Sat 05 Mar 22:26:51.221711 2022
Authorization
అసలు ఈ యుద్ధ పిపాస ఎందుకు తలెత్తుతున్నది? ఏమిటి దీనికి మూలం? ఎక్కడుంది దీని అసలు సారం? పెట్టుబడి విస్తరణే యుద్ధకాంక్షను ఉసిగొల్పుతుంది. ఆక్రమణలకు, ఆధిపత్యానికీ వ్యాపారలాభాలే ఛోదకశక్తులు. యుద్ధ పరికరాల, మిస్సయిళ్ళు, క్షిపణుల, రాకెట్ల వ్యాపారులకు యుద్ధాలు అవసరాలు.పెట్టుబడి సామ్రాజ్యవాదానికి, సామ్రాజ్య వాదం యుద్ధాలకు దారి తీస్తుంది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. దాని లాభాల ముందు ప్రాణాలు విలువైనవి కావు. ఏ రకమైన భావోద్వేగానికీ తావు లేని రక్త చరిత పెట్టుబడిది. అది ఆడిస్తున్న మనుషులే దేశాధినేతలు. అది నేర్పుతున్న వ్యూహాలే యుద్ధ తంత్రాలు, నేతలు మారొచ్చు. ఒక నాడు రీగన్ కావచ్చు. బుష్ రావచ్చు. ట్రంపో, బైడెనో, హిట్లరో, ముసోలినో ఎవరైతే ఏమి అందరూ దాని అనుచరులు.
ఏది చదువుతున్నా ఏ పని ముందేసుకున్నా ఆలోచనలన్నీ యుద్ధ బీభత్స దృశ్యాలలోకే వెళుతున్నాయి. ఏదైనా రాద్దామని కూర్చున్నా దుఃఖిత కన్నీటి శబ్ధాలు కలవరపెడుతున్నాయి. నేను పోయిన వారం చెప్పినట్టుగానే యుద్ధం ఇద్దరు శత్రువుల మధ్య కాదు, రెండు దేశాల మధ్య కాదు. ప్రపంచాన్ని చుట్టుకుంటుందని, ప్రజలకంటివున్న తీగంతా కదులుతుందని ఆవేదన చెందినట్టుగానే మన భారతీయ విద్యార్థి కర్ణాటకకు చెందిన ఇరువై రెండేండ్ల నవీన్ శంకరప్పను బలితీసుకుంది. వైద్యవిద్య కోసం ఉక్రేయిన్ వెళ్ళి మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకున్న నవీన్‌ను యుద్ధ క్షిపణి చంపేసింది. డాక్టరై తిరిగి వస్తాడనుకున్న తమ కొడుకు శవంలా మారివస్తే, ఆ తల్లి దండ్రుల శోకాన్ని ఆపగలరా ఎవరైనా!
ఇది నవీన్ మరణం గురించే కాదు. నవీన్ లాంటి ఎందరు యుద్ధంలో సైనికులుగా, దేశాల పౌరులుగా నేల కూలుతున్నారు. వారందరి తల్లిదండ్రుల దుఃఖాన్ని ఒక సారి గుర్తు చేసుకోండి. ఎందరు అమ్మలు కన్నీళ్ళ కెరటాల్లో మునిగి పోతున్నారో కదా! ఎప్పుడయినా, ఎక్కడయినా, అది ఎవరి మధ్యనయినా యుద్ధం ఇచ్చే ఫలం ఇదే. కూలిపోతున్నది రాకెట్లు, విమానాలు, భవనాలు, స్థావరాలే కాదు, నిలువెత్తు మానవత్వం. హాహాకారాలు, ఆర్తనాదాలు, వలసలు, శోకాలు, పరుగెత్తడాలు, గుండె పగిలిపోవడాలు, ఇదే ఖర్కేవ్ నేలపై కదలాడే దృశ్యాలు.
