Sat 09 Apr 22:56:00.455627 2022
Authorization
చదువెందుకో విజ్ఞానాన్ని పెంపొందించడం లేదు. శాస్త్రీయ ఆలోచననూ కలిగించడం లేదు. కనీస విచక్షణాజ్ఞానాన్నీ ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు, పెద్ద పెద్ద పదవుల్లో వున్న వాళ్ల సంగతే ఇలా ఉంటే, ఇక సామాన్యుల సంగతేమిటి! విశ్వాసాలు, నమ్మకాలు మొదలైనవి ఎప్పటినుండో కొనసాగుతూ వున్నా, మరీ మూఢమైన విశ్వాసాల పెరుగుదల నేడు కనబడుతున్నది. ఇది చదువుకున్న వాళ్లలో ఎక్కువవుతున్నది. సైన్సును అధ్యయనం చేసిన వారు కూడా, చదువుకూ, విశ్వాసానికి సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.
దీనికి కారణం చదువుకూ, ఆచరణలో విజ్ఞానదాయిక ఆలోచనకూ సంబంధం లేకుండా పోయింది. అంటే చదువు చదువు కోసమే అన్నట్లుగా వున్నది. జ్ఞానాన్ని పెంచి, కారణాలను, హేతువును తెలుసుకునే ఒక సాధనంగా చదువు నిర్వహించాల్సిన పాత్ర నుండి అది జరిగిపోయింది. కేవలం మార్కులకు, ర్యాంకులకు, ఉద్యోగాల కోసం మాత్రమే మిగిలిపోయింది. చదువు మన నడవడికను తీర్చలేకపోతోంది. వాస్తవికతలపై ఆధారపడి చేసే ఆలోచననూ ఇవ్వలేకపోతోంది. ఈ విద్యా విధానపు గతి ఆ విధంగా సాగుతోంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, ఫలితాలు వాటి కారణాలు ఏమిటో తెలుసుకునే మేధస్సునూ విద్య ఇవ్వలేకపోవటం నేటి విషాదం. దీనికి పరాకాష్ట ఏమిటంటే, సైన్స్ కాంగ్రెస్లో దేశ ప్రధాని మాట్లాడుతూ... భారతదేశంలో ప్రాచీన కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉందని గణపతి దేవుని తలకాయ రుజువు చేస్తుందని చెప్పటం. దేవుడు, మతం అనే విశ్వాసాలు మూఢత్వంలోకి, అజ్ఞానంలోకి, అహేతుకతలోకి ఎట్లా తీసుకుపోతుందో మనం నిత్యం చూస్తూనే వున్నాము. సైన్సు అంటేనే పరిశీలన, ప్రయోగము, ఫలితాల మీద ఆధారపడి విజ్ఞానంగా రూపుదిద్దుకుంటుంది.
అలా శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేస్తూ ప్రయోగాలు చేస్తూ అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు సాధిస్తున్న శాస్త్రవేత్తలు సైతం రాకెట్ ప్రయోగాల వేళ ఉపగ్రహాల ప్రయోగాల వేళ, తిరుపతి దేవుని వద్ద పూజలు నిర్వహించడం మహా మూఢత్వానికి నిదర్శనం. ఇది పరిపాలకుల, నాయకుల విశ్వాసాల, నమ్మకాలలోంచి మరింత నేడు పెరుగుతోంది. మన రాజ్యాంగం ప్రకారం పరిపాలించవలసిన నాయకులు, రాజ్యాంగంలోని శాస్త్రీయ ఆలోచనను, చైతన్యాన్ని కలిగి వుండేలా ప్రతి పౌరుడు వ్యవహరించాలన్న స్ఫూర్తికి భిన్నంగా మతం ఆధారంగా, మత విశ్వాసాల ఆధారంగా క్రతువులు నిర్వహించడం మనం చూస్తున్నాము. మతం, విశ్వాసం వ్యక్తిగతం. కానీ మూఢత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అందరి మీదా వుంది.
ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర వైద్యాధికారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మూఢమైన క్షుద్ర పూజలో పాల్గొన్నారనే వార్త పదుగురి దృష్టికీ వచ్చింది. అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధి తానే దేవతనని, పూజలు నిర్వహించడం, ప్రజలు పొలోమని చేరటం సాధారణంగానే జరిగిపోయింది. కానీ వైద్య అధికారిగా వున్నవారు సాష్టాంగపడి ఆ దేవతను దర్శించుకోవటం, కరోనా వైరస్ ఇక ప్రబలకుండా చూడమని కోరటం మరీ విడ్డూరంగా వుంది. చప్పట్లు కొట్టమని, దీపాలు పెట్టమని చెప్పిన అధినాయకులున్న దేశంలో ఇదేమీ పెద్ద విషయం కాదనుకోండి. నాయకులకు చదువు లేదనుకోవచ్చు. కానీ కరోనా వాక్సిన్, జాగ్రత్తలతో, వైద్యంతోనే ఎదుర్కోగలమని చెప్పే వైద్యాధికారికి ఇదేమీ ఆలోచన! ఇదేమీ ఆచరణ!
విశ్వాసాలు, భక్తి మొదలైనవేవీ ఎదురౌతున్న సవాళ్ళను, తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించలేక పోవటంతో మరింత మూఢత్వంలోకి కొట్టుకుపోతున్నామా! అని అనిపిస్తోంది. హేతు దృష్టి, ప్రశ్నించడం సన్నగిల్లుతున్నదా! అయితే ఆగిపోతాం.