ఏ తల్లి కడుపున పుట్టిందో నా కడుపుకింత అన్నం పెడుతుంది
బతికున్నోళ్ళను చిందేసి ఆడించింది అయినోళ్లూ ఎవరు లేకపోయినా సచ్చినోల్లనూ చివరిదాకా సాగనంపింది
చీకటి బతుకుల వెలుగు నింపమని శివసత్తులతోటి శివతాండవం ఆడించింది ఈపు పగిలేలా కొట్టినా జనం చేత చప్పట్లు కొట్టించింది
ఊరంతా ఒక చోట కనువిందు చేసే కనుల పండుగ జమ్మి దొరకకపోయిన జజ్జన్కై ముందు నడుస్తది వొళ్ళంతా కాలుతున్న పీర్లు బాయిలవడ్డదాక అసయిదూల అంటూ అలసిపోకుండా ఆడిస్తది
ఎన్నో అవమానాలకు పగిలిన నా గుండె గదిలోంచి ఉప్పొంగె కన్నీటి ప్రవాహాన్ని ఆనకట్టేసి ఆపింది
ఒంటరని బాధపడుతుంటే ఈ సిర్ర , సిటికే నా తమ్ముళ్ళై నా కన్నీళ్ళు తుడిసినై వారసత్వమే అయ్యిండొచ్చు కానీ, నా ప్రాణమై , నా పేరు ముందు నిలిచింది ఈ డప్పే ఈ డప్పే ఈ డప్పే