Sun 01 May 23:17:16.027926 2022
Authorization
బయటే కాదు
నీ లోపల కూడా నువ్వు ఒక తోటను పెంచుకోవచ్చు
అందుకు లోపల కొంచెం సారవంతమైన జాగా వుండాలి
లేదా నువ్వే ఏర్పాటు చేసుకోవాలి
చేతులకు మట్టి పని తెలియాలి లేదా నేర్చుకోవాలి
తెలిసీ లేదా నేర్చుకుని బయట పని చేస్తున్నపుడే
నీ లోపలి జాగాలో మట్టి కూడా చదునవుతుంది
మట్టి అసలే పట్టని వాళ్ళకు బహుశా లోపల జాగా
సంగతి కూడా తెలియక పోవచ్చు
బయట మట్టిని నువ్వో వానో తడిపే వేళల్లో నీ కళ్ళల్లోకి
రహస్యంగా చెమ్మ చేరుతుంది చెలిమిలా!
అపుడే నీ లోపలి మట్టి కూడా తడవుతుంది
అపుడే నీ వొంటి మొత్తానికి ఎంతో కొంత మెత్తదనం అబ్బుతుంది
అపుడే లోపల ఒక తోట రాబోతుందని
నీ మనసుకు ముందస్తు సమాచారం అందుతుంది
అందిన క్షణమే అది స్వాగత రంగవల్లులల్లుతుంది
బయట నువ్వు పూల మొక్కల సరసన కూర్చుని
వాటితో కళ్ళతో సంభాషించేటప్పుడు
అవి నిన్ను కరుణించే సంగతిని నువ్వు గుర్తించక పోవచ్చు
కరుణతో అవి నీ లోపలికి కొన్ని లేలేత కొమ్మల్ని
జారవిడుస్తాయి ఒడుపుగా
సరిగ్గా నీ లోపలి మట్టిలో నాటుకునేట్టుగా!
బయట గాలికి వొయ్యారంగా కదిలే రెల్లు సొగసును
నువ్వు చూసే తన్మయ ఘడియల్లో
నీ లోపల కూడా శాఖలూ ఆకులూ వూగుతూ చేసే
ఒక వింత సవ్వడిని నువ్వు వినక పోవచ్చు
నలుగురితో కూర్చుని నవ్వే వేళలోనో
నలుగురి కోసం నువ్వు నడిచే వేళలోనో
నాలుగు శుభాలోచనలు నీలో వెలిగే వేళలోనో
నీ లోపల కొమ్మలు విస్తరిస్తూ పోయే సజనాద్భుతాన్ని
నువ్వు వెంటనే పట్టుకోలేక పోవచ్చు
నువ్వు వాకిట్లోనో బాటల పక్కనో మళ్ల లోనో
మొక్కల్ని ఏకాగ్ర ధ్యాసతో నాటుతున్నపుడో
ఏ లేవలేని చేతులకో ఆసరా అవుతున్నపుడో
శిశువుల రేపటి కోసం ఒక పూల దారిని వేస్తున్నపుడో
నీ లోపల లతలు జనించి మెల్లగా అల్లుకుపోయే సంగతి
నువ్వు గబుక్కున గమనించకపోవచ్చు
నువ్వు పని గట్టుకుని ఏ వాగు దగ్గరికో,నది సన్నిధికో వెళ్లి
దాని దయాపూరిత దర్పణంలో చూసుకుంటూ
నిన్ను శుద్ధి చేసుకుంటూ నీ దోసిలిలోకి నిర్మల జలాన్ని తీసుకుని
గొంతులోకి వొంపుకుంటున్నపుడు
ఒక నీటి పాయ చటుక్కున నీ లోపలి తోటలోకి
మళ్ళే లలిత దశ్యాన్ని
నువ్వు వెంటనే దర్శించలేక పోవచ్చు
ఏ విపినానికో వెళ్ళినపుడు వెదురు వినిపించే అనాది గానం
నీ చెవిన పడుతుందనే విషయం నీకు తెలుస్తుంది కానీ
అది అటు నుంచి అటే సాగి నీ లోపలి తోటకు
అడవి పాటను నేర్పే సంగతి అప్పటికప్పుడు
అడవికి తెలుస్తుందేమో కానీ నీకు తెలియక పోవచ్చు
స్వీకరించే చేతులతోనే నువ్వు బహిః ప్రాణులకు
జీవన ద్రవ్యాలను ఇష్టంగా అందిస్తున్న సమయాల్లో
నీ లోపల దట్టంగా దర్పమెరుగని దర్భలు మొలకలెత్తి
తివాచీలుగా పరుచుకునే హరితోత్సవాన్ని
నువ్వు అప్పటికప్పుడు కాంచలేకపోవచ్చు
నువ్వు తీరిక వేళల్ని ఆటలుగా పాటలుగా మలుచుకుని
ఆకాశంలోకి పతంగిలా ఆహ్లాదయాత్ర చేస్తున్నపుడు
ఏ వర్ణమయ మనోజ్ఞ లోకాల నుంచో దిగొచ్చిన సీతాకోకలు
నీ లోపలికి వాలి తోటను అలంకరించే కళాకార్యాన్ని
నువ్వు వెంటనే కనిపెట్టలేకపోవచ్చు
కానీ
ఒక వసంతోదయాన నువ్వు వూరి బయట తోట ముందు
ఖాళీ చేతులతో నిల్చుని ఒక పువ్వునూ, ఒక పాటనూ
భిక్షగా అడిగినపుడు తోటను పాడిస్తున్న
కోయిల నీతో రాగ భాషలో అంటుంది కదా!
''నీలో ఒక తోట వుంది, తెలియదా
నేనూ అపుడపుడు వొచ్చి పాడాను కూడా,
నీకు నువ్వే సమద్ధివి, మరి భిక్షనెందుకు అడుగుతావు?''
అపుడు నువ్వు ఆశ్చర్య చిత్తంతో చేతుల్ని చూసుకుంటావు
మట్టి జాడలగుపడుతాయి,
వడివడిగా నువ్వు నీ లోపలికి వెళ్ళీ వెళ్ళగానే
ఫల పుష్ప భరితమైన తోట నిన్ను పలకరిస్తుంది
పరవశంతో నువ్వు పాటెత్తుకుంటావు
పాడుతూంటే అపుడు నీకు అర్థమవుతుంది
తోట నీకు చెందడం కాదు
నువ్వే తోటకు చెందుతావని!
- దర్భశయనం శ్రీనివాసాచార్య,
94404 19039