Sun 08 May 06:21:44.222576 2022
Authorization
'చుట్టూ పదిమంది వున్నారు. పది మంది కాళ్లూ పట్టుకన్నాను. కాపాడమని, వాళ్ళతోనూ మొరపెట్టుకున్నాను. ఎవరూ నా దీన వేడుకోలును వినిపించుకోలేదు. ఇప్పుడెందుకు వస్తున్నారు? ఎవరైనా నాగరాజును తీసుకొస్తారా! ఛీ! సమాజం మీద ఉమ్ముతున్నాను!' కన్నీళ్లు గుండెల్లోంచి ఉబికి రాగా గద్గద స్వరంతో ఆశ్రిన్ సుల్తానా పలికిన పలుకులివి. ఆ సన్నివేశం చూస్తుంటే కన్నీళ్లు రానివారుండరు. అంతటి హృదయవిదారక దృశ్యమది. దు:ఖంలో, ఆవేశంతో అన్నమాటలయినప్పటికీ, చాలా సమంజసమయిన మాటలు. ఎందుకంటే సమాజం అంతటి గడ్డకట్టిన, స్పందనలేని స్థితిలోకి వచ్చేసినట్లే వుంది. ఇతరుల దు:ఖాల పట్ల, పరుల ప్రాణాల పట్ల ఏ కోశాన బాధపడలేని జడ పదార్థంగా సమాజం మారిపోయిందనే ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మొన్న హైద్రాబాద్ నగరంలో నడిరోడ్డుపైన ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు ఆశ్రిన్ సుల్తానాలు బైక్పై వెళ్తుండగా ఆపి, నాగరాజును దారుణంగా కొట్టి చంపుతోంటే, ఆశ్రిన్ చుట్టూ వున్న వారిని ఎంత వేడుకున్నా ఎవరూ ఆపలేకపోయారు. అందుకే ఆ అమ్మాయి తూ... అంటూ సమాజంపై ఉమ్మి వేసింది. చంపింది ఎవరో కాదు.. ఆశ్రిన్ సోదరుడే. మతాంతర వివాహం, వద్దన్నా వినకుండా చేసుకుందన్న కక్షతో పథకం ప్రకారం హత్య చేశారు. ఇది మతాంతర హత్యేకాదు, ఇందులో కుల కోణం కూడా వుంది. నాగరాజు దళితుడు. ఇస్లాం మతాన్ని స్వీకరించేందుకూ ఇష్టపడ్డాడు. అయినా దారుణంగా చంపబడ్డాడు. ఈ పరువు హత్య కొత్తదేమీ కాదు. మొన్నీమధ్యనే భువనగిరిలోనూ జరిగింది. అంతక్రితం అనేకమూ జరిగాయి. మన సమాజంలో తరాలుగా కులపీడన, కుల వివక్షత, కుల అసమానతలు కొనసాగుతూ వున్నాయి. నేటికీ ఆ జాడ్యం వొదలలేదు. మతాల్లోనూ కులాలున్నాయి. వ్యవస్తీకృతమై మరీ సాగుతున్నవి. పాలక వర్గాలూ దీన్ని పెంచి పోషిస్తూ వున్నాయి. ఇప్పుడు మత విద్వేషాలూ రెచ్చగొట్టబడుతున్నాయి.
సమాజాన జీర్ణించుకుపోయిన కుల దురహంకారం అమానవీయంగా ప్రవర్తిస్తుంది. మిర్యాలగూడలో ప్రణరుని, మంథనిలో మధుకర్ని దారుణంగా చంపింది. ఇక్కడ ఇప్పుడు మత దురహంకారమూ తోడు చేరింది. మతమైనా, కులమైనా ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకమయిన పితృస్వామిక సమాజం ఇది. అంత విశాలంగా కుటుంబ వ్యవస్థ ఎదగలేదింకా. ఈ సంఘటనను మత విద్వేషంగా మార్చటానికి అందులోంచి ప్రయోజనాలను ఆశించే శక్తులూ వున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మన సమాజంలో వున్న ప్రతి మతంలోనూ ఉచ్ఛ, నీచ, అగ్ర, అథమ వర్గాలుగా ప్రజలు చీల్చబడే వున్నారు. ఆ రకమైన భావాలతోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది మతపరమైన ద్వేషపు హత్యయితే, ఒకే మతంలో ఎందుకు ద్వేషం వెల్లువెత్తుతోంది? ఎందరు లేరు కులమతాలకతీతంగా జీవనాన్ని సాగిస్తున్నవారు! ప్రతి మతంలోనూ మూఢత్వం, అవివేకం, ఛాందసత్వం వుంటుంది. దాంతో ఎప్పటికీ ఘర్షణా వుంటుంది. అందుకే ఆధునిక కాలానికి అనుగుణంగా మతాలను సంస్కరించేందుకు ఎంతో మంది కృషి చేశారు. మేధావి వర్గం, ప్రజాస్వామికవాదులు నిరంతరం వాటిపై పోరాడుతూనే వున్నారు.
ఇక ప్రతి సమూహంలోనూ మూఢులు, మూర్ఖులు, దుర్మార్గులు వుంటారు. ప్రజాస్వామికవాదులు, విశాల హృదయులు, వివేకవంతులూ వుంటారు. కాబట్టి ఒక దుష్టత్వాన్ని కానీ, రాక్షసత్వాన్ని కానీ మొత్తం ఆ సమూహానికి ఆపాదించడం సరి అయినది కాదు. అలాగే మంచిని కూడా. ఎక్కడ దుర్మార్గముంటే దాన్ని ముక్త కంఠంతో ఖండించాలి తప్ప సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టకూడదు. ఇక నేటి సంఘటనలో సమాజ నిర్లిప్తతను మనం చూస్తున్నాము. కుల, మత, వర్గ బేధాలకతీతంగానే నేటి తరంలో ప్రతిస్పందించే లక్షణం సన్నగిల్లుతోంది. పక్కవాడి బాధ పట్ల, దు:ఖం పట్ల సహానుభూతి కొరవడి పోతున్నది. వస్తు వినిమయ సంస్కృతిలో పడి మానవ సంబంధాలు మృగ్యమయి పోతున్నవి. మార్కెట్ లాభాల మాయాజాలంలో మనకెందుకు అనే తత్వం పెరిగిపోతున్నది. హృదయాలు సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి. ఇది నయా ఉదారవాద విధానాల దుష్ప్రభావం. దీనికి వ్యతిరేకంగా పురోగామి శక్తులు కృషి చేయవలసి వున్నది.