Sun 13 Mar 00:31:05.991405 2022
Authorization
ఎప్పుడైనా రంగులరాట్నం పై పిల్లల కేరింతలు గమనించావా?
లేదా - వర్షపు నీరు, నేలను తాకి చేసే అల్లరి విన్నావా?
రికామీగా ఎగిరే సీతాకోకల వెనుక సరదాగా పరిగెత్తావా?
రాత్రి చీకటిలోకి జారిపోయే రవి బింబాన్ని
నువ్వు కంటి చూపుతో స్పర్శించావా?
నీవు నెమ్మదిస్తేనే మేలు
అంత వేగంగా నర్తించకు
దాటిపోయేది సమయమే
సంగీతం మాత్రమే సాగిపోయేది!
నువ్వు ప్రతి రోజు ఎదురుపడే ఈగను సునిశితంగా పరిశీలించగలవా?
''ఎలా ఉన్నావు?'' అని నీవడిగిన ప్రశ్నకు సమాధానం వినగలిగావా?
నీ తలనిండా లెక్కకు మించి రోజువారీ పనులు
అలజడి పెడుతుండగా
రోజు గడిచి పోయిందని నువ్వు
పడక మీదనే ప్రశాంతంగా సేద దీరగలవా?
నీవు నెమ్మదిస్తేనే మేలు
అంత వేగంగా నర్తించకు
దాటిపోయేది సమయమే
సంగీతం మాత్రమే సాగిపోయేది!
నీ బిడ్డ నీతో ఎప్పుడైనా చెప్పాడా ''ఈ పని రేపు చేద్దాం?'' అని ..
నీ తొందరలో
అతని అవసరాలను గమనించలేక పోతావు?
మానవీయ స్పర్శను కోల్పోయిన క్షణాన,
ఈ గాఢమైన స్నేహం మరణించనీ
ఎందుకంటే, ఆర్తిగా 'హారు' అని
పిలిచి పలకరించే సమయమే నీకు లేనపుడు....
నీవు నెమ్మదిస్తేనే మేలు అంత వేగంగా నర్తించకు
దాటిపోయేది సమయమే
సంగీతం మాత్రమే సాగిపోయేది!
ఎక్కడికో చేరాలనే తపనలో వేగిరపడతావు
ఆ గమ్యాన్ని చేరేలోగా సగం సరదాలను కోల్పోతావు
రోజంతా హడావుడి, ఆందోళనలో మునిగివుంటే
తెరవబడని బహుమానాల పేటికలా
జీవితాన్ని దూరంగా విసిరి వేసినట్లే !
జీవితం పరుగు పందెం కాదు
తీరికగా ఆస్వాదించు-
పాట ముగిసేలోగా సంగీతాన్ని ఆనందించు..
('Slow Dance' అనే ఆంగ్ల కవితకు అనువాదం. ఈ కవితను క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక టీనేజర్ యువతి రాసినది. తన కవితను ఎందరు చదివి స్పందించగలరో తెలుసుకోవాలన్న తపన ఆమెలో వుంది. న్యూయార్క్ ఆస్పత్రిలో కొన్ని నెలల వ్యవదితొ మత్యువుకు చేరువలో నున్న ఆ యువతి చివరి కోరిక మేరకు ఒక మెడికల్ డాక్టర్ సోషల్ మీడియాలో ఈ కవితను పెట్టారు. తన కవిత ద్వారా అందరికి తాను చెప్పదలుచుకున్న ఉద్దేశమేమిటంటే, దురదష్టవ శాత్తు ఎలాగూ తన జీవితం ఎలాంటి అనుభవాలు లేకుండా, చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా అర్ధాంతరంగా ముగిసిపోతున్నది. ఈ వాస్తవాన్ని గుర్తించిన ఆ యువతి, అంది వచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి, ఆనందించమని అందరినీ కోరుతున్నది.)
- రూప్‌కుమార్ డబ్బీకార్, 9908840186