Sat 04 Dec 23:22:59.895689 2021
Authorization
ఎర్రవల్లి పేర్లోనే ఏదో శక్తుంది
ఎరుపెక్కిన ఎద లోతుల గాయముంది!
ఎర్రవల్లి ఊర్లోనే ఏదో మహత్తుంది ఎత్తైన కొండల్లో పూచిన
ఎర్ర మందారమది!
ఇక్కడి మట్టిలోనే మొరటుతనముంది
ఈడి నీళ్ళళ్ల సల్లదనముంది
వీచే గాలిల పెంకితనముంది
ఊరి జనాలల్ల బోళాతనముంది!
ఈ ఊరోళ్ళు
కలెగూర గంప లెక్క
ఒకరికొకరు కల్సిపోవుడే కాదు,
బరి గీసి కలెబడేటోళ్లు గూడా!
పల్లెకు పర్యాయపదమైన ఎర్రవల్లి
ఇప్పుడు పిల్లలు లేని తల్లైంది
రెక్కలిరిగిన పక్షైంది
కొమ్మలిరిగిన చెట్టైంది
కట్ట తెగిన చెరువైంది!
నాపరాయి వాకిళ్ళు పొక్కిళ్ళైనై
ఇండ్లల్ల ముండ్ల కంపలు మొలిచినై!!
చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన బురుజు
దభేల్మని కూలినప్పుడే అర్థమైంది
చౌదర్ కాడున్న కచీరు
చిన్నబోయినపప్పుడే అనిపించింది
ఏదో ముప్పు కొక్కెం తగిలిందని!
మూడేండ్లకే మునిగిపోతుందనుకోలే!!
ఊర్ని నమ్ముకున్న కుక్కలాగమైనై,
మావోళ్ళు ఏమైపోయిండ్రని
అద్దుమ రాత్రి నిద్దురలేక అరుస్తున్నై!
తాళాలు వడ్డ తలుపులు ఢలాీవడ్డై
దూలాలు బిక్కుబిక్కుమంటూ
దిక్కులు చూస్తున్నై,
నిల్వ నీడనిచ్చిన గూనపెంకులు
వాన చుక్కల్ల్లా రాలి పడ్తున్నై
పెద్దోల్ల సమాధులు అనాధలైనై!
ఎర్రవల్లి ఇప్పుడు
మల్లన్న సాగర్ల మూడు మునకలేసి
మూట్రాజ్ పల్లెల తేలింది!
పల్లె బతుక్కి, పట్నం పౌడర్ అద్దుకుని
హైనాకూనలా హైరానా పడుతుంది!
ఇన్నాళ్లు యిరాం లేక
యిత్తునాలేసిన చేతులు,
పని కోసం మారాం చేస్తున్నై!
కుల వత్తులతో మమేకమైన చేతులు
ఆకలి పేగులను తడుముకుంటున్నై!
బంగారు రాష్ట్ర కాంక్షకై
బంగరు భూములనిచ్చి
నిలువు దోపిడీ మొక్కు చెల్లించుకొని
బత్కుదెరువు కొరకు వెత్కుతున్నరు...!!!
- గంగాపురం శ్రీనివాస్, 9676305949