Sat 19 Mar 23:02:05.346963 2022
Authorization
కవిత్వానికి ఒక రోజు పెట్టుకుని, కవిత్వాన్ని పఠించి, ఆస్వాదించి ఆనందించడం ప్రపంచమంతా జరగాలని కోరుకోవడమే ఓ పెద్ద ముందడుగు. నిత్య కవన సృజనకారులు ఎలాగూ ఉండనే వున్నారు. ప్రేమికుల రోజు, మహిళల రోజు, కార్మికుల రోజు, తల్లుల రోజు, తండ్రుల రోజు, స్నేహితుల రోజులాగానే, భాషా దినోత్సవాల వలనే కవితా దినోత్సవం మార్చి 21న ప్రపంచమంతా జరుపుకుంటారు. 1999 లో పారిస్లో సమావేశమైన యునెస్కో జనరల్ బాడీ ఈ నిర్ణయాన్ని చేసింది. అప్పటి నుండి ప్రపంచంలో కవితా దినోత్సవం జరుపుకుంటున్నారు.
కవితకు మానవ జీవన వికాసమంత చరిత్ర వుంది. మనిషి తన జీవన ప్రయాణంలో శ్రమ చేస్తూ, తన ఆకలిని, దాహాన్ని తీర్చుకుంటాడు. అది సమూహంగానే జరుగుతుంది. అందులోంచే భాషను సృష్టించుకున్నాడు. భావాలను ఏర్పరచుకున్నాడు. పని అలసటను పోగొట్టుకునేందుకు పాటను పాడుకున్నాడు. పాట ఆదిలో సమూహికతలోంచే పురుడు పోసుకుంది. ఆదిమ కవిత్వం పాటనే. కవిత్వమంటే అల్లిక. ఏమిటి అల్లిక భావాల అల్లిక. కేవలం భావాలే కాదు, ఉద్వేగాలతో కూడిన భావాల అల్లిక. అల్లికలో లయ వుంటుంది. లయ జీవన విధానంలోంచి వస్తుంది. బాధను, దు:ఖాన్ని, వేదనను, ఆవేశాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను, కోపాన్ని క్లుప్తంగా గుండెకు హత్తుకునేట్లు అభివ్యక్తం చేయటమే కవిత్వం. మన ఆలోచనల్ని, భావాలను, అభిప్రాయాలను శక్తివంతంగా శబ్దించటమే కవిత్వం. భావాలు, భావనలు, కేవలం మనుషులలో మాత్రమే వుంటాయి. జీవ జాతిలో ఒక్క మనిషికి మాత్రమే వున్న లక్షణం అది. మనిషి చేసే ప్రతి పనిలో కళాత్మకత వుంటుంది. మీరు చూడండి పొలాల్లో నాట్లేస్తున్న కూలీలు ఎంత వరుసలో అవి వేస్తూపోతారు. కుండను తయారు చేసే కుమ్మరి తన చేతుల్లో పాత్రకు రూపం పోస్తాడు. బుట్టల అల్లకం, దుక్కిదున్నడం, చక్రం తిప్పటం, సాన పట్టటం అన్నీ నైపుణ్యమైన పనులే. బొమ్మలు చేసేవారి కళా దృష్టి, ఇండ్లు కట్టేవారి నైపుణ్యం, శిల్పకారుల ఊహ, కల్పన, ఎంత అందంగా వుంటుంది! కవిత్వం కూడా అంతే. అది కూడా ఒక బొమ్మను తయారు చేయడం లాంటిదే. అయితే కవిత్వంలో భావోద్వేగం వుంటుంది. ఆశలకు, ఆశయాలకు వేదిక కవిత్వం.
కవిత్వం, మనిషిని మనిషిని కలిపి కుట్టేది. మరో మనిషి లేకుంటే కవిత్వానికి విలువేముంది! మనిషిలో మానవ హృదయాన్ని నిర్మించడమే కవిత్వ లక్ష్యం. కవిత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించుకుని, 'మూగవానికి మాటలు నేర్పుతుంది. గొంతులేని వారికి గొంతునిస్తుంది. మనిషి సారమేమిటో పట్టి ఇస్తుంది' అంటారు కవులు. ఉద్విగమైన మనసు పలికే శబ్దారావమే కవిత్వంగా మన హృదయాన్ని కదిలిస్తుంది. పాట, పద్యం, నేటి వచన కవిత ఏదైనా మన మనస్సుపై ప్రభావాన్ని చూపేదే. అందుకే ఆ కవితాత్మను అందుకునేందుకు మహామహులెందరో ''కవితా! ఓ కవితా! నా యువకాశాల నవపేశల సుమగీతావరణంలో, నిను నేనొక అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిముషాలందు, నిషాలందు.... నీ చిర దీక్షా శిక్షా తపస్సమీక్షణలో''.... అంటూ కవిత్వం కోసం నిత్యం తపించారు.
కవితా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో కనుమరుగైపోతున్న భాషలను బ్రతికించుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలనూ చర్చించాల్సి వుంది. ప్రపంచీకరణ ప్రభావంతో స్థానిక భాషల విధ్వంసమూ జరుగుతోంది. వాటిని కాపాడుకుని, సాంస్కృతిక వైవిధ్యాన్ని నిలుపుకున్ననాడే మానవ వికాసం సాధ్యమవుతుంది. ప్రపంచంలోని ప్రతి సమూహపు హృదయస్పందన మనకందుతుంది. కవితా కళాత్మకత విరాజిల్లుతుంది.