Sat 25 Dec 23:18:45.762143 2021
Authorization
అతడి చెమటచుక్కలు నేలను ముద్దాడితేనే
బువ్వపూలు పూసేవి.
మన కడుపులో ఆకలి చల్లబడేది.
అతని పాదాలు మట్టిలోదూకి..
తనువంత నాగేటి సాళ్ళల్లో స్నానమాడితేనే..
వరి పైరులన్ని పురుడోసుకునేవి.
జనాల ఆకలిని తీర్చే గొప్ప విద్యను..
నేర్చుకున్న శాస్త్రవేత్త మన హాలికుడు.
మట్టిముద్దలతోనే అతడి సావాసం.
సేను సెలక దగ్గరే అతడి నివాసం.
ప్రపంచానికి పంచామతంలాంటి..
అనాన్ని అందించడమే అతడి ఆశయం.
పారుతున్న నీటితోనే కడుపునింపుకుంటాడు.
కారం మెతుకులతోనే కాలం ఎల్లదిస్తాడు.
గిట్టుబాటు దక్కకున్న దుఃఖాన్ని దిగమింగుకొని
కన్నీటిని కారుస్తూ కర్షకుడై కదులుతాడు.
రేపటి భావితరాల భవిష్యత్తుకు..
బుక్కెడు బువ్వయి ఆకలిని తీర్చడానికి.
సూరీడు సురకత్తుల్లా నిప్పులు కక్కుతున్న...
చెమటదారలను.. నీటిదారలుగా పారించి..
విత్తిన విత్తులన్నింటిని బతికించుకుంటాడు.
కల్తీలు నకిలీలు అన్నీ కలవరపెట్టిన..
ఆశయాన్ని ఆవిరికానివ్వకుండా..
రుధిరాన్ని మట్టిలో రంగరించి..
ఒంట్లో నరాలన్నింటిని నాగళ్లుగా మలుచుకొని
ధాన్యపు రాసులను కురిపిస్తాడు.
ఇపుడు వరి కుప్పలపైనే కుప్పకూలుతున్నాడు.
కొత్తచటాలన్ని కత్తులై ఎదలో గుచ్చుకుంటే..
నమ్ముకున్న మట్టిలోనే కాలం చెల్లిస్తున్నాడు.
వరి కొనమంటూ కొత్తపలుకులు పలుకుతుంటే..
కేంద్రం విసిరిన వలలో చిక్కుకొని..సేద్యకాడు
కొట్టుమిట్టాడుతున్నాడు.
కర్షకా..నీనుండి కారుతున్న కన్నీరు..రేపు అగ్నిజ్వాలాలై
ఎగసిపడుతాయి.
నయవంచనకు గురిచేస్తున్న బడాబాబులను
దహించివేస్తాయి.
- అశోక్ గోనె, 9441317361