Sat 28 May 23:10:17.367527 2022
Authorization
అగ్రరాజ్యమని, అమెరికాలో క్రమశిక్షణ గురించీ, ఆదాయాల గురించీ గొప్పగా చెప్పే వాళ్ళంతా సమాధానాలు చెప్పాల్సిన సమయం. ప్రజలకు రక్షణ ఇవ్వలేని వ్యవస్థ ఇది. ప్రాణాలకు, ఆరోగ్యానికీ రక్షణ ఇవ్వలేదని కరోనా స్పష్టంగా రుజువు చేసింది. ప్రపంచ దేశాలను, వారి సంపదలను కొల్లగొట్టి పెరిగిన వ్యవస్థ అది. అక్కడా తీవ్రమైన సంక్షోభాలు వచ్చాయి. ఉపాధి లేనితనం, పేదరికం, నిరుద్యోగం పెరిగింది. వివక్షతలూ అధికమయ్యాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బున్న దోపిడీదారుడు రక్షణ కోసం దేవులాడుతాడు. అది పొందలేని వాడు అరాచకవాదిలా తయారవుతాడు.
ఉదయం బడికి పంపుతూ పిల్లలకు ముద్దులు పెట్టారు. బైబై అంటూ బస్సెక్కించారు తల్లిదండ్రులు. వాళ్లంతా పది సంవత్సరాల లోపు పసిపిల్లలు. మధ్యాహ్నం అయిందో లేదో! నెత్తురు మడుగులో విగతజీవులుగా నిశ్చలంగా పడి వున్న ఆ పిల్లలను చూసిన తల్లిదండ్రులను తలచుకుంటేనే భయకంపితమవుతున్నది గుండె. ఆ కడుపుకోతను ఎవరు భరించగలరు! ఆ దు:ఖాన్ని ఎవరు ఆపగలరు! దేశాలకు సరిహద్దులకు సంబంధంలేని దు:ఖభరిత దుర్ఘటన, ఘోరకలి. ప్రతి మానవ హృదయాన్ని కలిచి వేసే సంఘటన. మొన్న టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలో రాబ్ ఎలిమెంటరీ పాఠశాలలలోని నాలుగవ తరగతి గదిలోకి వెళ్ళిన రామోస్ అనే 18 ఏండ్ల యువకుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరపగా 19 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవాళ్ళు అక్కడికక్కడే నేలకూలిపోయారు. ఇది వింటేనే భయం వేస్తోంది.
ఈ సంఘటన అమెరికాలో కొత్తదేమీ కాదు, ఇంతక్రితమూ జరిగాయి యిలాంటివి. ఇది మరింత దుర్మార్గమయినది. తరగతి గదిలో రామోస్ ముందుగా ఒక ప్రకటన కూడా చేసాడు. 'మీరంతా చనిపోబోతున్నారు' అని. దానికి ముందుగా అతని నానమ్మను చంపి వచ్చాడు. పద్దెనిమిదేళ్ళకే ఎందుకంత ఉన్మాదిలా మారాడు? తుపాకులు పట్టుకుని తిరగడమేమిటి? ఏమిటీ అమానవీయ సంస్కృతి? ఇదంతా రామోస్ మానసిక పరిస్థితుల వల్ల మాత్రమే జరిగిందా? అక్కడి సమాజ పాత్ర ఏమీ లేదా? అమెరికాలో ఇలాంటి మానసిక దుర్భలత్వానికి కారణమేమిటి? వీటి గురించిన చర్చ చాలా ముఖ్యమయినది. ఈ దుశ్చర్యకు పాల్పడిన రామోస్ అక్కడే పోలీసులచే చంపబడ్డాడు. కానీ ఇలాంటి వాళ్లు ఇక తయారు కాకుండా పోతారా! గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయమని అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించాడు. దేశం మేల్కోవాల్సిన సమయమని ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అన్నారు. వీళ్లే కదా పాలకులు. ఎవరు ఈ గన్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారు మరి! ఆపాల్సిందీ వీరే కదా! దీనికి బాధ్యత వహించే వారెవ్వరు? 18 సంవత్సరాలు దాటగానే తుపాకీని కలిగి ఉండటానికి వాడటానికి అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు రక్షణ దేశం కల్పించలేదు కనుక ఎవరికి వారే రక్షణ పొందటానికి. వాటికి లైసెన్సులు కూడా ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాలో దాదాపు 32 కోట్ల జనాభా వుంటే, 39 కోట్ల తుపాకీలు వ్యక్తిగత వాడకంలో వున్నాయి. ఏటా ఇలాంటి కాల్పుల్లో 30,000 మంది బలి అవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదంతా అక్కడి ప్రజలకు ఆ వ్యవస్థ అందిస్తున్న ప్రతిఫలం! అక్కడి పాలకులిస్తున్న బహుమానం!
అగ్రరాజ్యమని, అమెరికాలో క్రమశిక్షణ గురించీ, ఆదాయాల గురించీ గొప్పగా చెప్పే వాళ్ళంతా సమాధానాలు చెప్పాల్సిన సమయం. ప్రజలకు రక్షణ ఇవ్వలేని వ్యవస్థ ఇది. ప్రాణాలకు, ఆరోగ్యానికీ రక్షణ ఇవ్వలేదని కరోనా స్పష్టంగా రుజువు చేసింది. ప్రపంచ దేశాలను, వారి సంపదలను కొల్లగొట్టి పెరిగిన వ్యవస్థ అది. అక్కడా తీవ్రమైన సంక్షోభాలు వచ్చాయి. ఉపాధి లేనితనం, పేదరికం, నిరుద్యోగం పెరిగింది. వివక్షతలూ అధికమయ్యాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బున్న దోపిడీదారుడు రక్షణ కోసం దేవులాడుతాడు. అది పొందలేని వాడు అరాచకవాదిలా తయారవుతాడు.
రామోస్‌కు జరిగింది అదే. అతనికి చిన్నప్పటి నుండీ ఆర్థిక ఇబ్బందులు వున్నాయి. తన పేదరికపు చింపిరి జుట్టూ, మురికి బట్టలను చూసి తోటి పిల్లలు ఎగతాళి చేస్తూ అసహ్యించుకొనేవారు. అందువల్ల చదువు మధ్యలోనే మానేసాడు. సమాజంపై విరక్తితో ద్వేషపూరితంగా అతని మనస్తత్వం మారి ఈ ఉన్మాదానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ వ్యత్యాసాల వ్యవస్థ మనుషుల్ని ఇలా తయారు చేస్తుంది. అందరూ మంచిగా వుండగలిగే వ్యవస్థే అందరికీ రక్షణ ఇవ్వగలుగుతుంది.