Sun 03 Apr 05:14:47.403712 2022
Authorization
ఎన్నికల రుతువు ముగియగానే ఆరంభమయ్యే రుతువు ధరల రుతువే. ఆకాశంలోని చుక్కలను కూడా దాటిపోతున్న ధరలు. వీటికి అంతం లేదు. అదుపూ లేదు. మొన్నటి వరకూ అంటే, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నపుడు, ఒక మూడు నెలల కాలంలో దేని ధరా పెరగనే లేదు. ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఈ పెరగటం మొదలయింది. ఇక సామాన్యులు ''ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న, ధరల మీద ధరలు పెరిగె నాగులో నాగన్న, ధరల మీద మన్ను బొయ్య నాగులో నాగన్న'' అంటూ ఎన్నో యేండ్లుగా పాడుకొంటున్న పాటనే పాడుకోవాల్సి వస్తోంది.
ధరల పెరుగుదల గురించి రాజకీయులు మాట్లాడే మాటలు అటుంచి, సామాన్యుల బాధలను గమనించాల్సిన అవసరం వుంది. ఈ రోజు ప్రతిపక్షంలో వున్నవాళ్లు ధర్నాలు చేస్తూ ధరలపై గొడవ చేయొచ్చుగాక, వాళ్లు అధికారంలో వున్నపుడు ఇలానే ధరలను పెంచుతూ పోయారనేది గమనించాలి. ఇప్పుడు అధికారంలో వున్న వాళ్లు ఆనాడు పది, పదిహేను రూపాయలు గ్యాసు ధర పెరిగినపుడు పెద్ద పోరాటానికి పిలుపునిచ్చారు. ఇపుడు మంత్రులుగా వున్న మహిళలు రోడ్డెక్కి ప్రజల కష్టాల గురించి తెగ బాధ పడిపోయిన వారే. మరి ఇపుడు వాళ్ళకు ఏ ప్రజలూ గుర్తుకురావటం లేదు. అసలు ధరలపై వాళ్లు మాట్లాడటమే లేదు.
గ్యాసు ధర వేయి దాటి పోయింది. పెట్రోలు, డీజిలు వంద దాటి పైకి ఎగబాకుతూనే వుంది. ఈ ధరల పెరుగుదల వీటికి మాత్రమే పరిమితమయి వుండదు. పెట్రోలు, డీజిలు రవాణా రంగ ఖర్చులను పెంచేస్తాయి. దీంతో అన్ని సరుకులు, కూరగాయలు, రవాణా మొత్తం చెట్టెక్కి కూర్చుంటాయి. అంతేకాదు ఇప్పుడు రైతులు వాడే ఎరువులు, పురుగు మందులు విపరీతంగా పెంచేశారు. అందువల్ల రైతు పెట్టాల్సిన పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అప్పులలో రైతు కూరుకుపోయే పరిస్థితి వస్తోంది. ఏదో ఆర్నేల్లకో, సంవత్సరానికో ఒక సారి పెరిగి ఊరుకుంటాయి అని కాదు, ప్రతి రోజూ పెరుగుతూ పోవటం ఇప్పటి ధరల నైజం. ధరలిప్పుడు ప్రభుత్వాల చేతిలో ఏమీ లేవు అని కొందరు వాదిస్తుంటారు. ముఖ్యంగా పెట్రోలు, డీజిలు లాంటి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుంటే వాటికనుగుణంగా ఇక్కడా పెరుగుతాయి అంటారు. నిజమే మరి అక్కడ తగ్గినపుడు, ఇక్కడ తగ్గాయా మరి! పోనీ ఎన్నికలపుడు ఎందుకు పెరగలేదు! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వారి ఆదాయాన్ని పెంచుకోవటానికి పన్నులు వేసి ప్రజల పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎవరూ దేనికి మినహాయింపు కాదు. ఒక్క కేరళ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం, ప్రజలు భరించలేరని చమురు ధరలు తగ్గించి, అంటే ప్రభుత్వ పన్ను తగ్గించి, తన ఔదార్యాన్ని చాటుకున్నది.
ఇక ఇప్పుడు అనారోగ్యాలతో కునారిల్లే పేదలు, సామాన్యులు వాడే ఔషధాల ధరలనూ పెంచేశారు. జ్వరానికి వేసుకునే పారాసెటమోల్ గోలీ బిళ్లల ధరలనూ పెంచి, ప్రయివేటు ఫార్మా కంపెనీల లాభాలు పెంచేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ సామాన్యులు అనారోగ్యం పాలయితే వారు పడే కష్టాల గురించి ఆలోచించలేకపోయారు. విద్యను ప్రయివేటు పరం చేసి పేదలకు దూరం చేస్తున్నారు. వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్తు ఛార్జీలు పెంచింది. వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపింది. ఇది దారుణమైన విషయం.
పోనీ ధరలు పెరుగుతున్న సందర్భంలో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు ఏమైనా పెరుగుతున్నాయా అంటే అదేమీ లేదు. కనీస వేతనాలు కూడా అందని శ్రామికులు దేశంలో లక్షలాది మంది వున్నారు. ఒక వైపు పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలు కోల్పోయి ఆదాయాలు లేని సైన్యం పెరుగుతోంది. ఇంకోవైపు ఈ ధరాఘాతాలు. మధ్య తరగతి ప్రజలు ఆదాయాలు కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. 'మేం ధరలు పెంచుతూనే వుంటాము. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటూ కాలం గడపాలని' అధినాయకులు సుద్ధులు చెబుతున్నారు. వ్యాపారుల లాభాలకు కాపుకాసే నాయకులు ఉన్నంత కాలం మోసం జరుగుతూనే వుంటుంది. ఓటు వేసే సమయాన మనం సరయిన నిర్ణయం తీసుకుని, దాన్ని ఆయుధం చేసుకుంటేనే జనం బాధలు వాళ్ళకు తెలిసొస్తాయి.