Sun 28 Nov 04:41:28.102051 2021
Authorization
'ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము / నరుడు నరుడగుట ఎంత దుష్కరము సుమ్ము'' అన్నగాలిబ్ గీతాన్ని మన దాశరథి తెలుగులో మనకందించారు. అవును కదా ఏదీ సులభంగా సాధ్యంకాదు. ఎంతోకొంత పరిణామం, పరిమాణం జరిగిన పిమ్మటనే కొన్ని సంఘటనలు సంభవిస్తుంటాయి. మనం జరిగిన వాటిపైనే ఎక్కువగా మాట్లాడుతుంటాము. కానీ వాటి వెనకాల వున్న విషయాలు చూసే ప్రయత్నం చేయము. సైన్సు సూత్రమూ సామాజిక సూత్రమూ ఏమిటంటే ప్రతి కార్యానికీ కారణముంటుంది. కారణాలను విశ్లేషించుకున్నపుడే విషయం సుబోధకమవుతుంది.
ఢిల్లీలో గత సంవత్సర కాలంగా, మున్నెన్నడూ లేని విధంగా రైతులు టెంట్లువేసుకుని ఢిల్లీ గద్దెపై పోరాటానికి పూనుకున్నారు. ప్రపంచచరిత్రలో లభించదగినదిగా ఈ పోరాటం సాగుతున్నది. వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తేవటానికనీ కేంద్రం మూడు కొత్త చట్టాలు తెచ్చింది. ఈ మూడు చట్టాలు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకేనని, రైతులు వారి చెప్పు చేతుల్లో బ్రతకాల్సి వస్తుందని, పండించిన పంటకు మద్దతు ధర పొందేందుకు ఆటంకమవుతుందని రైతులు ఉద్యమం చేపట్టారు. కానీ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయటానికి శతవిధాలా ప్రయత్నించింది. అనేక నిర్భంధాలను విధించింది. దాడులు చేసింది. ఆఖరకు కార్లతో తొక్కించి, కాల్పులు జరిపి చంపింది కూడా. అయినా పట్టుదల సడలకుండా పన్నెండు నెలలుగా వీధుల్లో రాత్రింబవళ్ళు ధర్నా చేస్తూనే వున్నారు. ఎట్టకేలకు మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతులకు, దేశానికి క్షమాపణలు చెప్పి, మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఇది రైతులకు గొప్ప విజయమే. కానీ పూర్తిగా చట్ట సభలలో రద్దుచేసి, రైతుకు కావలసిన మద్దతు ధరను ప్రకటించడమూ, విద్యుత్ బిల్లును వెనక్కు తీసుకోవడము, ఈ ఉద్యమంలో చనిపోయిన రైతులను ఆదుకోవడమూ, కేసులను ఎత్తి వేయడమూ చేసేవరకు ధర్నా విరమించేది లేదని రైతు ఉద్యమ సమన్వయ కమిటీ ప్రకటించింది. ఇక ఎలా ముగుస్తుందో చూడాల్సివుంది. అయినా ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి విజయం సాధించటం సామాన్య విషయం కాదు. ఒక అద్భుత విజయం. శ్రామికుల అకుంఠిత దీక్షకు, త్యాగానికి దక్కిన ఫలితమిది. అయితే ఇందుకోసం వేలాది రైతు కుటుంబాలు ఒక సంవత్సర కాలంగా రోడ్లపై జీవనం సాగించారు. ఏడువందలకు పైగా రైతులు ప్రాణాలను అర్పించారు. లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి పోరాడారు. అంతేకాదు. దేశంలో వున్న కార్మికులు, సామాన్య ప్రజలు కూడా వారి పోరాటానికి మద్దతుగా నిలిచారు. అదే విధంగా అంతకుముందే మహారాష్ట్ర రైతాంగము పెద్దయెత్తున వారి సమస్యలపైన పాదయాత్ర జరిపి దేశం దృష్టిని ఆకర్శించింది. ఆలోచింపజేసింది. రాజస్థాన్లోనూ రైతులు ఆందోళనలు చేశారు. చుట్టుముడుతున్న ఆందోళనలు ఢిల్లీ పోరాటాన్ని మరింత పదునెక్కించాయి. పర్వవసానంగా విజయం వరించింది. ఇందులో పాలకుల తక్షణ ఎన్నికల ప్రయోజనాలూ వుండవచ్చు. వెనక్కు తగ్గినట్టు నటించ డమూ కావచ్చు. ఏదేమయినా విజయం సత్యము. మరింత అప్ర మత్తతతో వుండటమూ అత్యంత అవసరం.
మన రాష్ట్రంలోనూ రైతులు కన్నీళ్ళలో మునిగి తల్లడిల్లుతున్నారు. కల్లంలో ధాన్యం తడిసి, కొనేవాళ్ళు లేక లబోదిబోమంటున్నారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెబితే, రాష్ట్రమూ చేతులెత్తేసింది. ధాన్యపు కుప్పలపైనే రైతు ఊపిరులు విడుస్తున్నాడు. ఆదుకునేవారులేక ఆవేదన చెందుతున్నాడు. రాజకీయ లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాకులాడుతున్నాయి. అన్నంపెట్టే రైతును ఇన్ని ఇక్కట్లకు గురిచేయటం సరికాదు. రైతులు తిరగబడే వరకు తాత్సారం తగదు. వెంటనే తెలంగాణ అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే ఢిల్లీ రైతుల పోరాట విజయం స్ఫూర్తితో ముందుకుపోక తప్పని స్థితివస్తుంది.