Sun 08 May 07:12:53.476419 2022
Authorization
పసితనం నింపుకొచ్చిన అవ్వ
మొగుడుతో పోట్లాట పెట్టుకొని
అంగట్లో బారేమాడుతుంది..,
బట్టలకొట్టు మల్లి గాని దగ్గర
పచ్చసీర కొనెదానికి
ఆ కొంగు కొస్సకు.,
ఆఠాణా బిళ్ళలు మాదిరి
అక్షరాలను ముడేసినట్టుంది..,
తన అనుభవమంతా
అవ్వ నోటి మాటల్లో
సాత్రాలుగా ఇచిత్రంగ పలుకుతుంటై
నా సంటిగానికి
పొద్దూకి జొన్న గటక చేసిపెడతనని
బతుకు పాటను పాడే నవ్వుతో
కొంగును నడుముకు శెక్కుకునే
ప్రేమ గళ్ళ ''రామక్క'' యాధికొచ్చింది
ఇంటికీ జేరిన సిన్నోనికి
కంటి సూపునెత్తుకున్న పందిట్ల
నడకలో నలిగిన నోటికి, నీళ్ళు పోసి
గొంతు పగుళ్లను తడి చేస్తుండేది
నీళ్ల పదన ఎక్కువయ్యిందేమో
తల్లి ప్రేమంత బురద మడయ్యింది..
పొలంలో నాటేసొచ్చిన
ఆ అవ్వ సేతులు.,
జవెక్కిన కొడుకు వెర్రితనానికి..
ముసలి వాసన కొట్టే
కలుపు మొక్కలా కనిపించినట్లుంది
పొలాల.. గెట్ల పైకాంచీ
బర్ల కావాలికి పోతాంటే
పేగులొర్రిన సప్పుడుని
గుండెకి ఇనిపించిన పోరడు.,
గీ పొద్దున...
ముసలిదాన మూలన సావు అని
సిరాకు నిప్పులు ఇసుర్తుండు..
మైళ్ళ దూరం పయనం చేస్తూ
గతుకు తొవ్వను దాటి.,
ఈడ్సుకపోయిన డొక్క ఆకలి కోసం
అవ్వగారింట్ల బత్తెడు జొన్నలు తెచ్చిన
మా ''సోమవ్వ'' యాధికొచ్చింది
కురుల సాటున కడుపు నొప్పిని
కన్న బిడ్డకు అంటకుండా
''పొగ'' తో ఆరతిచ్చెంతటి
నాకిష్టమైన ''ఆకలిపువ్వు'' తను
బతుకు ధీర పూయించిన పువ్వులెనుక
గడ్డగట్టుకపోయిన పచ్చి గుండెల
నెత్తుటి సప్పుడును.,
సీకటి దూట్ల బందించినోల్లు
మన సుట్టు సాల మందే ఉన్నరు
ఆనాడు రామవ్వ ముడేసిన ముడి
వదులయ్యిందేమో
తల్లి-కొడుకుల బంధం కూడా
గట్లనే పలుచనయ్యింది
నీడను నిలబెట్టిన పందిళ్ళ గుంజలకు
ఏర్రమన్ను అలికినట్టు.,
కసాయి నడుములకే
బంగారు మొలతాడు పేనుతుంటరు
కల్తీ ప్రేమెంటో తెలువని తల్లులు
నరాలు తేలిన కొడుకు తొవ్వలో
పాకురువట్టిన బండ కిందిరికిన నత్తలైపోయిన..
ముసలవ్వలు ఎంతమందో..?
వాళ్ల పై అసహ్యాన్ని పెంచి..
నెత్తురు సచ్చిన కాలానికి.,
సూర్యుడే మాట పలికిస్తడని
వాళ్ళప్పుడు ఊహించి ఉండలేదేమో..?
రాగిపల్లెంలోని ''గటక సల్ల''
పొగాకులతో కలసి శేదెక్కినంక
తన మనసును అడుగుతున్నరిలా..!
తల్లిని అవతలకి నెట్టేసిన ప్రేమకు
వడ్లగింజలలికి ''పాళీ'' సుట్టింది
మేమే కదా..
