ఎండాకాలం మోడుబారిన మా బడి శెట్టు తొలకరికి మారాకు వేస్తుంది లేత లేత మొగ్గలను తొడుగుతుంది రంగు రంగుల పూలను పూస్తుంది అందంగా పూసిన ఆ పూలన్నీ మా బడి పిల్లల ముఖాలేనండి కొన్ని కొత్త కోయిలలొచ్చి మా బడి కొమ్మపై వాలి కూ..కూ..లు కూస్తాయి ఆ కూతలన్నీ మా బాలల కేరింతలేనండి వాళ్ళట్ల రంగుల సంచులేసుకుని తొవ్వొంటి నడుసుకుంట వత్తంటే... సింగిడే నేల దిగి బల్లోకి వత్తన్నట్లుంటది పిల్లలందరూ ఒక్కకాడ కూడితే... తీరొక్క రంగు పూల పొదుగుకున్న సద్దుల బతుకమ్మ తీరుగుంటది మా బడి ఆటస్థలమే శిబ్బై మోత్తది
మా బడి గంటనే... కైకిలోయేటోళ్ళకు అలారం మా బడి గంటనే... ఊరి శేతికి తొడిగిన గడియారం
రాతిరాకాసం పై సుక్కలోలే మా నల్లబల్ల మీన అచ్చరాలు మెరుత్తయి అచ్చం మా పిల్లగాల్ల నవ్వులోలే అంబటాల్లకు బడిడువంగనే ఉరికే పిల్లల జూత్తే... మడికట్లల్ల స్వేచ్చగా ఎగిరెగిరి తల్లావు పొదుగుకొరకు ఉరికే లేగదూడల జూసినట్టుగుంటది. (పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా...)