Sat 02 Jul 23:46:47.46528 2022
Authorization
ఇప్పుడు పరీక్షలయ్యాక, వాటి ఫలితాలు వచ్చాయంటే, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని స్థితికి వచ్చింది. ఫెయిల్ అయ్యారని విద్యార్థులు అనేక మంది జీవితాలనే ముగిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు లబోదిబో మంటన్నారు. దీనికి తోడు మార్కుల ప్రకటనలో అవకతవకలు, వాల్యూయేషన్‌లో లోపాలు, కంప్యూటర్ పొరపాట్లు వెరసి భావిపౌరుల జీవితాలు ముగిసిపోతున్నాయి. ఇది మాత్రమే కాదు ఐఐటి విద్యార్థులు, ఎం.బి.బి.ఎస్. చదువుతున్న విద్యార్థులు చదువు ఎక్కక, అర్థంకాక, చదవలేక వొత్తిడికి లోనై ప్రాణాలు విడుస్తున్న సంఘటనలనూ చూస్తున్నాము. ఇన్ని దాటుకుంటూ చదివేసినా తిరిగి ఉద్యోగాలకై నిర్వహించే టెస్ట్‌ల్లో ఉత్తీర్ణం కాలేక నిస్పృహలోకి పోయి జీవితాలను ముగిస్తున్న వాళ్లూ వున్నారు.
పరీక్ష అనగానే మనకు విద్యార్థులు రాసే పరీక్షలు గుర్తుకొస్తుంటాయి. చదువుకునే విద్యార్థులు సంవత్సరాంతాన ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు కూర్చొని ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుంది. అప్పుడే పై తరగతికి వెళ్లగలుగుతారు. ఈ పరీక్షలు, వాళ్లు చదివిన పుస్తకాలకు సంబంధించినదై వుంటుంది. పుస్తకాల్లో వున్న విషయాలు ఎన్ని గుర్తుంచుకోగలిగితే అంత తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంటారు. విషయాలు జ్ఞాపకముండటమనేది గుర్తించవలసిన విషయం. జ్ఞాపకం వేరు, జ్ఞానం వేరు. ఏదైనా ఒక విషయాన్ని చదివి, బోధన ద్వారా తెలుసుకుని అవగాహన చేసుకోవటం, అవగాహన అయిన విషయాన్ని ఆచరణలో అన్వయించి బేరీజు వేసుకోవటం జ్ఞానానికి సంబంధించినది. అయితే ఇప్పటి చదువులన్నీ జ్ఞాపకశక్తినే జ్ఞానంగా కొలుస్తున్నాయి. ఆ కొలిచే దానికోసమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షల్లో పిల్లలు రాసిన సమాధానాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు కూడా పుస్తకాల్లోని అంశాలకు అచ్చంగా సరిపోలాయా? లేదా? అనేది చూసి మార్కులు ఇస్తారు తప్ప, విద్యార్థికి అవగాహన అయిందా లేదా అని ఆలోచించరుగాక చించరు. అందుకని చదివేటప్పటి నుండే విద్యార్థులు బట్టీ పట్టే విధానాన్ని అనుసరిస్తున్నారు. అందుకోసం నిరంతరం పఠనం... పఠనం... చదివిందే చదివి, చదివి ఒక మిషన్ మాదిరి మెదడును తయారు చేస్తున్నారు. విశ్లేషణ, విచక్షణా సామార్థ్యాలు అడుగున పడిపోయి బండ మెదళ్ళ భావితరం తయారవుతున్నది. దీనికితోడు విద్యా వ్యాపారీకరణ పెరిగిన తర్వాత డబ్బులతో మార్కులు కొనుగోలు చేసే ప్రయత్నంగా చదువులు మారిపోయాయి. ఎన్ని మార్కులు ఎక్కువ వస్తే అంత వ్యాపారం సాగుతుందనే ధోరణే సంస్థలకు పెరిగింది. అంటే డబ్బులు పెట్టి ప్రవేటు విద్యాసంస్థలో చేరటమంటే మరింత ఒత్తిడి పెంచుకోవటం. తల్లిదండ్రులు కూడా ఎంత ఎక్కువ డబ్బును పిల్లల మీద వెచ్చిస్తే అంత ఉన్నతులుగా సమాజంలో చూస్తున్నట్లుగా భావించి, పిల్లలపై ఒత్తిడిని పెంచుతున్నారు. ఇలా అన్ని వైపుల నుండీ ఒత్తిడితో కూడిన పరీక్షను నేటి బాల్యం ఎదుర్కొంటోంది.