ఆ ప్రాణానికి పేగు తెంపుకున్నది
ఈ ముసలి కడుపుసంచే కదా... అని
ముద్దులిచ్చి సెంపళ్ళను తడిసేసిన కొడుకు
ఎత్తెదిగినంక.., పెద్దోళ్లోని
అరుసుకునేందుకు అలుపుదీరుతుండు.,
హేళన జేసుకుంట
బజాట్ల బదనాం జేస్తుండు
మళ్లీ ఏ మాటను పైకి ఇసుర్థడో అని
గుండె బరువెక్కిన బుర్కపిట్టలు..,
చిన్న కూ..న మొఖమేసుకొని
మట్టిలో సెయ్యివెట్టి దేవులాడుతున్నరు..
నేను జేసిన తప్పేంటని..?
ఆ దేవుడు ''గాడ్'' కోసం
ప్రశ్నలదండలను అల్లుతూనే.,
ఆ కన్నతల్లుల కన్నీళ్ళు
కళ్ళల్లనే గింజుకుంటున్నై
గట్ల వాకిట్లో పొక్కిల్లు శెక్కిల్లే గానీ
గుంటలు వడ్డ కొడుకుల ద్వేషాన్ని పూడ్చలేకపోయిళ్లు..
గుండె పగిలే దారి ఒడ్డులో
దరికి ఓర్సుకుపోయిన శేతులకు
శీర్కపోయిన దెబ్బల మరకలెన్నో..?
రాలిన ఎరుపు సుక్కలెన్నో..?
ఎవ్వడూ... పట్టించుకోవట్లే
బర్రె ఈనీన ''మాగిని'' పుట్టలో ఎసినట్టు
ఆ అవ్వల మనసంతా నిండు కుండలా
పైకి పైకి వొదిగొస్తుంటే
ఎందుకో అనుకున్న..,
సచ్చేదాక
గొంతు దిగని నికోటిన్ మత్తును.,
అవ్వ సప్పుడును హత్తుకొనని
బిచ్చగాళ్ళ నోటిలో..,
ఇంకా..
కొన్ని నిందలు మోయడానికని.,
మా ''ఆగవ్వ'' ఇడిసివెట్టిన కన్నీళ్లు.,
నాతో మాట్లాడటానికి వెంబడోచ్చినరు
గోరువెచ్చని ''కన్నీళ్ళు''
రక్తంసచ్చి పెచ్చులూడగొట్టుకుంటే
ఆశల పైర ఎండగట్టుకన్నట్టుంది..
ఓపిక సచ్చిన చెట్టు
వేర్లు తెగి పక్కకొరిగింది
నింగివైపు ఎనుకటి జ్ఞాపకాలను
నడుముకి మొలిసిన పైసల సంచిలో
దాసిపెట్టుకున్నట్టు..
మొండిగా.. పస్తుల గాసిందేమో.,
- గా..పొద్దున్నే
గొంతు అరుపును ఆపుకున్నది
టక్కలాకు వెట్టి సాధిన మేకపిల్లలైన
నీ పక్కబట్టలను
నోటితో లాగాటానికి
దొడ్లోకెల్లి బయటికొచ్చినరు..
నీ రక్తాన్ని ఒంట్లో ఒంపుకున్న కొడుకేమో
దేవుని అర్రెల అప్పుకాగితాలను
లెక్కవెట్టడానికి పోయిండు..!!
గొంతులో ఇరికిన
ఆప్యాయతల అనుభూతులన్నీ.,
తోడు నడిచిన సిన్నప్పటి ప్రేమను
తగలబెట్టడానికి వాడుకమేసిండ్రు..
వాళ్ళపై రాశులుగా పోగేసిన
తన తల్లి ప్రేమల్లో.,
పిడికెడు ప్రేమను మాత్రమే గింజలుగా జేసీ
నోట్లో పోసిండ్రు..
ఈ మదించిన రెక్కలు తెగిన తుమ్మెదలకు
చీము నెత్తుటెక్కిన తల్లిపాల స్వచ్ఛతను
తెలుసుకునేది ఎప్పుడో..??
ఆశలకు నలుపు రంగు పూసుకున్న
ఆ ముసలితనాన్ని ప్రేమించేదెప్పుడో..??
- బి శివకుమార్, 91332 32326