నేను మనిషి దగ్గర నిలబడి మాట్లాడతాను మతం దగ్గరో కులం దగ్గరో ఒకానొక ప్రాంతం దగ్గరో నిలబడి మాట్లాడను నేను మనిషి దగ్గరే నిలబడి మాట్లాడతాను
అనేకానేక భావోద్వేగాల సంచయమైన రక్త మాంసాలున్న మనిషి నా చిరునామా ఆలోచనల పొదియై ఆత్మీయతల పొదరిల్లై సంచరించే మనిషి నా ఉనికి నేను మనిషి కేంద్రంగానే పరిభ్రమిస్తాను
మనిషి ఏ మతమైనా ఏ కులమైనా, ఏ జాతైనా మనిషెక్కడివాడైనా మంచితో నిండి వున్న మంచు పాత్రలాంటి మనిషైతే చాలు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాను గుండెల్లో గూడు కట్టుకుని ప్రేమిస్తాను
నేను మనిషి దగ్గరే నిలబడి మనసారా గొంతు విప్పుతాను
అనేక సంక్షోభాలతో కంపు కొడుతున్న సమాజం అనేక దుఃఖాలతో కరిగిపోతున్న ప్రపంచం అనేక అస్తిత్వాలు దేని గొంతు అది వినిపిస్తున్న కాలరుతువు మనిషి అస్తిత్వమే మహా సందర్భంగా నిలబడి మాట్లాడతాను నాకే వాసనలూ గిట్టవు మానవ వాదాన్ని గుబాళించే మంచి గంధంలాంటి మహా మనిషి దగ్గరే నిలబడి మాట్లాడతాను మానవ జీవన నాగరికతలో మహౌన్నత మూర్తియై భాసిల్లుతున్న మనిషి దగ్గరే నిలబడి నేను మనిషి కేంద్రంగానే మాట్లాడతాను