Sat 25 Dec 23:17:47.844842 2021
Authorization
ఒక చెరువు ఒడ్డున చింతచెట్టు మీద కాకమ్మ చక్కటి గూడు కట్టుకుంది. అందులో ముచ్చటగా మూడు గుడ్లు పెట్టింది. ఒక కోకిలమ్మ ఎక్కడి నుంచో వచ్చి చింతచెట్టు మీద వాలింది.కాకమ్మ గూటిని చూసి ముచ్చట పడింది.
''ఏంది కోకిలమ్మ యిటొచ్చావూ!'' అంది కాకమ్మ.
''నీగూడు ముచ్చటగా ఉంది. చూద్దామని వచ్చా!'' అంది కోకిలమ్మ.
''నాదేమి గూడులే! కట్టెలగూడు. గిజిగాడు కట్టేదే ముచ్చటైన గూడు!''అంది కాకమ్మ.
''నాకు కట్టెల గూడు కూడా కట్టుకోరాదు'' అంది సిగ్గుతో కోకిలమ్మ.
కోకిలమ్మ ఎంతసేపైనా అక్కడి నుంచి కదలలేదు.
''ఏదో పనిమీద వచ్చినట్టున్నావు. సిగ్గు పడకుండా చెప్పు'' అంది కాకమ్మ.
''నాకు నీ గూటిలో ఇంతచోటిస్తే, గుడ్లు పెట్టుకుంటాను. పిల్లలు కాగానే వెళ్ళిపోతాను'' అంది కోకిలమ్మ.
''నా గూటిలో నాకే చోటు లేదు. పైగా నిన్ననే మూడు గుడ్లు కూడా పెట్టాను'' అంది కాకమ్మ. కనీసం గుడ్ల వరకు ఇంత చోటిస్తే కాకమ్మ బయటకు పోకుండా పురుగులు, గింజలు తెచ్చి పెడతానంది కోకిలమ్మ. ఆలోచించి రేపు చెపుతానంది కాకమ్మ.
అక్కడినుంచి ఆశగా వెళ్ళిపోయింది కోకిలమ్మ.
కాకమ్మ ఆహారం కోసం చెట్టు దిగింది. చెరువు ఒడ్డున ఒక కోడమ్మ కనిపించింది. దాని వెంట రెండు బుజ్జి కోడి పిల్లలతోపాటు మరో రెండు చిట్టి బాతు పిల్లలున్నాయి.
''కోడమ్మా! ఈ చిట్టి బాతులు నీ వెంట తిరుగుతున్నాయెందుకూ !?'' అంది కాకమ్మ.
''అవి కూడా నాబిడ్డలే ! పాపం బాతమ్మ గుడ్లు మాత్రమే పెట్టగలగుతుంది .గుడ్లు పొదిగి పిల్లలు చేయలేదు. అందుకే బాతమ్మ గుడ్లు నేను పొదిగి పిల్లలు చేయటమే కాదు. పెంచే బాధ్యత కూడా తీసుకున్నాను'' అంది గొప్పగా కోడమ్మ.
కోడమ్మలోని దయాగుణానికి కాకమ్మ పొంగి పోయింది. తాను కూడా ఇతరులకు సహాయపడాలనుకుంది కాకమ్మ.
మరునాడు ఆశగా వచ్చిన కోకిలమ్మను తన గూటికి ఆహ్వానించింది కాకమ్మ. కోకిలమ్మ మూడు గుడ్లను పెట్టింది. తన గుడ్లతో పాటు పొదిగి మొత్తం ఆరు పిల్లలను చేసింది కాకమ్మ.
''నీ రుణం తీర్చుకోలేనిది మిత్రమా !'' అంది తన బిడ్డలను చూసి మురిసిపోతూ కోకిలమ్మ.
- పైడిమర్రి రామకృష్ణ, 9247564699