Sat 29 Jan 22:27:04.420836 2022
Authorization
'మూఢనమ్మకాలు ఎప్పుడయితే మన తలలోకి చేరితే, అప్పుడు మన మెదడు తల నుంచి తొలగిపోతుంది' అని సంఘసంస్కరణా ఆధ్యాత్మకుడు స్వామి వివేకానంద సెలవిచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే మెదడులేని మాటలను మనం వింటున్నాము. వింటూనే ఖాళీతలలూపుతూనే వున్నాము. అంత అచేతనాపరులంగా మిగిలిపోతున్నాము. మనకు స్వాములు, బాబాలు, మత బోధకులకు కొదువలేదు. వారి ఆగడాలకూ, అసత్యాభాషణలకు కూడా కొదువలేదు. భక్తిపారవశ్యంతో ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఏ దేవుడినయినా కీర్తించనూవచ్చు. దేవుడి సన్నిధి కోసం ప్రార్థంచనూవచ్చు. మనకే అభ్యంతరమూ ఉండదు. వారికాస్వేచ్ఛ వుంది.
కానీ వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవజీవన విధానంపై ఆహార, ఆహార్యపు అలవాట్లపై అహంకారపూరిత, అసత్య ప్రచారాన్ని మాత్రం సహించటం కష్టమైన పని. మొన్నీమధ్య మన ఆధ్యాత్మిక రియలెస్టేట్ గురువు చినజీయరు స్వామిజీ భక్తులనుద్దేశించి చేసిన అపహాస్యపు ప్రసంగం సామాన్య ప్రజానీకానికి ఆగ్రహం తెప్పిస్తున్నది. అతను వ్యంగపు నవ్వులు రువ్వుతూ పందిమాంసము తినేవారు పంది ఆలోచనలు, ప్రవర్తనలు కలిగి వుంటారని, కోడి మాంసం తినేవారు కోడి బుద్ధులు కలిగి, పెంటపై ఏరుకుంటూ బ్రతుకుతారని, మేకమాంసం తినేవారు, గొర్రెల్లా వ్యవహరిస్తారని అనుసరిస్తారని, అలా ఏ జంతువు మాంసం తింటే ఆ రకమైన లక్షణాలను కలిగి వుంటారని చాలా వెగటుగా అసహ్యంగా అహంకారపూరితంగా మాట్లాడారు. ఇది అతని అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని బయటపెట్టింది.
ఈ వ్యాఖ్యానం భారతదేశంలోని అనేక మంది ప్రజల ఆహారాన్ని, మనుషులను చులకన చేయటం హీనపరచటమే. మన దేశమే కాదు. ప్రపంచంలోని ప్రజలందరినీ కించపరచటం. కేవలం ఆకులు అలములు తింటున్న మేకలు మనుషులుగా మారాయా! మరి మనుషుల మాంసం తింటే మనుషులుగా మారతారా ఇదెక్కడి కుతర్కం! వేల యేండ్లుగా ఆదిమానవుడు ఆకులు, గడ్డలతో పాటుగా జంతువులను వేటాడి ఆహారంగా తీసుకుని పరిణామంలో మానవనాగరికతను నిర్మించుకున్నాడు. ఈ దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన ఆహారపు అలవాట్లు వున్నాయి. బెంగాల్లో సముద్ర చేపలను బ్రహ్మణులు లొట్టలేసుకుంటూ తింటారు. ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా ఎద్దు మాంసం ఆహారంగా తీసుకుంటారు. శారిరక శ్రమ చేసే వారందరూ చాలా వరకు మాంసాహారులే. లేకుంటే వారికి శక్తి సరిపోదు. అంతెందుకు మన పురాణాలలో, ఆదిమ అపౌరుషేయాలయిన వేదాల్లోనూ సురాపానము, అంటే సోమరసము, మాంసభక్షణము గురించి ప్రస్తావనలు బోలెడన్ని వున్నాయి. రాముని వనవాసవర్ణనలో లేలేత దూడ మాంసాన్ని భుజించినట్టూ తెలియవస్తుంది. ఆహారాన్ని ఒక మతానికి, కులానికి అంటగట్టి విభజించుకోవటం ఎంత తప్పో, ఆహారాన్ని బట్టి బుద్ధులుంటాయని చెప్పటమూ అంతే తప్పు.
ఆదిమంలో వానరుని నుంచి నరుడుగా పరిణామం చెందే క్రమంలో సమూహాలన్నీ మాంసాహారులుగానే ఎదుగుతూ నేటి మానవ మెదడు విస్తరించింది. జ్ఞానమూ పోగేసుకుంది. ప్రపంచంలో ఇప్పుడు అభివృద్ధయిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానమంతా, ఖగోళశాస్త్రమంతా మాంసము ఆహారముగా గలవారే సృజించినారు. శాఖాహారుల మనుకునే ఈ పూజారివర్గము నిత్యం భుజించే పొంగలి, పరమాన్నాలలో వాడే నేయి జంతు సంబంధిత పదార్థమేనని గ్రహించాలి. శాఖాహారులయిన జంతువులలాగే శాఖాహారులు కూడా వుంటారని భావించవచ్చా! ఇది అత్యంత మూర్ఖమైన ఆలోచన అంతే కాదు మాంసాహారులను అవమానించటము కూడా. మాంసానికి బుద్ధికి ఏ విధమైన సంబంధమూ లేదు. శాస్త్రీయతకు నిలవని దుర్మార్గపు ప్రచారమది. ప్రపంచంలో నాజీహిట్లరు, అత్యధిక ప్రజానీకాన్ని దారుణంగా హతమార్చిన హింసోన్మాది, నియంత శాఖాహారుడే. మరి ఆ బుద్ధికి కారణం శాఖాహారమా!
ఇక ఈ స్వామీజీ ఆశ్రమించే వ్యాపార దిగ్గజాలు, నాయకులు అందరూ మాంసాహారులే. మనల్ని ఏలుతున్న నాయకులు ఇలాంటి మూర్ఖులకు పాదాభివందనాలు చేస్తూ వారి సూచనలు అనుసరిస్తూ చేస్తున్న చర్యలు ఇక్కడి ప్రజలను హీనంగా చూస్తున్నట్టు భావించాల్సి వస్తుంది. అశేష ప్రజల మనోభావాలను దెబ్బతీసేట్టు వ్యవహరించడం, మూఢత్వాన్ని నిస్సిగ్గుగా ప్రచారం చేయటం స్వామీజీలకు తగనిపని. ఇంతటి సంస్కారహీనులు బోధకులుగా వుండటం మన దౌర్భాగ్యం. చదువుకున్న ప్రజలు, మేధావులు, పాలకులు ఈ విధమైన ప్రచారాన్ని ఖండించాలి. అజ్ఞానంతో కూడుకున్న అశాస్త్రీయ విషయాలను, విద్వేషపూరిత వ్యాఖ్యలను తిప్పికొట్టాలి.