Sun 23 Jan 11:06:03.702856 2022
Authorization
గీమద్దెల కేరళ రాష్ట్రాన సదువుకునే బళ్ళలో ప్రార్థన చేసేపుడు పోరగాళ్ళ చేత రాజ్యాంగంలో వున్న ముందు మాటను సదివిస్తోన్లంట. అరె గిప్పుడెందుకు గిది. దీనవసరమేమొచ్చిందీ అని నాకో అనుమానమొచ్చి సొచాయించా! మనకు సొతంత్రం వొచ్చి డెబ్బయి ఐదేండ్లు కావొస్తుండె. గిప్పుడెందుకూ అనుకున్న. దాని మతలబు తెలిసింది. తరాలు మారినరు. సొతంత్ర పోరాటంలో పాల్గొనని వాళ్లు దేశాన్ని ఏలుతుండిరి. ఒక పారి మర్చి పోయినోళ్లకు గుర్తు చేయటానికి యీళ్ళ చేత సదివిస్తున్నరో యేమో! అవును మరి సొతంత్రం వద్దన్నోళ్లు, ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోమన్నోళ్లు, జెండాను కూడా గుర్తించనోళ్లు ఇప్పుడు యేలబడ్తిరి. సిత్రమేంటంటే గా రాజ్యాంగం పుణ్యమా అని ఆళ్ళు పదవుల్లోకొచ్చిన్రు
మనం ఆనాడు ఎన్నో పాణాలనిచ్చి, రెండొందల యేండ్లు పాలించిన తెల్లోళ్లని యెళ్లగొట్టి తెచ్చుకున్న సొతంత్రంలో మనకు మనమే రాజులమని, పాలకులమని, రాసుకున్నదే రాజ్జాంగం. అంతకు ముందుగా తెల్లోళ్ల రాజ్జాంగ పకారమే దేశం నడిచేది. 1947లో బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డా|| బాబాసాహెబ్ అంబేద్కర్, ముసాయిదా కమిటీ ఛైర్మన్గా రెండేండ్లకు పై బడి పపంచంలోని రాజ్జాంగాలను, న్యాయ చట్టాలను సోధించి రాసుకున్నం. అంబేద్కరుతో పాటు ఎంతో మంది దీని కోసం కృషి జేసిండ్లు. అయినా ప్రధాన రూపసిల్పి బాబా సాహెబే. ఇంత పెద్దగా రాసుకున్న రాజ్జాంగం మరెక్కడా లేదు. అంత గొప్పది మనది. 1949 నవంబరులో భారత రాజ్జాంగాన్ని రాజ్జాంగ పరిషత్ ఆమోదించింది. గిట్ల తయారైన దీన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజేశారు. అప్పటి నుంచి మనది 'సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రసాజ్వామ్యం, గణతంత్ర' రాజ్జెంగా అవతరించింది. దీన్నే మనం పతి యేటా జనవరి 26న వేడుక జేసుకుంటం.
ఈ రాజ్జాంగం ముందుమాటలో మనం ఎట్ల పాలించుకోవాలో మంచిగ వివరించుకున్నాం. ఆ యిలువల పకారంగా పాలన జేసుకోవాలని రాసుకున్నం. దేశం సార్వభౌమత్వాన్ని కల్గి ఉంటదని, అంటే మొత్తం అధికారం దేశానికే వుంటుదని చెప్పుకున్నాం. ఇంక సామ్యవాదం అని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ పదాన్ని చేర్చాం. అంటే దానర్థం సమ సమాజ స్థాపన. పెజల మద్దెన ఆర్థిక అంతరాలను లేకుండా సేయడం. ఇంక మన దేశ సంపద జాతీయ సంపదగా ఉండటం. ప్రయివేటు వాళ్ళ సేతుల్లో పెట్టకుండా కాపాడటం. కానీ ఇప్పుడంతా ప్రయివేటోళ్ళకు అగ్గువసగ్గువకు అమ్మేత్తనే వున్నరు మరి! ఇక సామ్యవాదం ముచ్చటే లేకుండా పోయింది. ఇకబోతే లౌకికత్వం అంటే అర్థం మనది మత ప్రమేయం గల రాజ్యం కాదు. పాకిస్థాన్, బంగాదేశ్లా కాదు. అధికారమతం ఉండదు. పౌరులకు మత స్వేచ్ఛ వుంటుంది. రాజ్జానికి, మతానికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు జర్గుతున్నదేంది. పభుత్వాలే మందిరాలు కడుతూ మత బోధలు చేస్తోంది. దీనికి తూట్లు పొడిచి, వేరే మతం వాళ్ళను కొట్టి సంపే పనులు పెరుగుతుండె.
ఇక పెజస్వామ్యం, దేశ పజలందర్కి ఓటు హక్కు, పోటీ చేసే హక్కుని రాసుకున్నం. ఏడ జర్గుతుంది. డబ్బున్నోడే నిలబడుతోండు, గెలుస్తుండు. అందరికి సమాన హక్కులు పేరుకే మిగిలాయి. అందరికీ మాట్లాడే హక్కు ఉందంటరు. మాట్లాడితే కేసులు పెట్టి లోపటేస్తరు. ఉన్నోడికి ఓ న్యాయం, లేనోడికి ఇంకో న్యాయమాయె. ఒకడికి తరాలయినా తరగని ఆస్తి, ఇంకోడికి తినడానికే మెతుకు దొరకదు. కులపీడన, మత పీడనతో సామాజిక న్యాయం ఒట్టి మాటగానే మిగిలిపాయె. మనం ఎలా వుండాలో, ఎలా పరిపాలించాలో మనమే రాసుకుని డెబ్బెయి యేండ్లు గడుస్తున్నా ఒక్కటీ పాటిస్తలేము. పాటించకపోగా యీ రాజ్జంగమే బాగాలేదు. మనువురాసినదే మనం పాటించాలని కుల, మత భేదాలుగల దుర్మార్గ ఆలోచన కూడా చేయిబట్టే.
గిది సానా పెమాదం. మన రాజ్జెంగం వల్లనే గిన్ని రోజులు ఈ మాత్రం బతకగలిగినం. ఇది కూడా పోతే ఇక అల్లకల్లోలమే. నియంతలొస్తారు. పెజలూ లేదు, పెజస్వామ్యమూ వుండదు. అందుకే మనమంతా రాజ్జేంగాన్ని కాపాడుకోవటానికి ఈ సందర్భంగా పమాణం సేయాలి. రాజ్జేంగం వర్థిల్లాలి!