Sat 21 May 22:52:42.966985 2022
Authorization
ఈ దేశం గర్వించేలా చేయడానికి లింగభేదాలు అడ్డురావు. మత భేదాలూ ప్రాంతాలు, కులాలు ఏవీ ఆటంకంగా నిలబడజాలవు. ఈ నేలపైన పుట్టిపెరిగిన ఎవ్వరయినా అకుంఠిత దీక్షతో శ్రమతో క్రమశిక్షణతో తాము ఎంచుకున్న మార్గంలో కృషి చేస్తూపోతే, ఫలితాలు పొందుతారు. అప్పుడు ఈ నేల నేలంతా ఆనందంతో పొంగిపోతుంది. గర్వంతో తలెత్తుకుంటుంది. ఎవరెన్ని చెప్పినా చివరికి ప్రతి పౌరుడు, పౌరురాలు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ మానవుడిగా ప్రయాణం సాగిస్తారు.
ఇప్పుడు మన నిఖత్ జరీన్, ప్రపంచంలోనే మన దేశం గర్వపడేలా విజయం సాధించింది. దేశానికి బంగారు పతకాన్ని అందించింది. వ్యక్తిగతంగా ఎంతో శ్రమకోర్చి సాధన చేసిన జరీన్, కష్టనష్టాలను, అనేక సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకుపోవటం వల్లనే ఈ మైలురాయిని చేరుకున్నది. వ్యక్తిగా శ్రమించినా దేశపు జెండానే ఎగరేసింది. నూటా ముప్పయి కోట్ల మంది దేశ ప్రజలు ఈ విజయాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన 52 కిలోల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీ ఫైనల్లో థారులాండ్ బాక్సర్ జిట్‌పోంగ్ జుటామస్‌ను చిత్తుచేసి ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజయం వెనకాల ఆమె అనేక సంవత్సరాల కృషి దాగుంది. ముస్లిం మహిళ కావటం చేత బాక్సింగ్ శిక్షణ తీసుకోవటానికి, వస్త్రధారణకూ అనేక విమర్శలు ఎదురయ్యేవి. ఇక ఆడపిల్లలకు ఈ బాక్సింగ్ ఆటేమిటనే ఈసడింపులూ ఎదుర్కొంది. అయినా వెనుకడుగేయకుండా పట్టుదలతో ముందుకు పోయింది జరీన్. తండ్రి జమీల్ అహ్మద్ ఇచ్చిన ప్రోత్సాహం, నైతిక మద్దతు, ఈ విజయ శిఖరాలను చేరుకోవటానికి దోహదపడ్డాయి. భారత బాక్సింగ్ పేరు రాగానే మనకు వినిపించే పేరు మేరీకోమ్. ఆమె వారసత్వంలో ఇపుడు నిఖత్ తన పేరును లిఖించుకుంది.
ఈ అమ్మాయి తెలుగు నేలకు చెందినది కావటం మనకు ఎంతో సంతోషాన్నిచ్చే అంశం. అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ ఘనత వహించడం మనకు ప్రత్యేకంగా ఆనందాన్నిస్తుంది. ఆడపిల్లలని చులకనగా చూడకుండా వారి అభిరుచుల మేరకు ప్రోత్సాహాన్ని అందిస్తే ఏ రంగాల్లోనయినా దూసుకుపోతారని రుజువు చేసే విషయమిది. జరీన్‌తో పాటుగా ఈ టోర్నీలోనే కాంస్య పథకాలను గెలుచుకున్న మనీషా, పర్వీన్‌లు ఎంతో అభినందనీయులు. దేశం తరుపున ఆడిన వీరు గొప్ప పేరును సంపాదించి పెట్టారు.
ఈ సందర్భంగా మనమంతా ఆలోచించాల్సిన విషయాలున్నాయి. ఒకటి ఆడపిల్లల పట్ల ఇప్పటికీ మన సమాజంలో చూపుతున్న వివక్షతల వల్ల ఎంతోమంది పిల్లలు ఎదగలేకపోతున్నారు. ఆడపిల్లలు వంటింటికే పరిమితం కావాలని, పిల్లల్ని కనడానికే వారున్నారని, మనువాద భావాలను ప్రచారం చేస్తున్నారు. ఈ రకమైన భావాలు కలిగిన పార్టీలు, నాయకులు మన దేశాన్ని పాలిస్తూ వున్నారు. ఆడపిల్లల వస్త్రధారణల పట్ల అనేక ఆంక్షలు విధిస్తున్నారు. డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి ఛాందస ఆలోచనలను యువత ఎదిరించాలి. ఇక రెండో విషయం, దేశంలోని ప్రజల మధ్య, యువతలో, విద్యార్థుల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి విభజనలు తీసుకువస్తున్నారు. యువతలో వున్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి ప్రపంచంలోనే దేశాన్ని ముందుండేట్లు చేయాల్సింది పోయి, భేదాలు సృష్టించి విద్వేషాలు పెంచటం వల్ల ఏమీ సాధించలేము.
అందుకనే మత దృష్టికోణం వొదిలి మనిషిలోని శక్తి, ఆసక్తి సామర్థ్యాలను గుర్తించే దృష్టిలోకి రావాలి. ఇప్పుడు నిఖత్ జరీన్ ఫలానా మతం అమ్మాయిగా గర్వపడటం లేదు. భారతీయ బాక్సర్‌గా గర్వపడుతున్నాము. ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా భారతీయుతే ముఖ్యమయినది. జరీన్ భారతీయురాలు. మనమంతా భారతీయులం. ఆ భావనే మన ఆనందానికి కారణం. ఆమె గుండెలపై మెరుస్తున్న త్రివర్ణ పతాకమే ఇప్పుడామె మతం. అంతస్థాయికి ఎదిగేందుకు నిరంతరం శ్రమించిన జరీన్‌కు, ఆమెను తీర్చిదిద్దిన కోచ్‌లకు హృదయపూర్వక అభినందనలు.