Sat 14 May 22:57:49.093643 2022
Authorization
'తిండి కలిగితె కండ కలదోరు, కండ కలిగినవాడె మనిషోరు' అని అప్పుడెప్పుడో గురజాడ మహాకవి పాడుకున్నాడు. మనిషికి ప్రాథమికావసరం తిండే. 'కోటి విద్యలూ కూటి కొరకే' అని ఊరకనే అనలేదు. ఎంత తెలివైన పని చేసే వాడయినా పొట్టకు ఇంత ఆహారాన్ని ఏదో ఒకటి పడెయ్యాల్సి వుంటుంది. కేవలం బతకటానికే తిండి కాదు, మెదడు పని చేయటానికి కూడా ఆహారమే కారణం. అసలు ఆహారం లేకుండా మన శరీరంలో ఏ వ్యవస్థా పని చేయదనేది శాస్త్రం చెబుతుంది. కానీ మన మునులు, రుషులు ఉపవాసాలుంటూ తపస్సు చేస్తూ, ఆహారం ఏమీ లేకుండా ఎలా జ్ఞానాన్ని పెంచుకుంటారో ఏమో మరి! అయితే ఏ పనీ చేయని వాళ్ళకు సైతం ప్రాణం కొనసాగటానికి ఆహారం తప్పనిసరే.
ఆదిమ మానవుడు ప్రకృతిలో దొరికిన ఆకులు అలములు, గడ్డలు, పండ్లు ఏరుకుని ఆహారంగా సేవించాడు. జంతువులను వేటాడి తనకు ఆహారం చేసుకున్నాడు. ఈ ఆహారపు అన్వేషణలోనే మానవుడు విజ్ఞాన గనిలా ఎదిగాడు. నాగరికతను నిర్మించుకున్నాడు. వ్యవసాయాన్ని కనుగొని తన ఆహారాన్ని తను తయారు చేసుకోవటం నేర్చుకున్నాక ఆహారపు హామీ ఒకటి ఏర్పడింది. అంటే పరిణామంలో భద్రతను, భవిష్యత్తు భరోసాను సాధించగలిగాడు. అయితే రాజ్యాలు ఏర్పడ్డాక ఈ భద్రతకు ముప్పు వాటిల్లింది. రాజ్యం బలపడ్డకొద్దీ ప్రజల ఆహార సమస్య పెరుగుతూ వచ్చింది. కావున అప్పటి నుండీ ప్రజలకు అందరికీ తిండి, బట్ట, నివాసం పెద్ద సమస్యగా ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. నాగరిక సమాజాలు ఎదిగాక కూడా ఆహారమనేదే అసలు డిమాండ్‌గా నినదించబడుతోంది. పని దొరకడం, పనికి తగిన ఫలం దక్కడం, దాని ప్రభావంగానే తిండి దొరకడం ఆధారపడి వుంది.
ఇప్పుడు ఈ ప్రస్తావనలన్నీ ఎందుకంటే, ఆహారం అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ముందుకొస్తూంది. మన దేశంలో కూడా మెజార్టీ ప్రజలకు చాలినంత తిండి దొరకటం లేదు. ముఖ్యంగా భావి తరానికి పౌష్టికాహారం అందటం లేదని అధ్యయన నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవజాత శిశివులకు కావాలసినంత ఆహారం అందటం లేదు. మొత్తం జనాభాలో 89 శాతం పిల్లలు, ఆహార కొరతతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణమేమంటే, పేదరికం ప్రధానమయినది. అందుబాటులో ఆహార పదార్థాలు లేకపోవటం, అవిద్య కూడా అని చెబుతున్నారు. ఈ సమస్యను మన దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లలో ఎక్కువగా వుంది. ఆహార లభ్యత మెరుగ్గా వున్న రాష్ట్రాలు మేఘాలయ, కేరళ, సిక్కిం, పాండిచ్చేరి మొదలైనవి వున్నాయి. చిన్న పిల్లలకు కావలసిన ఆహారం అందకపోతే వారి జ్ఞానాభివృద్ధి సన్నగిల్లుతుంది. సామర్థ్యాలు పెరగవు. దీంతో భవిష్యత్తు తరం బలహీన తరంగా తయారవుతుంది. బలహీన తరంతో బలమైన దేశం రూపొందలేదు.
ప్రభుత్వాలు ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి వుంది. గోడౌన్లలో ప్రజలందరికీ కావలసిన ఆహారం నిలువలు వున్నాయి. ఆకలి, పౌష్టికాహార లోపంతో పిల్లలు, ప్రజలు బాధలు పడుతున్నారు. ఈ వైరుధ్య సమస్యకు పాలనా విధానాలే కారణాలు. ప్రజల పట్ల బాధ్యత వహించే ప్రభుత్వాలు, నాయకులు ఆహార సమస్యను పరిష్కరించి, ఉన్నతమైన భావితరాన్ని నిర్మించాల్సిన అవసరం వుంది. మొన్న శ్రీలంకలో ఆహార సంక్షోభం తలెత్తి ప్రజలు తిరుగుబాటు చేశారు. దేశం అస్థిరలోకి వెళ్లింది. మన దేశమూ అలాంటి పరిస్థితులు ఎదుర్కోక ముందే జాగ్రత్త వహించాలి. అన్నపూర్ణ దేశంగా పేరున్న దేశంలో ఆకలితో అలమటించడం, బలహీన భావితరంగా మారటం విషాద సందర్భం. దీనిని అధిగమించాలి.