Sat 25 Dec 22:53:22.556713 2021
Authorization
కాలం వెనకాల పెద్దకతేవుంది. అంతుపట్టనిది, చిక్కనిదీ కాలం. దానికంటూ ఓ రూప స్వభవాలు వేరుగా ఏమీవుండవు. స్టీఫెన్హాకిన్స్ మహాశయుడు కాలబిలాల గురించి రాసాడు గానీ అదంతా ఓ వైజ్ఞానికి తాత్వికాంశం. సాధారణంగానైతే మూడు కాలాలు మనకు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఈ కాలాలను అందరూ ఎరుగుతారు.. ఋతువులారు. వీటి సంగతి వేరు. కాలాల్లోని విభజనలు అన్నీనూ. కాలమూ దూరము అని చిన్నప్పుడు గణితశాస్త్రంలో నేర్చుకున్నాము. ఆ లెక్కలు అంతంతగానే అర్థమయ్యాయి. గడుస్తున్న గడ్డు రోజులను అనుభవిస్తూ 'మనకాలం' బాగోలేదని నిట్టూర్చాము. ఇది మాత్రం బాగా తెలుసు మనుషుల ప్రవర్తన మారటాన్ని గమనిస్తూ కాలం మారిందిరా బాబూ అని సర్దుకున్నాము. ఆఖరికి కాలం చేశాడని, కాలధర్మం అనీ మనుషుల ముగింపునూ సంకేతించాము.
ఇంతకూ కాలమంటే ఏమిటి? 'ఎక్కడిలోంచి ఎలా పుట్టింది. కాలం, ఎవరు చేశారీఇంద్రజాలం' అని ఆరుద్రకాలం అర్థంకాకే కవిత్వమై ప్రశ్నించాడు. జవాబు దొరకకుండానే కాలపు ఇంద్రజాలానికి గురియైపోయాడు. కాలం అని అనగానే మనకు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది గడియారం. గోడగడియారం, గంటలు, నిముషాలు, సెకండ్లముల్లులు. వాటి ద్వారానే కాలాన్ని కొలుస్తాము. కాలం జరిగిపోతూ వుంటుంది. నీకోసం కాలం ఆగదురా అంటారు.
అందుకే వాగ్గేయకారుడు 'మేడగాని శేషగిరి'' కాలం నిన్ను, పదే పదే పలకరించిందీ... ఎదురుగా నిలబడీ హెచ్చరించింది'' అని పాడుతూ దాని విలువను అవగాహన చేయిస్తాడు. ''కాలాతీత వ్యక్తులు' అనే సాహిత్యరచనావుంది. కవులు కాలం మీద రాయకుండా ఉండనేలేరు. కాలిక స్పృహ ఉన్నవారే నిజమైన కవులుగా ప్రసిద్ధి చెందుతారు. ఇలా కాలాన్ని ఎన్నో రకాలుగా వాడుతూనే వుంటాం. కానీ మరి కాలం అంటే ఏమిటి? కాలమంటే పగలూ రేయా! భూమి తన చుట్టు తాను తిరగడమా! మనం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చేసిన పనులా కాలం? మాటల వ్యవధాకాలం! సూర్యుని ఉదయాస్తమయాలా కాలం ! చిగురేసిన మొలక చెట్టయి పెరగటమా కాలం! మునిని ముంచెత్తిన వాల్మికమా కాలం? ఏది కాలం! ఎక్కడుంది దాని ఆది, అంతము. ఎవరు దాని సృష్టికర్తలు?
ఇలా కాలం గురించి సమాధానాలు లేని ప్రశ్నలు వేస్తూ కాలాన్ని వృధా చేయటంకంటే, మనం చేయాల్సిన పనులేమిటో జాగత్తగా ఆలోచించుకుని ముందుకుపోవటమేమంచిది. శాస్త్రవేత్తలు చెప్పినంత వరకు ఇలా వివరించారు. 'ఒక బిందువు నుంచి మరో బిందువు వరకు ఉన్న దూరమే కాలం'' అన్నారు. ఈ దూరపు పరిమాణమే కాలం. ఒక అగంతక అదృశ్య వాస్తవ ఘటన నామమే కాలం. కాలాన్ని చూడాలంటే మనం విశ్వంలోని పదార్థ పరిణామంలోనే, చలనంలోనే చూడగలుగుతాము. మనం కలంతో రాస్తున్నపుడు, అనేక బిందువులను కలుపుతూ అక్షరాలకు రూపాన్ని ఇస్తాము. దాని రూపు వెనకాల నిక్షిప్తమైనదే కాలం. కాలం చేత చిక్కిన ఘటనలే చరిత్ర. కాలపువొడిలో ఊయలలూగే మన ఆలోచన ఆచరణే వర్తమానం, కలల్లో పరచుకున్న ఆశలు భవిష్యత్తు.
అందుకని కాలానికి వేరుగా రూపంలేదు. మన రూప పరిణామంలోనే కాలం జీవిస్తూవుంటుంది. నిముషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, తేదీలు, లెక్కలు అన్నీ, మన చలనానికి గీసుకున్న హద్దులు మాత్రమే. మన ఆలోచనలకు ఊహల రేఖా చిహ్నాలు మాత్రమే. ఇప్పుడు మనం కొత్త సంవత్సరమని, వెళ్ళిపోతున్న సంవత్సర మని పేర్లు పెట్టుకుని అనేక హంగామాలు చేస్తూ టాటాలు, బైబైలు చెబుతూ, స్వాగతాలు పలుకుతూ కాలాన్ని ఆహ్వానిస్తున్న వేడుకలన్నీ మన, మనుషుల ఆశలు, ఆకాంక్షల, అనుభూతుల వ్యక్తీకరణలకు సందర్భాలు మాత్రమే.
ప్రవాహగుణశీలమైన కాలంతో మనమూ పరుగెత్తగలుగుతున్నామా లేదా అని బేరీజు వేసుకోవటానికి ఒక కొండగుర్తును ఏర్పాటు చేసుకోవటమే నూతన సంవత్సర సంరంభాలు. మనం చేసే పనులు, ఆలోచనలు మాత్రమే కాలపు రహదారిపై నిలిచిపోయే మైలురాళ్లు. మన తాలూకు జ్ఞాపకాలు వాటిలోనే మిగిలివుంటాయి. అందుకే మన ప్రయాణం ముగిసేలోపే కాలంపై మనదైన సంతకాన్ని చేసిపోవాలి. పదుగురికి పనికొచ్చే పనేదో చేసేందుకు. కాలపు ఉదయాన ప్రతిన పూనాలి.