Sat 11 Dec 22:59:07.661854 2021
Authorization
మోసం జరుగుతోంది అంటే, మోసం చేసేవాళ్ళు, మోసానికి గురయ్యే వాళ్ళు వున్నారని అర్థం. సమాజంలో మోసాలు జరుగుతాయని మనమందరం అనుకుం టాము. అంటే మోసాలు జరిగే సమాజంలోనే మనమున్నామని అర్ధం. మోసం చేయాలనే తలంపు ఒక మనిషికి ఎందుకు వస్తుంది. తనకు తానుగానే పొందే మానసికతనా అది! కాదు. మోసం చేసి కూడా మనుగడ సాగించవచ్చనే ఆలోచనలు ఈ సమాజం ఇచ్చినదే. మోసం చేసే లక్షణం, కనపడకుండా సమాజంలో కొనసాగుతున్నదేనన్న విషయం మనం అవగాహన చేసుకోవాల్సింది.
మోసం అనే పదానికి దొంగతకం, వంచన, ద్రోహం, అబద్ధం, వెన్ను పోటు, కౌటీల్యము, ఢోకా, దగా, టోకరా, చోరీ, టక్కరితనం, టోపీవేయడం ఇలా చాలా పర్యాయపదాలున్నాయి. నమ్మించి గొంతు కోయటం అని అంటారు కదా! అదే మోసం అంటే.. మోసాలలో అనేకరకాలుంటాయి. అబద్ధాలు. ఆడుతూ చేసే మోసాలు, తల్లిదండ్రులతో అనేక అబద్ధాలాడి పిల్లలు ఓ రకంగా పెద్దలను మోసం చేస్తుంటారు. అలాగే తల్లిదండ్రులూ పిల్లలకు అబద్ధాలు చెబుతుంటారు. ఇవి కూడా మోసం కిందకే వస్తాయి కానీ కుటుంబ సభ్యులను నిజాలు చెప్పి బాధపెట్టటమెందుకని చేసేవి కొన్ని ఉంటాయి. అసలు మోసాలు సమాజంలో ఎక్కు వుంటాయి. మార్కెట్ మోసాలకు హద్దూ అదుపూలేదు. సరుకులు అమ్ముకునే ప్రకటనల్లోనే అనేక మోసాలుంటాయి. కల్తీ వస్తువులు, తూకంలో దగాలు, నాణ్యతలో ద్రోహాలు, ధరలో మోసాలు ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. అంటే వ్యాపారం, లాభం, వున్న చోటల్లా ఈ మోసాలు జరుగుతూనే వుంటాయి. అమ్మకాలు, కొమగోళ్ళు వున్న చోటా అంతర్లీనంగా ఈ ఢోకా కొనసాగుతుంటది. ఇక అసలు మోసం సరుకులను తయారు చేస్తున్నపుడే ఆరంభమవుతుంది. అదేమీటంటే వస్తువులు ఉత్పత్తి చేసేది శ్రాఖకులు. వారు కష్టపడి ఒక వస్తువుకే విలువను తీసుకొస్తారు. కానీ వారికి ఆ విలువ మేరకు ప్రతిఫలాన్ని ఇవ్వకుండా మోసం చేయటంవల్లనే లాభాన్ని యజమానులు పొందుతున్నారు.
తానులాభం పొందటం కోసం, సరుకులను అమ్ముకోవటం కోసం ఎన్ని మోసపు ప్రచారాలు బహిరంగంగా చేస్తున్నారో మనం చూస్తున్నాము. మనకు చల్లని హాయినిస్తుందని ప్రచారం చేసే చల్లని పానియాల్లో ఎరువులు పురుగు మందు లుంటాయని తెలిసి నివ్వెరపోలేదా మనం! ఒక్కటేమిటి సకల సరుకులు నిత్యం మనల్ని మోసానికి గురిచేస్తూనే వున్నాయి. ఇక ఇప్పుడు ఆన్లైన్లో వస్తువులను చూసి, బుక్ చేసి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు పార్సిల్లో రాళ్లూ రప్పలు రావడాన్ని ఎన్ని వార్తలో కనలేదూ! మనకు చూపెట్టిన వాటికీ వాళ్ళు పంపే వాటికి తేడా లెంతో అనుభవించేవాడికే తెలుసు.
ఇక ఫోన్లలో గిఫ్ట్లు పంపిస్తున్నామని డబ్బులు గుంజే నకిలీ స్నేహితుల మోసాలు కోకొల్లలు. డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ పేర జరిగే మోసాలతో జనులు ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. గొలుసు కట్టు విక్రయాల పేరుతో, లాటరీల పేరుతో, వస్తువుల అమ్మకాల. పేరుతో సామాన్య ప్రజలలో ఆశలు పెంచి. చేస్తున్న మార్కేటింగ్ మోసాలు మన ఇంటి ముందరికి వచ్చేశాయి. ఇకపోతే సైబర్ మోసాలకు తెలివైనవారు, చదువుకున్నవారూ నిత్యం గురవుతూనే వున్నారు. సమాజమంతా మాయలు మోసాలతో నిండిపోతోంది. సరుకులకే పరిమితమై పోలేదు. మనుషులు కూడా అంతే. తనకు పెళ్లే కాలేదని డబ్బుకోసం వంద పెళ్ళిళ్లు చేసుకున్న మోసపు వరుళ్ళు వధువులూ వున్నారు.
అందుకనే వస్తు వ్యామోహానికి, వినియోగదారీ మాయాజాలానికి గురి కాకుండా జాగ్రత్తపడాలి. ప్రలోభానికిలోనయితే మోసం విజయం సాధిస్తుంది. కనుక సమాజపు మౌలిక స్వభావాన్ని అవగాహన చేసుకుని జాగురుకూకతతో వుండాలి. జరుగుతున్న మోసాలకు వ్యతిరేకంగా నిలబడాలి.