Sat 05 Feb 22:06:26.170197 2022
Authorization
బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వాలకు సహజమైన విషయం. బడ్జెట్ విషయాలు ఆర్థిక నిపుణులకే తెలుస్తాయి కానీ సామాన్యులకు ఏమి అర్థమౌతాయి అని కొందరనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రతి కుటుంబానికి, కుటుంబ పెద్దలకు, నిర్వాహకులకు తెలియని విషయమేమీ కాదు. మిగతా లోతుల్లోకి పోకుండా, తేలికగా చెప్పుకోవాలంటే, మన ఆదాయమెంత, వ్యయమెంత, అప్పులెన్ని, ఎలా తీరుస్తాము. ఇంకా వేటి వేటికి ప్రాధాన్యతలిచ్చి, వచ్చిన ఆదాయంలోంచి ఖర్చు చేస్తాం. మొదలైన విషయాల ప్రకటనే బడ్జెట్ అనుకోవచ్చు.
అయితే ప్రకటనలో చెప్పినట్టుగానే కేటాయింపులు, ఖర్చు చేయకపోవటాన్ని మనం చూస్తాం. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలియగానే ఏ ధరలు తగ్గుతాయి. ఏ ఏ ధరలు పెరుగుతాయి అనే విషయాలు ఆసక్తిగా వింటాము. రెండేండ్ల నుంచి కరోనా ఇబ్బందులతో ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి ఆదాయం తగ్గిపోయి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దాదాపు పదికోట్ల మంది ప్రజలు, పరిశ్రమల మూసివేతతో, తదితర కారణాలతో ఉపాధిని కోల్పోయారని తెలుస్తోంది. మరి ఈ బడ్జెట్లో వారి కోసం ఏమైనా ఆలోచించి చేశారా అని ఆరాతీస్తే ఒక్కటీ కనపబడటం లేదు. కానీ వచ్చే సంవత్సరాలలో 65 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెబుతున్నారు. పోయిన ఉద్యోగాలతో బతుకులు బజారున పడ్డవారి గతి ఏం కావాలి!. కొత్తగా ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేసిన దాని పరిస్థితి ఏమిటి! చదువుకున్న యువత ఎదురుచూస్తున్న ఉద్యోగాల సంగతి ఎవరు పట్టించుకుంటారు !
ఇక మనది వ్యవసాయిక దేశం. ఇప్పటి సంక్షోభ పరిస్థితులలో కూడా మన దేశ ఆదాయాన్ని కాపాడింది ఈ రంగమే. అట్లాంటి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతలేమీ బడ్జెట్లో లేవు. సంవత్సరకాలంగా ఉద్యమించిన రైతుల సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యల ప్రస్తావనా లేదు. రైతు కష్టించి పండించే పంటకు మద్దతు ధరను అందిస్తామన్న మాటాలేదు, చేతాలేదు. ఇది ఇలా వుంటే గ్రామీణ ప్రజానీకానికి ఆదాయాన్ని కల్పించే ఉపాధి హామీ పథకాన్నీ నీరు కారుస్తూ దానికి కేటాయింపులు తగ్గించారు. ఇక సామాన్యులు వాడుకునే వస్తువుల ధరలు కానీ పెట్రోలు, డీజిల్ కానీ, వంట గ్యాస్ ధరలు కానీ తగ్గినవి లేవు. వేతన జీవులు ఎదురు చూసిన పన్ను మినహాయింపులు కూడా తగ్గించలేదు. కానీ బడా బడా పెట్టుబడిదారులకు మాత్రం పన్నులలో రాయితీలు కల్పించారు. ఒక వైపు కరోనా కాలంలో ప్రజల ఆదాయాలు పడిపోతే అదానీ, అంబానీల ఆదాయం వందల రెట్లు ఎగబాకింది. అట్లాంటి వాళ్ళకు మేలు తలపెట్టిన బడ్జెట్‌గా నిర్మలా సీతారామన్ బడ్జెట్ చరిత్రకెక్కుతుంది.
లక్షల కోట్ల ఆస్తులు కలిగి, ప్రభుత్వానికి ఆదాయాన్నీ తెచ్చి పెడుతున్న జీవిత బీమా సంస్థను ప్రయివేటు వారికి అమ్మేసేదానికి ప్రకటన చేశారు. జీవిత బీమానే కాదు. ఎయిర్ఇండియా విమాన రంగాన్నీ టాటాకు కట్టబెట్టారు. ఈ దేశంలోని బలహీన వర్గాలయిన దళితులకు, ఆదివాసీలకు మాత్రం ఏరకమైన అభివృద్ధి ప్రణాళికనూ చేపట్టకపోగా, ఆదివాసీల జీవనాధారమైన అడవులను, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు సమాయత్తమవు తున్నారు. ఇది ఎవరికోసం ఏర్పడిన ప్రభుత్వమో, ఏం చేస్తున్నదో ఇంకా ప్రజలు అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకునే ప్రయత్నాలు మొదలవగానే విషయాన్నీ పక్కతోవ పట్టించడం నేటి పాలకుల చాణక్య చక్యం.
ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో శూన్యహస్తాలే. ఒక్కటంటే ఒక్క కేటాయింపు చేయలేదు. రెండు రాష్ట్రాలలోని రైల్వేలైన్ల నిర్మాణానికి గాను తలా ఒక వెయ్యి రూపాయలు కేటాయించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకిచ్చిన ఏ వాగ్దానమూ కనీసంగానైనా చెప్పలేదు. పైగా నదుల అనుసంధానం పేరుతో గోదావరి, కృష్ణా, కావేరీ నదీ జలాలపై రాష్ట్రాలకుండే హక్కులను లాగేసుకునే ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలా బడ్జెట్ చిత్రాలు మనందరికీ ఏ రకమైన ప్రయోజనాన్నీ కలిగించలేదు. కానీ అప్పులు పెంచుతున్న లెక్కలు రేపు మనపై గుదిబండగా మారవచ్చా.