లిన ప్రేమపాశానికి
ఇప్పుడు
నా జీవితకాలం వేలాడుతున్నది....
నీతో పెనవేసుకున్న బంధం
నీమీద పెంచుకున్న అనురాగం
ఎడబాటు అనే ఎడతెగని కసాయి వేటుకు
తునాతునకలైపోయింది....
నిరంతరంగా... నిర్వీరామంగా...
నిర్లక్ష్యం ఈటెలు
గుండెలో దిగుతుంటే...
బతుకు కన్నీటి ప్రవాహమవుతున్నది.....
ఈదలేక ప్రాయం నీవులేని ఆవలి తీరాలకు కొట్టుకుపోతున్నది....
దుఃఖపు గునపాలు దిగుతూ ఉంటే...
ఎడతెగక ఎద గాయం అవుతుంటే....
గొంతు మూగపోతున్నది
కన్నీరు గడ్డకట్టుకు పోతున్నది
రెక్కలు తెగిన పక్షిలా
చైతన్యం ఒరిగిపోతున్నది....
అయినా
నా మీద జాలి లేదా ప్రియా?
నన్ను ఇంకా ఇంకా సాధిస్తూనే ఉంటావా?
నా సమాప్తాన్ని కోరుకుంటూనే ఉంటావా ?
వద్దు ప్రియా....
నన్ను నీ జ్ఞాపకంగా అయినా బతకనివ్వు...!
నేను ఈ ప్రపంచానికి
స్నేహితుడిని....అభిమానధనుడిని....
నాలో కనిపిస్తున్న ఈ కోణాలు మాత్రమే
ఇప్పుడు నా ముఖచిత్రం కాదు....
నేను ఇప్పుడు
ఒక వంచితుడిని....ఆశక్తుడిని.....
అందుకే దిగ్భ్రమ సడి చేస్తున్నది
నా తరుపున అందరినీ పలకరిస్తున్నది....
ఒంటరితనం మిగిలిన చోట -
ప్రేమ ఒక ప్రశ్నగా మిగిలిన చోట -
ఆమె ఆలోచనలు మాత్రమే
ప్రపంచం అయిన చోట -
నాదనే లోకం నన్ను వదిలిన చోట -
ఇప్పుడు అశ్రువులు సముద్రాలను సష్టిస్తున్నాయి....
అగాధలను తవ్వుతున్నాయి.....
తట్టుకోవడం తరమా? తప్పదా?
ప్రియా.....
ఒక్కటీ మాత్రం నిజం
నీ కఠినం కూడా నాకు మోదమే!
నీ తిరస్కరణ కూడా నాకు ఆమోదమే!
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
నీవు తెరిచిన ఎడారి ద్వారాల్లో
ఏ ఒయాసిస్సులనో అన్వేషిస్తూ నేను నీకోసం
శ్వాసిస్తూనే ఉంటాను....!
- పొన్నం రవిచంద్ర,
9440077499