రష్యాను తిడుతూనో, ఉక్రెయిన్ను పాపమంటూనో లేదా పుతిన్‌ను జెలెన్స్కీ చరిత్రల గురించి ఆరా తీస్తూ ఆలోచిస్తూ అనేకానేక ఆవేశపు వ్యాఖ్యానాల్లో మునిగిపోతూవుంటాం. ఇది కొత్తగా జరిగే యుద్ధమూ కాదు. చివరిదీకాదు. అన్యాయంగా, అక్రమంగా జరిగిన దాడులు, హత్యలు ఎన్ని చూడలేదు మనం! రసాయన ఆయుధాలున్నాయని ఇరాక్‌పై నిర్థాక్షిణ్యంగా బాంబులువేసి, సద్ధాంను ఉరివేస్తే చూస్తూనే వున్నాం కదా! అంతకు ముందు విప్లవ యోధుడు చెగువేరాను పట్టుకుని సి.ఐ.ఏ నిలువునా కాల్చేస్తే ఏం మాట్లాడాం కనుక. క్యూబా అధినేత కాస్ట్రోపై కుట్రలు పన్ని వందమార్లు హత్యా ప్రయత్నాలు చేస్తే ఎవరు వేలెత్తి చూపారని. పనామాపై, సిరియాపై, వియత్నాంపై, ఇరాన్‌పై అప్ఘనిస్థాన్‌పై, పాలస్తీనాపై దాడులు చేసిన అమెరికా దుశ్చర్యలను ఆధిపత్య అహంకారాన్ని నిలువరించలేకపోయాం కదా!
అసలు ఈ యుద్ధ పిపాస ఎందుకు తలెత్తుతున్నది? ఏమిటి దీనికి మూలం? ఎక్కడుంది దీని అసలు సారం? పెట్టుబడి విస్తరణే యుద్ధకాంక్షను ఉసిగొల్పుతుంది. ఆక్రమణలకు, ఆధిపత్యానికీ వ్యాపారలాభాలే ఛోదకశక్తులు. యుద్ధ పరికరాల, మిస్సయిళ్ళు, క్షిపణుల, రాకెట్ల వ్యాపారులకు యుద్ధాలు అవసరాలు.పెట్టుబడి సామ్రాజ్యవాదానికి, సామ్రాజ్య వాదం యుద్ధాలకు దారి తీస్తుంది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. దాని లాభాల ముందు ప్రాణాలు విలువైనవి కావు. ఏ రకమైన భావోద్వేగానికీ తావు లేని రక్త చరిత పెట్టుబడిది. అది ఆడిస్తున్న మనుషులే దేశాధినేతలు. అది నేర్పుతున్న వ్యూహాలే యుద్ధ తంత్రాలు, నేతలు మారొచ్చు. ఒక నాడు రీగన్ కావచ్చు. బుష్ రావచ్చు. ట్రంపో, బైడెనో, హిట్లరో, ముసోలినో ఎవరైతే ఏమి అందరూ దాని అనుచరులు.
ఇప్పుడు నవీన్ మరణమూ అందులో భాగమే. వైద్య విద్య మన దేశంలో ఎందుకు దొరకకుండా పోయిందతనికి? అందుబాటులో ఎందుకు లేదు? వేలాది మంది యువకులు ఉక్రెయిన్ వెళ్ళి చదవాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? ఇక్కడ వైద్య విద్యను వ్యాపారం చేశారు పాలకులు. చదవాలనే కోరికున్న వారికి అందుబాటులో లేకుండా పెట్టుబడులతో ప్రవేటుకు అప్పజెప్పారు. ఇక్కడ జన్మభూమిలో ఆ చదువును కొనుక్కోలేక అక్కడికి వెళ్ళేలా చేసిన ప్రభుత్వాల విద్యావ్యాపారీకరణ విధానాలు కారణం కాదా! ఇప్పుడు తల్లడిల్లుతున్న పిల్లల ఆవేదనకు, విద్యలోకి ప్రవేశించిన పెట్టుబడే అసలు దోషి, దానికి కాపలా కాసే నేతలు భవితనెలా రక్షిస్తారు! నిజాలు నిష్టురంగానే వుంటాయి. యోచించాలి.