Mon 18 Jul 02:54:17.433919 2022
Authorization
నిన్నటివరకూ.. యీ అడవి
పురివిప్పిన నెమలిపిట్టలా ఎంత బావుండేదో ..!
పచ్చనికెరటాలమీద ఎగిరే పక్షులూ ..
తూరుపు తురాయికొమ్మకు వేలాడే సూరీడూ ..
చీకటికోనేటిలో సేదదీరుతున్న
అడవిఏనుగుల గుంపులాంటి నల్లని కొండలూ ..
నల్లని కొండలనెత్తిమీద నీలిమబ్బుల కడవలూ ..
ఎవరో ఆదివాసీ ముసల్ది అడ్డపొగొదిలినట్టు
తెలిమంచూ తెరలూ ..
కొండగాలి అలలమీంచి తేలివచ్చే పిల్లంగోవి పాటా ..
శీతవేళ నెగళ్లచుట్టూ గంటేసుక్కూర్చున్న
చిన్ని చిన్ని తేనెపిట్టలూ ..
విప్పపూల పరిమళాల మత్తుగాలీ ..
పూలబుట్టలాంటీ అడవిని జూసీ ..
అంతటి చుక్కల ఆకాశమే చిన్నబోయేది !
పూల రాశులమీంచి నడుస్తున్నట్టూ ..
ఆకుపచ్చని నదిమీద అలా విహరిస్తున్నట్టూ ..
కొండల సిగల నుండి జాలువారుతూ
వాగులు గలగలా నవ్వుతున్నట్టూ ..
నిన్నటిదాకా యీ అడవిలో ..
ఎన్నెన్ని పురా జ్ఞాపకాలను మోసుకు తిరిగేదో ..!
ఆకులదొన్నల్లో చీమల గుడ్లను
వగరు వగరుగా ఒలుచుకు తిన్నట్టూ ..
పుట్టతేనెలో ముంచిన ముంజేతిని నాకుతున్నట్టూ ..
దొనిగర్రతో నెలవంకను తెంపి
నట్టింట దీపాన్ని జేసినట్టూ ..
నిన్నటిదాకా ..
ఈ అడవితల్లి ఒడి ఎంత చల్లగా ఉండేదో ..
కొన్ని గురుతులు
చచ్చేదాకా గుండెల్లోంచి చెరిగిపోవు ..
మరికొన్ని జ్ఞాపకాలు ఎంతకీ మరపుకు రావు !
ప్రతి అడవికీ ఒక కథ ఉంది
ప్రతి కథ వెనకాలా పొగిలే కన్నీటి వ్యధా ఉంది
ఆకుపచ్చని అడవి మాటున కనిపించని చీకటీ ఉంది
కానీ.. యివాల దాని గోడు వినేందుకు
ఒక పున్నాగ పూలచెట్టులాంటి మనిషే లేడు ..!!
- సిరికి స్వామినాయుడు
94940 10330