Sat 16 Apr 23:17:01.354061 2022
Authorization
కాలం వెనుతిరుగుతోందా! మన కాలు వెనక్కి మళ్ళిందా? ఏదో వెనక్కి నడుస్తున్నట్టుగా తోస్తున్నది. చీకటిలోకో, చిద్రగుహల్లోకో అడుగులేస్తున్నట్లు.... ఆలోచనలన్నీ శిథిల చరితల నీడన తచ్చాడుతున్నట్లు, వెనక్కి వెనక్కి మళ్లుతున్నట్లు కళ్ళ ముందు దృశ్యాలు కదలాడుతున్నాయి. వినవస్తున్న వార్తలు నివ్వెర గొలుపుతున్నాయి. అడ్డుగోడలు, ముళ్లకంచెలు, అనాగరిక అంధయుగాలు ఎన్నో దాటుకుంటూ ఇంత దూరం నడిచొచ్చాక, రాచరికాలు, బానిసత్వాలు, లొంగుబాట్లు గతించాక నాగరిక ప్రజాస్వామిక, సమతావరణంలోకి, వెలుగులోకి అడుగులు వేసామనుకుంటుండగా, ఏమిటిది? సతీసహగమనాలు, కన్యాశుల్కాలు, వరవిక్రయాలు అన్నీ వందలేండ్ల కిందనే నేరాలని భావించాక, మళ్లీ ఇప్పుడు ఈ ప్రచారమేమిటి! ఈ పాఠాలేమిటి!
మహారాష్ట్రలో నర్సింగ్ కోర్సు చదివే విద్యార్థుల సోషియాలజీ టెక్ట్స్బుక్లో ''కట్నం వల్ల కలిగే లాభాలు'' అని ఒక పాఠాన్ని పెట్టారు. అందులో భారీగా కట్నాలు ఇవ్వడం వల్ల, అందంగా లేని అమ్మాయిలకు కూడా మంచి వరునితో పెళ్లి అవుతుంది. కట్నాలు ఇవ్వలేని తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బాగా చదివించుతారు అని ఈ పాఠంలో వివరించడం ఎంత సిగ్గు చేటైన విషయం. ఈ పాఠాన్ని ఒక రాజ్యసభ సభ్యురాలు కేంద్ర విద్యామంత్రి దృష్టికి తీసుకువెళ్లి, దీన్ని తొలగించాలని కోరారు. కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరమని చట్టాలు చెబుతున్నా, దానికి విరుద్ధంగా పాఠ్యాంశాలలో, చట్టం, రాజ్యాంగాలకు వ్యతిరేకంగా సిలబస్‌ను ఏర్పాటు చేయటం నేరం కదా! ఏ స్థాయికి మన విద్యారంగాన్ని తీసుకువస్తున్నారో ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఇదేదో అనుకోకుండా చేరిన అంశంగా భావించలేము.
స్త్రీల పట్ల, కుటుంబ వ్యవహారాల పట్ల మన పాలకుల ఆలోచనలు అత్యంత దారుణంగా వుంటున్నాయన్నది కనపడుతున్న వాస్తవం. స్త్రీలు వంటింట్లోనే గడపాలని, పిల్లలు కనటానికి, వారిని సాకడానికి మాత్రమే పని చేయాలని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఆడపిల్లల మీద అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, వారు ధరిస్తున్న దుస్తులు కారణమని సెలవిస్తున్నారు. ఆడపిల్లలు రాత్రిళ్లు బయటకు రావొద్దని, తిరగొద్దని సుద్ధులు చెబుతున్నారు తప్ప జరిగే ఘోరాలకు, నేరాలకు అసలు కారణాలను, కారకులను వొదిలేసి మాట్లాడుతున్నారు. అంటే ఆడపిల్లలపై వారికున్న మనువాద భావజాలమే కారణం. స్త్రీ బలహీనురాలని, పురుషుడి యాజమాన్యంలో ఉండాలన్నది వారి ఆలోచనా ధోరణి. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు గ్రామాలలో ఖాప్ పంచాయితీలు పెడుతూ మహిళలను పీడనకు, అన్యాయానికి గురిచేస్తున్నారు. రెండో వైపు ఇలాంటి తిరోగమన భావాలను ప్రచారం చేస్తున్నారు. కుల, మత మూఢ విశ్వాసాల ఆధారంగా సమాజాన్ని చీకటికోణాల్లోకి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి ఇలాంటి పాఠ్యాంశాలు రేపు మన పిల్లల పాఠాల్లోకి రావొచ్చు. వాళ్లు సైద్ధాంతికంగానే తిరోగమన వాదులు, ప్రగతి వ్యతిరేకులు. కాలం వెనక్కి నడవదు. తప్పక ముందుకే వెళుతుంది. స్త్రీ అబల కాదు, సబల అని నేడు ప్రపంచాన రుజువు చేసుకున్నది. అందం అంటే మానసికమైన ఉన్నతస్థితికి చేరుకోవడం తప్ప, రూపురేఖలను తీర్చుకోవటం కాదు అని, వ్యాపార వస్తు వినియోగంలో కొట్టుకుపోవడం కాదని తెలుసుకోగలుగుతున్నారు స్త్రీలు. అందుకు చైతన్యాన్ని అందిస్తున్న ఉద్యమాలూ వున్నాయి. స్త్రీ అసమానతకు దోహదం చేసే చర్యలను, ఆలోచనలను తిప్పి కొట్టాలి. అలాంటి ప్రయత్నాలను ముందుకు తెస్తున్న వారి పట్ల, పాలకుల పట్ల అప్రమత్తంగా వుండి ఎదుర్కోవాలి.