Mon 06 Jun 03:38:31.570861 2022
Authorization
తెంపితే తెగిపోవడానికి దారం గాదు
తగులబెడితే బూడిదై పోవడానికి కట్టేగాదు
ఊదితే పగిలిపోవడానికి గాలిబుడుగ గాదు
కుదిపితే కూలిపోవడానికి బర్లకొట్టం గాదు
అతనొక మేరు పర్వతం
దేశానికి తోవ చూపిన నేత
పరిపాలనకై
సంవిధానాన్ని అందిచ్చిన విశ్వ మేదావి
స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వాలను
దోసిట్లకొంపిన సమతామూర్తి
పేరునే జీర్ణించుకోలేక పోతున్నరు
సాటి మనుషులనెప్పుడు సమంగా చూస్తరు
ప్రపంచీకరణ ప్రయివేటికరణ సరళీకరణలా
అసమానతలతో పరిగెత్తిపోతున్న దేశం
వివక్షల స్వాతంత్య్రం
బొడ్రాయిపండుగలా వెలిగిపోతున్నది
నీ కండ్లుల్ల నీవే ముండ్లు గుచ్చుకొని
నిన్నునీవు గుర్తించుకుపోలేకపోతున్నవు
తోటివారిని కీర్తించలేకపోతున్నవు
మురుగు పూసుకొని ఊరేగి
ప్రపంచానికెట్ల ఆదర్శమైతవు
మనిషిగా ఇంకెప్పుడు మిగిలిపోతవు
మహౌన్నతుడిగా ఇంకెన్నడు నిలిచిపోతవు
ఓ విద్వేషకుడా !
సమదష్టిలేని నీ దక్పథాన్ని
నిలువునా తగులబెట్టు
కుల్లిపోయిన మనుసును నిలువునా పాతిపెట్టు
పురుగుపట్టిన నీ ఆత్మకు పిచికారిచేయి
పరిమళమేలేని నీ మనుసును నలిచేయి
నది ప్రవహించడమే బాధ్యత
మొగ్గ పుష్పించడమే విధి
చెట్టు విస్తరించడమే హరితాశయం
రత్నం మెరువడమే గుణం
నీవు కుంచించుకుపోవడమే లెజెండ్
దేశం తలనిండా పుండ్లను చూసి
ప్రపంచం తుప్పున ఊస్తున్నది
అఖండ భారత్ కాదు
అంటరాని అమానవీయాల భారత్
కుటిల కుట్రల వజ్రోత్సవాల భారత్ !
(అంబేద్కర్ జిల్లా కోనసీమకు మద్దతుగా)
- వనపట్ల సుబ్బయ్య, 9492765358