Sat 30 Apr 23:09:41.006743 2022
Authorization
అనేక భాషలు, తెగలు, మతాలు, సమూహాలు, సంస్కృతుల సహజీవన మణిహారం భారతం. తరాలుగా సాగిపోతున్న సహన జీవనంలో, ఇప్పుడు అనేక వైశమ్యాలు, విద్వేషాలు గొచ్చగొట్టబడుతున్నాయి. అందులో భాష కూడా చేరింది. దేశంలో జరిగే వ్యవహారాలు, సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ కూడా హిందీ భాషలోనే జరగాలని, ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని ముందుకు తేవాలని పార్లమెంటరీ భాషా కమిటీ సమావేశంలో అమిత్‌షా గారు సెలవిచ్చారు. అప్పటి నుండి హిందీ భాషను అందరిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ప్రాంతీయ భాష మాట్లాడే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండీ ఈ మతతత్వ వాదులు దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాలనన్నీ చెరిపేసే పనికి పూనుకుంటున్నారు. ఒక కేంద్రీకృత వ్యవస్తను, అధికారాన్ని ఏర్పాటు చేయటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పటి నుండో ప్రత్యేక హక్కులు కలిగిన కాశ్మీరులో 370 ఆర్టికల్‌ను రద్దు చేసారు. ఒకే రకమైన పన్నులు కోసం జీఎస్టీ తెచ్చారు. వ్యవసాయం, విద్యుత్తు, విద్య మొదలైన వాటినీ తన ఆదీనంలోకి తెచ్చుకుంటున్నది. ఇదంతా స్థానికతను, ప్రత్యేకతలను నిరాకరించడమే. అందులో భాగంగానే ఒకే రకమైన మతమూ, అభిప్రాయము ఈ దేశంలో ఉండాలని, ఇతర మతాల పైన, వారి సంస్కృతులపైన దాడికి కూడా దిగుతున్నారు. ఇప్పుడు భాషను కూడా రుద్దే చర్యకు పూనుకుంటున్నారు.
మనదేశంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన భాషలే 22 వున్నవి. ఇంకా అనేక భాషలు మాట్లాడే ప్రజలూ వున్నారు. లిపి లేని భాషలూ వున్నాయి. భాషలతో పాటుగా సంప్రదాయాలూ విభిన్నంగా వుంటాయి. ఒక భాషలో, దాన్ని మాట్లాడే ప్రజల ఆత్మ వుంటుంది. జీవనలయ ప్రతిబింబమవుతుంది. అది కేవలం మాధ్యమమే కాదు జీవితము కూడా. అందుకే ఒక మానవ సమూహపు హృదయాన్ని తెలుసుకోవాలంటే వాళ్ల మాతృ భాషలోనే అది సాధ్యమవుతుంది. తమ అభిప్రాయాలను ఆలోచనలను వ్యక్తం చేయటానికి తమ భాషనే ఉపయోగించడమనేది ప్రజాస్వామిక హక్కు. దాన్ని నిరాకరించడానికి లేదు. ఇంకో భాషను తీసుకువచ్చి రుద్దటానికీ లేదు. ఇప్పుడయితే ప్రపంచీకరణ తర్వాత ఆంగ్లమే ప్రపంచ మాధ్యమంగా తయారయింది. బతుకుదెరువు భాషగా కూడా దాన్ని ప్రాధాన్యత పెరిగింది.
దక్షిణాదిలో ద్రావిడ భాషలు చాలా ప్రాచీనమైనవి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో ఎంతో సాహిత్యం వచ్చింది. వైజ్ఞానిక పదకోశమూ ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రాంతాలలో హిందీ తప్పనిసరి అనటం సరయిన విధానం కాదు. వాస్తవంగా ఉత్తర భారతంలో కూడా అనేక ప్రాంతీయ భాషలున్నవి. గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, రాజస్థానీ, మణిపురి, అస్సామీ, కాశ్మీరీ, బెంగాలీ ఇలా ఎన్నో వున్నాయి. ఎప్పుడు కూడా ఒక భాష ఇంకో భాషకు పోటీకాదు. భాషల మధ్య ఆదానప్రదానాలుంటాయి. కానీ రాజకీయాల్లోనే ద్వేషాలుంటాయి. ద్వేషాలతో ఏర్పడే ప్రయోజనాలుంటాయి. ఆధిపత్యం అధికారం, పెత్తనం ఉంటుంది. దేశాన్ని ఏకరూపతలోకి తీసుకువచ్చి మత రాజ్యంగా మార్చాలని చూస్తున్న శక్తులు, నియంతృత్వ విధానాలును ముందుకు తెస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమయినది. ఇప్పటివరకు కొనసాగిన సామరస్యతను భగం చేస్తుంది. అంతేకాక ఏకరూపమైన సార్వత్రిక దోపిడికి ద్వారాలు తెరుస్తారు.
భాషలేవయినా మధురంగానే వుంటాయి. భాషల్ని నేర్చుకోవడం తప్పుకాదు. ఏ భాషా ఎక్కువా కాదు. ఏదీ తక్కువా కాదు. ఒక భాషకు ప్రతిగా, ఎదురుగా ఇంకో భాషను తీసుకొచ్చి పెట్టడం సరికాదు. ప్రజాస్వామిక విధానంలో ప్రజల భాషా హక్కును గౌరవించాలి. ఇన్ని భాషలు జాతీయ భాషలుగా వుండేందుకు అర్హత కలిగున్నందుకు గర్వపడాలి. భాషాపరంగా ద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల జాగ్రత్త వహించాలి. భాషలు మనుషులను విభజించేందుకు కాదు. కలిపేందుకు అనే సందేశాన్ని ఇవ్వాలి. హిందీని రుద్దటాన్ని వ్యతిరేకించాలి.