Sat 12 Feb 22:34:01.320337 2022
Authorization
కట్టు బొట్టు, వస్త్రధారణ, ఆహార సంప్రదాయాలు, మన దేశంలో అనేకరకాలుగా వున్నాయి. ముఖ్యంగా ఆహార్యం రాష్ట్రానికోతీరు, ప్రాంతానికోతీరుగా వుంటుంది. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతపు వేశ ధారణతో కనపడే మన ప్రధాని మోడిగారిని చూస్తే ఎంత వైవిధ్య ఆహార్య సంప్రదాయమో మనది అనేది అర్థమవుతుంది. ఇది కొన్ని వందల, వేల సంవత్సరాలుగా సాగుతోంది. వేసుకునే బట్టల తీరు ఒక సమస్య ఎప్పుడూ కాలేదు. అయితే సమాజంలోని పితృస్వామిక వ్యవస్థ స్త్రీలపై కొన్ని ఆంక్షలు, నియమాలు విధిస్తూ వచ్చింది. అవి కొందరు పాటిస్తూ, కొందరు తమ ఇష్టం మేరకు మార్చుకుని వస్తున్నారు. కొందరు మత సంప్రదాయాల ప్రకారమే దుస్తులు ధరిస్తున్నారు. ఇవన్నీ వ్యక్తిగతమైన హక్కులు, ఇప్పుడు ముస్లిం విద్యార్థినులు ధరించే హిజాబ్ వివాదస్పదం చేయటం వెనుక రాజకీయాంశాలు దాగి వున్నాయి.
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక విద్యా సంస్థలో హిజాబ్ ధరించి కళాశాలలోకి రాకూడదని విద్యాసంస్థ అధికారులు చెప్పటం వల్ల సమస్య మొదలయింది. హిజాబ్ అంటే ఆడ పిల్లలు తమ తల వెంట్రుకలు మెడ కనపడకుండా కట్టుకునే వస్త్రం. దీన్ని వారు ఎప్పటి నుంచో కట్టుకు వస్తున్నారు. అయితే ఇప్పుడే ఎందుకు సమస్య చేశారు? ఇక కాషాయమూకలు విద్యార్థులలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాషాయ తలపాగలు, కండువాలు స్లపయిచేసి జై శ్రీరామ్ నినాదాలు ఇప్పించారు. ధరించే దుస్తులకు కూడా మతందురహంకారాన్ని ఆపాధించి వ్యతిరేకతను ప్రోత్సహించడం కండ్ల ముందే జరిగిపోతున్నది.
ముస్లిం కుటుంబాలలో ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుకోవటమే చాలా తక్కువ. అట్లాంటిది వారి దుస్తులను బట్టి విద్యను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధుం. విద్యా సంస్థల యూనిఫారమ్‌తో పాటుగా వాళ్ళు హిజాబ్‌ను ధరించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వున్నది. కాషాయి కండువాలు వేసుకున్న గుంపు ఒంటరిగా విద్యాలయంలోకి వస్తున్న ఒక ముస్లిం విద్యార్థిని చుట్టు చేరి గేలిచేయటం, ఆ అమ్మాయి గత్యంతరంలేని స్థితిలో అల్లాహూ అక్బర్ అని దేవుని పేరును ఉచ్చరించటం, ధైర్యంగా కళాశాలలోకి వెళ్ళడం ప్రతిఘటనా స్ఫూర్తికి నిదర్శనం. ఆ తర్వాత ఆ అమ్మాయి, తనను గేలిచేసి నిలువరించే వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దని, ఎవరినీ అలా ఇక ముందు చేయొద్దని చెప్పటం గమనించాల్సిన విషయం
అంతే కాదు ఈ సందర్భంగా ఒక విద్యాసంస్థలో జాతీయ జెండాను తీసేసి దాని స్థానంలో కాషాయ జెండాను ఎగరేయటం సంఘటన చూస్తున్నప్పుడు, రాజ్యాంగంపైన, జాతీయ జెండాపైన, దేశంపైన, కాషాయ వర్గాలకు ఎంత గౌరవం వున్నదీ అర్థమవుతున్నది. లౌకిక ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి సంఘటనలను చూస్తూ ఊరుకోవడం ప్రభుత్వాలకు తగని పని. మన దేశపు సంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకమయినది.
మన విద్యాలయాల్లో అనేక సమస్యలున్నాయి. ఆడ పిల్లలకు కనీస సౌకర్యాలు లేనివి ఎన్నో. చదువుకున్నాక ఉద్యోగాలు లేవు. ఒక వైపు పరిశ్రమలు మూతపడి ఉపాధి పడిపోయింది. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాలూ కొల్పోతున్నాము. జీవన పరిస్థితులు దుర్భరమవుతున్నాయి. వీటినేవి పరిష్కరించకపోగా కలిసిమెలసి వుండే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టి అలజడి సృష్టించడం సమస్యలను పక్కతోవ పట్టించడమే. మత ఉన్నాదంలోకి ప్రజలను తీసుకుపోతే వాళ్ళ అధికారం పదిలంగా చూసుకోవచ్చన్న ఆలోచన తప్ప హిజాబ్ అనేది ఒక నెపం మాత్రమే.