Sat 04 Jun 23:13:49.088474 2022
Authorization
కాశ్మీరు సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నారు పాలకులు. కానీ అక్కడి ప్రజల, పౌరుల హక్కులను కాపాడి ఒక ప్రజాతంత్ర వాతావరణాన్ని కల్పించటంలో నేటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. 1989లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడూ అవే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు చేసిన తప్పులనే చేస్తున్నాయి. అక్కడి ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. పైగా 'కాశ్మీర్ ఫైల్స్' సినిమాను ప్రచారం చేస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయి. పండిట్లు నష్టపోయారని, వలసపోయారని, మత విభజనను మరింత సెగను ఎగదోసిన వారు, పండిట్ల సంక్షేమానికి, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.
కాశ్మీర్ అనగానే మనకు అందమైన మంచుకొండల దృశ్యాలు, తులిప్ పూల పరిమళాలు, వనాలు, లోయలు, ప్రవహించే ఝరులు, పడవల ప్రయాణాలు, ఎర్రని నోరూరించే యాపిళ్లు, అందాలొలికే అల్లికలు, శాలువాలు, పూల సమూహాలు... ఇలా ఎన్నో ఎన్నో కళ్ల ముందర శోభిల్లుతాయి. మన దేశానికి తలమానికమైన జమ్మూకాశ్మీరు నిజంగానే తలపై కిరీటంలా దృగ్గోచరమవుతుంది. కానీ ఇప్పుడక్కడ రక్తపు అడుగుల సవ్వడి వినబడుతోంది. నెత్తురు కాసారం ప్రవహిస్తోంది. పరిమళాల తలంలో పరితప్త హృదయాలు, లోయల్లో పడిపోయిన రక్షణతో గుండెలు పగులుతున్న దృశ్యాలు. కాశ్మీరిప్పుడు పర్యాటక నేల కాదు రాజకీయ మతోన్మాద బేరగాళ్ల నెలవు. వ్యాపారులకు అమ్ముడవుతున్న సరుకు.
కాశ్మీరు స్వయంప్రతిపత్తిని తొలగించి 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, మూడు ముక్కలుగా జమ్మూకాశ్మీరును చేసి, ప్రశాంతత చేకూరుతుందని, పరిష్కారం కనుగొన్నామని ప్రగల్భాలు పలికిన నాయకత్వాలు, ఇప్పుడు ఏం చేయనున్నాయో తెలియటం లేదు. జమ్మూలో పనిచేస్తున్న ఉద్యోగులను, పౌరులను, ఎవరు ఎప్పుడు, ఎక్కడి నుండి వచ్చి చంపుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెలలో ఎనిమిది మంది ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. ఉగ్రవాదులకు సైన్యానికి జరిగిన కాల్పుల్లో సైనికుడూ మృతి చెందాడు. మొన్న ఒక స్కూల్ టీచర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు, నిన్న బ్యాంక్ మేనేజర్‌ను హతమార్చారు. అంతక్రితం టీవీ నటి అమ్రీన్ భట్‌ను హత్య చేశారు. కాశ్మీరులో శవాలపై పేలాలు ఏరుకునే విధంగా రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. అక్కడ రగులుతున్న చిచ్చును చిత్త శుద్ధితో పరిష్కరించేదిపోయి, మరింత ఆజ్యంపోస్తున్న తీరు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది.
కాశ్మీరు సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నారు పాలకులు. కానీ అక్కడి ప్రజల, పౌరుల హక్కులను కాపాడి ఒక ప్రజాతంత్ర వాతావరణాన్ని కల్పించటంలో నేటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. 1989లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడూ అవే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు చేసిన తప్పులనే తిరిగి చేస్తున్నాయి. అక్కడి ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. పైగా 'కాశ్మీర్ ఫైల్స్' సినిమాను ప్రచారం చేస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయి. పండిట్లు నష్టపోయారని, వలసపోయారని, మత విభజన సెగను ఎగదోసిన వారు, పండిట్ల సంక్షేమానికి, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.
బ్యాంకు మేనేజరు హత్యోదంతం అందరినీ కదిలించింది. అన్ని రాజకీయ పార్టీలూ దీనిని ఖండించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే తిరిగి అలజడులు పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు మంత్రులు రాజీనామా చేయాలనీ కోరాయి. ఉద్యోగులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. వేలాదిమంది ప్రజలు ప్రాణాలరిచేతుల్లో పెట్టుకుని వలస బాట పడుతున్నారు.
ఒక వైపు అస్థిరతతో ప్రాణభయంతో ప్రజలు వేదనకు గురవుతుంటే కాశ్మీరులోని సహజ సంపదను, పర్యాటక వ్యాపార కేంద్రాలను ప్రవేటు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం పనిచేస్తూనే వున్నది. అక్కడి నేలపైకి రియలస్టేట్ డేగలా వాలాయి. సహజ సంపదలను వ్యాపారాలకు ధారాదత్తం చేస్తున్నారు. కానీ అక్కడి యువతకు, శ్రామికులకు ఉపాధిని సమకూర్చే పనికి పూనుకోవడం లేదు. లోయలో పేదరికం పెరిగిపోతున్నది. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ నిర్బంధాలకు ఒడిగడుతున్నారు. దీంతో ప్రజలలో నిరసన పెరుగుతున్నది. నిరాశ నిస్పృహకు లోనవునతున్న యువత పెడమార్గం పట్టే అవకాశం ఎక్కువయింది.. స్థానిక నాయకులతో, అన్ని పక్షాలతో చర్చలు జరిపి, శాంతిని నెలకొల్పే చర్యలను చేపట్టి కాశ్మీరు సోయగాలను కాపాడుకోవాల్సి వుంది. ప్రజలకు రక్షణ కల్పించి గాయాలను మాన్పాల్సి వుంది.