ఇప్పుడు పరీక్షలయ్యాక, వాటి ఫలితాలు వచ్చాయంటే, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని స్థితికి వచ్చింది. ఫెయిల్ అయ్యారని విద్యార్థులు అనేక మంది జీవితాలనే ముగిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు లబోదిబోమంటన్నారు. దీనికి తోడు మార్కుల ప్రకటనలో అవకతవకలు, వాల్యూయేషన్‌లో లోపాలు, కంప్యూటర్ పొరపాట్లు వెరసి భావిపౌరుల జీవితాలు ముగిసిపోతున్నాయి. ఇది మాత్రమే కాదు ఐఐటి విద్యార్థులు, ఎం.బి.బి.ఎస్. చదువుతున్న విద్యార్థులు చదువు ఎక్కక, అర్థంకాక, చదవలేక వొత్తిడికి లోనై ప్రాణాలు విడుస్తున్న సంఘటనలనూ చూస్తున్నాము. ఇన్ని దాటుకుంటూ చదివేసినా తిరిగి ఉద్యోగాలకై నిర్వహించే టెస్ట్‌ల్లో ఉత్తీర్ణం కాలేక నిస్పృహలోకి పోయి జీవితాలను ముగిస్తున్న వాళ్లూ వున్నారు.
ఇంత పెద్ద యెత్తున మన విద్యారంగంలో విద్యార్థులపై వొత్తిడి పెరుగుతోంది. మన విద్యావ్యవస్థ విద్యా పద్ధతుల్లోనే లోపం వుంది. విజ్ఞానాన్ని ఎలా పొందుతామనే అవగాహనలోనూ లోపం వుంది. పరీక్షా విధానమూ అసంబద్ధంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంలోనే ఐన్‌స్టీన్ అన్న మాటలు గుర్తుకురాక మానవు. 'ఒక చేపకు చెట్టు ఎక్కటంలో పరీక్ష పెడితే, అది తన జీవితం మొత్తంలో కూడా ఓడిపోతూనే వుంటుంది' అని. కావున పిల్లల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ వుంటుంది. అది గుర్తించి, గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రోత్సహించాలి. అందులోనే శిక్షణనివ్వాలి. అంతేకాని ఏ విద్యనేర్చుకుంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చో ఆదాయం వస్తుందో అని పిల్లలపై బలవంతంగా రుద్దితే ఇలాంటి పరిణామాలు ఎదురౌతాయి.
ఎన్ని పరీక్షలు రాసినా, జీవితపు పరీక్ష ఎప్పుడూ మనకు సవాలుగానే వుంటుంది. వాటికి సంబంధించిన ఏ పరిజ్ఞానమూ, నైపుణ్యమూ పొందలేని విద్యార్థులు నిజజీవితంలో ఓడిపోతూనే వుంటారు. చదువైనా, సంపాదనైనా, జ్ఞానమైనా మనకోసమే కానీ వాటి కోసం మనం కాదు. జీవితాన్ని సృజనాత్మకంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పేదే అసలైన విద్య. అందుకు సాధనంగా పరీక్షలుండాలి గానీ పరీక్షలు, ఫలితాలు జీవితాలు కాదు. అన్నింటికంటే గొప్పనైనది జీవితమనే ఎరుక కలిగి వుండాలి.