Sat 01 Jan 22:44:57.234784 2022
Authorization
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మనమేమయినా మారిపోయామా! పోనీ మన ఆవరణం, స్నేహితులు, చెట్లు, పుట్టలూ, పనులూ పాట్లూ, భయాలు, నిర్భయలు ఏవైనా మారాయా? చూపులో, ఆలోచనలో, నడకలో, నలతలో ఏమైనా మార్పులొచ్చాయా? అబ్బే ఏమీలేదు. అన్నీ యధావిధిగానే వున్నాయి.
గుడ్లురిమి చూస్తున్న కూరగాయాలూ, ధరలు నిప్పుల్లా చెరగుతున్న నిత్యజీవితావసర సరుకులూ ఏమాత్రం మారలే. సూర్యుడి ముఖమూ ఇంట్లో ఈసడింపుల భార్యామణి విసుర్లూ అన్నీ అలానే వున్నాయి. వీధిలో మూలుగుతున్న కుక్కా, ఎలుక కోసం పొంచి చూస్తున్న పిల్లీ, గూడులేక ఎగిరిపోయిన పిట్టా మంచుదిగి మబ్బులామారిన ఊరు, కూలీల అడ్డాకాడ ఎదురు చూపుల జీవన సమరం ఏదీ ఏదీ మారలేదు కదరా!
కొత్త కొత్త అని తెగ జడి నీలోపల్లోపల వినపడుతున్నా, డిగ్రీ పూర్తయిన వాడి చేతుల్లో రెజుమేల భవిత చిట్టా వెతుకులాటలోనే వుంది అయినా చదువుకొనే బజారులో విజ్ఞానాన్ని కుప్పలు పోస్తూనే వున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఆఫీసు క్యాబిన్లో కుర్చీకి వెన్నెముకను కుట్టేసుకుని కళ్ళల్లో జీవితాన్నీ కరగదీసుకుంటూనే వున్నాడు. ఫ్లై ఓవర్లపై ఎవడి బతుకు బండిని వాడు లాక్కెళుతూనేవున్నారు. రహదారుల రక్తపుదాహాలేవీ తీరుతనేలేవు. పల్లెల్లో కళ్లాల్లో కుప్పేసిన ధాన్యం రైతు కన్నీళ్ళలో తడుస్తూనే వుంది. బాధలలోతుల్లోకి దిగబడ్డ నాగలి పైకి లేస్తనేలేదు. రాజకీయపు పద్మవ్యూహంలో కర్షకుడు అభిమన్యుడిలా చిక్కి హతుడౌవుతున్నాడు. అమ్మబోతే అడవీ, కొనబోతే కొరవిలా వ్యవహారం పెంకపై నుంచి పొయ్యిలోకి జారి పడుతున్నది. నిల్వలు పెరిగిపోయినయి. ఇక వొడ్లు పండించొద్దని గుండె బద్దలు కొడుతూ చెప్పేస్తున్నారు. మరి తిండికి లేక అర్థాకలితో అలమటించే జనం రోజురోజుకూ పెరుగుతూనే వుండటమేందో! ఆకలిని కూడా మనతోనే తీసుకుని కేలండర్ మార్చుకుని అడుగేసాం.
ఆడపిల్లలపై లైంగిక దాడులు, హత్యలు, వివక్షతలూ, కక్షలూ అవహేళనలు, అసమానతలు, అనాగరిక వ్యాఖ్యానాలూ అన్నీ కొన కొనసాగింపు తోనే పరమ చెత్తగా కొత్త సంవత్సరంలోకి తోసుకువచ్చేసాం.
అంతేకాదు 'అదిగో ఆ మతానికి చెందిన వారిని చంపేందుకు మేముగాడ్సే అవతారమెత్తుతాం, సైనికులమై కత్తులు పట్టుకు ఊరేగుతాం. ఎవరు మమ్మల్ని ఆపేవారు. మాదే అధికారం. సెక్యులర్, ప్రజాస్వామ్యం పదాలను తీసేయండి' అంటూ బహిరంగంగానే వీరంగం వేసే మతోన్మాదహూకరింపులతోనే తారీఖులు దాటుతున్నాం. 'ఓరి తాగుబోతునా జనులారా! తాగండి ఊగండి! మీకింకా, ఇంకా కారుచౌకగా చీవ్గా మందు సరఫరాచేస్తాం. మమ్ముల్ని గెలిపించి బానిసలుగా బతకండి' అనే పిలుపులు నిర్లజ్జగాయిస్తూన్న వరుస ఏమీ మారకుండానే మనం నూతన వత్సరంలోకి అడుగులు వేసాం.
సంవత్సరాలు కొత్తగా మారితే సమాజము మారదు. మనచూపు మారాలి, మన నడక, ఆచరణమారాలి. వెలుగులు నిండటమంటే ఎప్పుడూ వచ్చే సూర్యుడు ఎప్పటిలానే రావటం కాదుగదా! జీవితం మనకు గీటు రాయి. జీవితంలోకి వెలుగు రావటమంటే, ఎవరి జీవితం వాళ్లు జీవించగలగాలి. ఆనందమూ, సంతోషము నిండిపోవాలి. చుట్టుముడుతున్న సమస్యల శత్రు సైన్యాలపై విరుచుకుపడే వీరత్వం పొందగలగాలి. కానీ శత్రువు మరింత బలంతో ముందుకు వస్తూనేవున్నాడు. వెనక్కి తగ్గినట్టు నటించాడు తప్ప అంతమయిపోలేదు. ఇంకోవైపు గత రెండేండ్లుగా మన వెంటపడి వేటాడుతున్న కరోనా రక్కసి, అనేక రూపాలతో తిరిగి తిరిగి విరుచుకు పడుతూనే వున్నది. ఈ కొత్త వత్సరంలోకి మనతోనే అడుగులు వేస్తూ విజృ0భిస్తున్నది.
ఏ శత్రువుపైనా మన యుద్ధం ముగియనేలేదు. అన్నిరకాల సవాళ్ళతోనే ఈ పయనం కొనసాగుతున్నది. పాత రుగ్మతలే పట్టి పీడిస్తుండగా కొత్త ఉదయంలోకి ప్రవేశించాం. ఇప్పుడిక విజయ దుంధుభిమోగించిన రైతన్నల మార్గాన వెల్లువెత్తటమే మన ముందున్న కర్తవ్యం. అప్పుడే విజయం, ఉషోదయం. నూతనం నవవత్సరం.